35.2 C
Hyderabad
April 20, 2024 16: 42 PM
Slider ప్రత్యేకం

Opinion: ఓట్ల కొట్లాటకు తాజా వేదిక దుబ్బాక

#DubbakaElection

దుబ్బాక ఉపఎన్నికల నేపథ్యంలో ప్రధాన రాజకీయపార్టీలు తెరాస,  కాంగ్రెస్, బీజేపీలు చాకచక్యంగా పావులు కదుపుతున్నాయి. తెలంగాణా రాష్ట్రంలో సుమారు రెండు సంవత్సరాల తర్వాత చోటు చేసుకుంటున్న ఉపఎన్నిక పై రాజకీయ పక్షాలు మల్లగుల్లాలు పడుతున్నాయి.

ఉపఎన్నికకు దారితీసిన సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మిక మరణాన్ని సానుభూతి ఓటు బ్యాంకుగా మార్చుకుని ఆ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకోవాలని అధికార తెలంగాణ రాష్ట్ర సమితి గట్టిగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే దివంగత శాసనసభ్యుని సతీమణి సోలిపేట సుజాతకు బిఫామ్ ఇచ్చింది.

తెరాసకు కంచుకోటలా ఉన్న దుబ్బాక

దుబ్బాక నియోజకవర్గ సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న సోలిపేట కుటుంబానికి పోటీచేసే అవకాశం ఇవ్వడం సహేతుకం అని ఆలోచించి ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. 2014 శాసనసభ ఎన్నికలలో దుబ్బాక నియోజకవర్గంలో  తెరాస పార్టీ 53.37 శాతం ఓట్లతో ఘన విజయం సాధించింది.

కాగా తెదేపా అభ్యర్ధి చెరుకు ముత్యం రెడ్డి కేవలం 16.31 శాతం ఓట్లు పొందగా బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన రఘునందన్ రావు 9.82 శాతం ఓట్లకే పరిమితమయ్యారు. 2018 ఎన్నికలలో సైతం తెరాస 54.36 శాతం ఓట్లు సాధించి ఆ స్థానం కైవసం చేసుకుంది. కాంగ్రెస్ నుంచి పోటీచేసిన మద్దుల నాగేశ్వరరెడ్డి 16.31 శాతం ఓట్లు పొందగా, బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన రఘునందన్ రావు 13.75 శాతం ఓట్లు మాత్రమే దక్కించుకోగలిగారు.

తలపడుతున్న జాతీయ పార్టీలు

తాజా ఎన్నికలలో తెరాస నేత దివంగత చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ తీర్దం పుచ్చుకుని ఆ పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. బీజేపీ పార్టీ తరఫున రఘునందన్ రావునే పోటీచేసే అభ్యర్థిగా ఖరారు చేసింది.

దుబ్బాక నియోజకవర్గం నిలబెట్టుకోవడం అధికార తెరాసకు ఎంత ముఖ్యమో ప్రధాన పోటీదారులైన కాంగ్రెస్, బీజేపీలకు అంతే ముఖ్యంగా స్వీకరించి ఎన్నికల కసరత్తు ప్రారంభించినట్లు కనిపిస్తోంది. దుబ్బాకలో జరిగిన అభివృద్ధి పైనే ఎన్నిక  ఫలితం ఆధారపడి ఉంటుందని పరిశీలకుల భావన.

దుబ్బాక అభివృద్ధి అంతంత మాత్రమే

ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వెల్ లేదా ఆర్ధికమంత్రి  టీ. హరీష్ రావు ప్రజాప్రతినిధిగా ఉన్న సిద్ధిపేట నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి చోటుచేసుకున్న స్థాయిలో సరిహాద్దుల్లో ఉన్న దుబ్బాక నోచుకోలేదని కాంగ్రెస్ వర్గాలు విమర్శిస్తున్నాయి.

చెరుకు ముత్యంరెడ్డి దుబ్బాక నుంచి నాలుగు సార్లు గెలిచినా నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేయలేదని తెరాస దుయ్యబడుతోంది. కేంద్రంలో బీజేపీ చేపట్టిన వ్యవసాయ సంస్కరణ బిల్లులను, విద్యుత్ శాఖపై ప్రైవేటు శక్తుల అజమాయిషీ, రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన జీఎస్ టీ బకాయిలు, ఇతర ఆర్ధిక వెసులుబాటు వంటి అంశాలపై తెరాస ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.

