28.2 C
Hyderabad
April 20, 2024 11: 53 AM
Slider ముఖ్యంశాలు

లైఫ్ స్కెచ్: రాజకీయ విషం దిగమింగిన కృష్ణుడు

#Krishna Yadav

చెన్నబోయిన కృష్ణయాదవ్…… ఈ పేరు రెండున్నర దశాబ్దాల పాటు హైదరాబాద్ రాజకీయాలను శాసించింది. జంటనగరాల రాజకీయం మొత్తం ఈ పేరు చుట్టూనే తిరిగింది. హైదరాబాద్ రాజకీయాలలో పెను సంచలనం సృష్టించిన కృష్ణ యాదవ్ జన్మదినం నేడు.

ఒకనాడు ఆయన జన్మదినం వస్తున్నదంటే హైదరాబాద్, సికింద్రాబాద్ లలో గల్లీ గల్లీలో రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, ఆసుపత్రుల్లో పండ్ల పంపిణీ కార్యక్రమాలు జరిగేవి. శుభాకాంక్షల సందేశాలు వెల్లువెత్తేవి. అయితే ఇప్పుడు అవేవీ లేవు. అగ్రనేతలను నమ్మిన ఫలితం ఇది.

తెలుగుదేశం నుంచి టీఆర్ఎస్ వరకూ కృష్ణ యాదవ్ ఎవరినైతే నమ్మారో వారే నట్టేట ముంచారు….. ముంచుతూనే ఉన్నారు. తనను నమ్ముకున్న కార్యకర్తలను తాను ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడో తనను కూడా తన కన్నా పెద్ద నాయకులు అలా చూసుకుంటారని నమ్మిన మంచి మనిషి కృష్ణయాదవ్.

పాతబస్తీ నుంచి వెలికివచ్చిన రాజకీయ ఆణిముత్యం

అంకిత భావంతో ప్రజల మధ్య ఉండే తనకు అంతటి ప్రాధాన్యత వస్తుందని నిరంతరం కష్టపడిన వ్యక్తి కృష్ణయాదవ్. పాతబస్తీలోని ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి పేపర్ బాయ్ గా జీవిత చక్రాన్ని ప్రారంభించి రాజకీయ రంగంలో కార్మిక మంత్రిగా ఎదిగిన కృష్ణ యాదవ్ జీవితంలో అనేక మజిలీలు, మలుపులు ఉన్నాయి.

పాతబస్తీలోని అలియాబాద్ డివిజన్ కార్పొరేటర్ గా గెలిచి తెలుగుదేశం పార్టీలో రాజకీయ ఆరంగేట్రం చేశారు కృష్ణయాదవ్. ఆయనకు అప్పటిలో అన్ని వర్గాల నుంచి మంచి ఆదరణ లభించింది. 1991లో హిమాయత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలలో టీడీపీ అభ్యర్ధిగా రంగంలో దిగి ఓటమి చవిచూసిన కృష్ణయాదవ్ 1994లో జరిగిన సాధారణ ఎన్నికలలో అదే స్థానం నుంచి అనూహ్యంగా విజయం సాధించారు.

అనతి కాలంలోనే మంత్రిగా అసాధారణ ప్రతిభ

ప్రభుత్వ విప్ గా పని చేసిన కృష్ణయాదవ్ కు ఆ తర్వాత అనతి కాలంలోనే పశు సంవర్ధక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. హిమాయత్ నగర్ నియోజకవర్గం తో బాటు హైదరాబాద్ సికింద్రాబాద్ జంటనగరాలలో తన ఇమేజ్ ను కృష్ణయాదవ్ పెంచుకున్నారు.

1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మరో మారు హిమాయత్ నగర్ నియోజకవర్గం నుంచి గెలిచి కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కార్యకర్తల నుంచి సాటి నాయకుల వరకూ అందరికి నిస్వార్ధంగా సేవ చేశారు. నిరాడంబర నేతగా మంచి పేరు సంపాదించుకున్న కృష్ణ యాదవ్ కు గాడ్ ఫాదర్లు ఎవరూ లేరు. తనకు తానుగానే సొంత శైలిలో ప్రజలతో అనుబంధం పెంచుకునే వారు ఆయన.

