పార్టీ పరాజయం పాలైనా ఏ మాత్రం చలనం లేకుండా పదవిలో కొనసాగే వారిని ఏమనాలి? అదీ కూడా చిన్నా చితకా పోస్టు కాదు పార్టీ అధ్యక్ష పదవి. ఏమనాలో అర్ధం కావడం లేదు కానీ ఆ పని చేస్తున్నది రెండు జాతీయ పార్టీలకు చెందిన ఇద్దరు రాష్ట్ర విభాగం అధ్యక్షులు. వారే తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్. 2018 డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈ ఇద్దరూ పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు.
అసెంబ్లీ ఎన్నికలలో ఈ రెండు పార్టీలూ ఘోరంగా ఓడిపోయాయి. కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలతో కలిసి అధికారంలోకి వద్దామని ప్రయత్నించింది. అయితే రాలేకపోయింది. రాలేక పోవడమే కాదు. ఉన్న సీట్లను కూడా కోల్పోయింది. పార్టీ దారుణ పరాజయం తర్వాత పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాల్సి ఉంది. అయితే ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, తెలంగాణ వ్యవహారాల శాఖ ఇన్ చార్జి కుంతియాకు నచ్చచెప్పి పదవిలో కొనసాగారు తప్ప పదవి వీడలేదు.
నైతిక బాధ్యతను ఉత్తమ్ కుమార్ రెడ్డి పక్కన పెట్టేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఎం ఎల్ ఏలు అందరూ ఒక్కొక్కరుగా టిఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయించారు. అయినా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేయలేకపోయారు. పార్టీ ఎంఎల్ ఏలు ఫిరాయిస్తుంటే అడ్డుకోలేక తన నిస్సహాయతను ఆయన ప్రదర్శించారు. అప్పుడు కూడా నైతిక బాధ్యత వహించలేదు. ఇప్పుడు తన సొంత నియోజకవర్గం అయిన హుజూర్ నగర్ ఉప ఎన్నికలో దారుణ మైన ఓటమిని చవి చూశారు. అయినా పదవి నుంచి తప్పుకోవడం లేదు. అది తన సొంత స్థానం, పోటీ చేసింది తన సతీమణి.
అయినా గెలిపించుకోలేకపోయారు. అయినా పదవిని వదలడం లేదు. లోక్ సభ ఎన్నికలలో నైతిక బాధ్యత వహించి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం చేయలేదు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ మళ్లీ వచ్చేందుకు ఇష్ట పడక పోవడంతో చాలా మంది పిసిసి అధ్యక్షులు సంఘీభావంగా రాజీనామాలు చేశారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం చేయలేదు.
ఇది ఈయన కథ కాగా బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్ కథ కూడా ఇందుకు భిన్నంగా లేదు. ఆయనా అంతే ఐదుగురు బిజెపి సభ్యులు ఉన్న తెలంగాణ అసెంబ్లీలో ఆ సంఖ్య ఒకటికి పడిపోయినా ఆయన నైతిక బాధ్యత తీసుకోలేదు. పోటీ చేసిన స్థానంలో ఆయన స్వయంగా ఓడిపోయినా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతూనేఉన్నారు.
హర్యానాలో బిజెపి ఆశించిన స్థానాలు సాధించకోవడంతో ఆ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు కానీ లక్ష్మణ్ మాత్రం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయం తర్వాత కూడా పదవిని అంటిపెట్టుకుని ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో టిక్కెట్ల పంపిణీ పై పలు ఆరోపణలు వచ్చిన విషయం కూడా తెలిసిందే. అయినా ఆయన చలించలేదు. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో ఎలాంటి ప్రభావం చూపించలేక ఆయన చేతులు ఎత్తేశారు. అయినా పార్టీ పదవిని వదలడం లేదు. పైగా హుజూర్ నగర్ ప్రజలను అవమాన పరిచే విధంగా డబ్బులకు అమ్ముడు పోయారని మాట్లాడుతున్నారు. ఈ రెండు పార్టీల అధ్యక్షులూ పదవులు వీడకుండా పార్టీకి అన్యాయం చేస్తున్నారు. ఇలాంటి నాయకులు ఉన్నంత కాలం టిఆర్ఎస్ సేఫ్.