ఫెడరల్ స్ఫూర్తి కి విఘాతం కలిగించే విధంగా కేంద్రప్రభుత్వం రాష్ట్రాలపై అధికారం చేలాయిస్తోందని తెరాస బహిరంగంగానే విమర్శిస్తోంది. దుబ్బాక ఉపఎన్నిక తిరిగి కైవసం చేసుకుని తెరాస కు తిరుగులేదన్న సంకేతం ఇవ్వాలని తెరాస పూర్తిస్థాయిలో అస్త్ర శస్త్రాలు సిద్ధంచేసుకుంది.

దుబ్బాకలో పాగాకు బిజెపి ప్రయత్నం

అయితే….నిజామాబాద్ తో సహా కీలక పార్లమెంట్ స్థానాలు చేజార్చుకున్న తెరాస దుబ్బాక స్థానంలో గెలవడం అసాధ్యమని బీజీపీ అంచనా వేస్తోంది. ప్రస్తుత కరోనా కష్టకాలంలో సైతం ప్రజలకు పూర్తి స్థాయిలో ఆరోగ్య పరిరక్షణ చర్యలు చేపట్టడంలో తెరాస ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీజేపీ ఘాటుగా విమర్శిస్తోంది.

దుబ్బాక ఎన్నిక విజయం 2024 ఎన్నికలకు రాచబాట వేయగలదని ఆ పార్టీ బలంగా విశ్వసిస్తోంది. గులాబీ పార్టీకి ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా కాషాయ పార్టీ పునాదులు నిర్మాణం చేస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

కానీ ….క్షేత్రస్థాయిలో బీజేపీ కార్యకర్తల లో రఘునందన్ రావు అభ్యర్థిత్వంపై అసంతృప్తి ఉన్నట్లు సమాచారం. ఒక నేర చరిత్ర ఉన్న అభ్యర్థిని సమర్ధించడం పై దుబ్బాక కు చెందిన బీజేపీ శ్రేణులలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

స్థానిక బీజేపీ నేత తోట కమలా కర్ నిరసన ప్రకటించడంతో ఆయనను పార్టీనుంచి బహిష్కరించారు. ఉపఎన్నికలలో తెరాస టికెట్ ఇస్తుందని ఆశించి భంగపడి కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ దక్కించుకున్న శ్రీనివాస రెడ్డికి నియోజవర్గ కాంగ్రెస్ శ్రేణులు ఏ మేరకు సహకరిస్తాయో తేలాల్సివుంది. తెరాస ఓట్లకు గండిపడితే సాంప్రదాయ కాంగ్రెస్ ఓట్లతో దుబ్బాక స్థానం గెలుపు సాధ్యమేనని కాంగ్రెస్ కు చెందిన నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్న అంశాలు

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కేటాయింపులో లొసుగులు,ఇంటింటికి తాగునీరు, ఉద్యోగాల కల్పన, తాజాగా ప్రభుత్వం ప్రకటించిన ఎల్ ఆర్ ఎస్ వంటి అంశాలను కాంగ్రెస్ ఆయుధాలుగా స్వీకరించి పాలక తెరాస ప్రభుత్వాన్ని విమర్శిస్తోంది.

నియోజకవర్గ పరిధిలోని ప్రతి మండలానికి  ప్రతినిధులను  నియమించి కాంగ్రెస్ అధిష్టానం గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇటీవలే తెలంగాణ కాంగ్రెస్ ఇన్ ఛార్జిగా బాధ్యత తీసుకున్న తమిళనాడు ఎంపీ మాణిక్ ఠాగోర్ కు దుబ్బాక ఉపఎన్నిక ఒక సవాలు వంటిది. 

అదే విధంగా బీజీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు  దుబ్బాక విజయం చారిత్రక అవసరం. ఈ ఉపఎన్నిక తెరాస మంత్రి హరీష్ రావు రాజకీయ చతురతకు ఓ పరీక్ష.

త్రిముఖ పోటీలో విజయం దక్కించుకునే పార్టీపై 2024 ఎన్నికల వ్యూహప్రతివ్యూహా లు రూపుదిద్దుకోగలవని రాజకీయ నిపుణులు ఊహిస్తున్నారు.

పొలమరశెట్టి కృష్ణారావు

Related posts

హరిజన వాడ స్కూలుపై సర్కారు నిర్లక్ష్యం

Bhavani

సైకిల్ టూరిస్టు ఆష కు పోలీసుల అభినందన

Bhavani

కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను సమైక్యంగా ఎదుర్కోవాలి

Satyam NEWS

Leave a Comment