“మాతృభాషలో ప్రాథమిక విద్యాబోధన సాగితేనే విద్యార్థులకు ఎన్నో విధాలుగా ప్రయోజనం చేకూరుతుంది. రాజ్యాంగం కూడా మాతృభాషలోనే బోధన ఉండాలని చెబుతోంది” అని విశ్రాంత ఐఏఎస్ అధికారి నందివెలుగు ముక్తేశ్వరరావు స్పష్టం చేశారు. తెలుగు మాధ్యమాన్ని తొలగిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో తెలుగు భాషలో బోధన, పాలన సాగాలనే అంశంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌తో శాసనసభ మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, ముక్తేశ్వరరావు చర్చించారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముక్తేశ్వరరావు మాట్లాడుతూ “తెలుగు భాష పరిరక్షణకు పవన్ కళ్యాణ్ ముందుకొచ్చారు. వారిని అభినందిస్తూ ఈ అంశంపై నా ఆలోచనలు పంచుకున్నాను. మాతృ భాషలో ప్రాథమిక విద్య అందాలి. దానికి అనుగుణంగానే ఆర్టికల్ 21ఏ, రైట్ టూ ఎడ్యుకేషన్ చట్టం తీసుకురావడం జరిగింది. పిల్లలకు పాఠ్యాంశాలు అర్ధం కావాలన్నా, ఉపాధ్యాయులకు, విద్యార్ధులకు మధ్య అంతరాలు రాకుండా ఉండాలంటే మాతృభాషలోనే బోధన జరగాలి. భారత రాజ్యాంగం ఆమోదించి 70 ఏళ్లయ్యింది. ఒక సామాన్య పౌరుడు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి తన మాతృభాషలో సమాచారాన్ని అడిగే హక్కు ఉంది. తన సమస్యను మాతృ భాషలోనే తెలిపే హక్కు ఉంది. అన్ని ప్రాంతీయ భాషలను జాతీయ భాషలుగా గుర్తించి రాజ్యాంగం ఆ వెసులుబాటు కల్పించింది. నల్గొండ జిల్లాలో కలెక్టర్‌గా పనిచేసినప్పుడు స్థానిక ప్రజలను దృష్టిలో పెట్టుకొని వారికి అర్ధమయ్యే భాషలోనే సమాచారం ఇవ్వడం, సమావేశాలను నిర్వహించడం వంటి ప్రత్యేక చర్యలు తీసుకున్నాను. అటు పాలనలో ఇటు బోధనలో మాతృ భాష వినియోగానికి ఏ విధమైన చర్యలు తీసుకోవచ్చో అనే దానిపై పవన్ కళ్యాణ్‌తో చర్చించాను. మాతృభాష పరిరక్షణ కోసం ఆయన చేస్తున్న కృషికి అభినందనలు” అన్నారు.
previous post