ఎవరైనా ఎప్పుడైనా పిలిస్తే పలికే నాయకుడు

మంత్రిగా ఉన్నప్పుడు ఆయనను కలవాలంటే అప్పాయింట్ మెంట్ తో పని లేదు. ఎవరైనా సరే ఎప్పుడైనా సరే వాకిన్ చేసేయచ్చు. సామాన్యుల నుంచి విఐపి ల వరకూ నేరుగా సచివాలయంలోని ఆయన కార్యాలయానికి వెళ్లి కలిసేవారు. రాజకీయాలలో స్వతంత్రంగా రాణించడం కష్టమే అయినా కృష్ణ యాదవ్ ఈ ఒరవడినే ఎంచుకున్నారు.

జంటనగరాల్లో పీజేఆర్ కు ఎంత ఫాలోయింగ్ ఉండేదో అదే స్థాయిలో ఇమేజ్ ను ఆయన సొంతం చేసుకున్నారు. కృష్ణయాదవ్ ఇండివిడ్యుయాలిటీ సొంత పార్టీలోని సీనియర్లకే రుచించలేదు. ఇప్పటికీ ఆయన ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు.

తెలుగుదేశం కీలకనేత పొడిచి పోటు….

రాజకీయంగా అప్రతిహతంగా సాగుతున్న ఆయన జీవితం 2003 లో సడన్ బ్రేక్ పడింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెల్గీ స్టాంపుల కుంభకోణంలో ఆయన ప్రమేయం ఉందంటూ అరెస్టు చేయడం కృష్ణ యాదవ్ అభిమానులను కలవర పరిచింది.

దశాబ్దంన్నర పాటటుగా కొనసాగుతున్న ఈ కేసులో కృష్ణ యాదవ్ ప్రమేయాన్ని నిరూపించే ఒక్క ఆధారం చూపించలేకపోవడం గమనించాల్సిన అంశం. తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పటిలో కీలక స్థానంలో ఉన్న ఒక నేత కృష్ణయాదవ్ ఎదుగుతుంటే తనకు కష్టమని రాజకీయ వ్యూహం రచించి కృష్ణయాదవ్ ను బలిపశువును చేశారు. కేసులో కృష్ణయాదవ్ ను ఇరికించారు కాబట్టే ఆధారాలు లేకుండా పోయాయి.

ఏ ఒక్క నాయకుడూ ఆయన బాధల్లో పాలుపంచుకోలేదు

రాజకీయంగా ఒంటిగానే ఆయన పోరాటం చేశారు తప్ప అంతటి కష్ట కాలంలో కూడా తెలుగుదేశం పెద్ద నాయకులకు వెళ్లి కాళ్లు మొక్కలేదు. ఏ పెద్ద నాయకుడు కూడా కృష్ణ యాదవ్ కష్టాలలో ఉన్నప్పుడు అయ్యో పాపం అనలేదు. ఆయన నుంచి సాయం పొందిన వారు కూడా మొహం చాటేశారు.

తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయనను వదిలేశారు కానీ లక్షలాది మంది కార్యకర్తలు మాత్రం ఇప్పటికీ కృష్ణ యాదవ్ ను గుర్తుపెట్టుకున్నారు. అభిమానుల గుండెల్లో కృష్ణ యాదవ్ పేరు చెక్కుచెదరలేదు. అయితే ఆయనే ప్రజా జీవితంలోకి రావడం లేదు.

ప్రస్తుతం ఆయన టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. 1918లో ఆయనను టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అక్కున చేర్చుకున్నారు. అంబర్ పేట్ అసెంబ్లీ టిక్కెట్ ఖరారు చేశారు. అయితే ఆఖరు నిమిషం ఎడ్జెస్టుమెంట్ లో టిక్కెట్ రాలేదు.

ఇంకా వెన్నాడుతూనే ఉన్న అదృశ్య శక్తులు

కొన్ని అదృశ్య శక్తులు టీఆర్ఎస్ నాయకత్వంతో నాటకాలు ఆడి కృష్ణయాదవ్ కు టిక్కెట్ రాకుండా చేశాయి. పార్టీ టిక్కెట్లు, ఇక్కట్లతో సంబంధం లేకుండా రాజకీయంగా బేస్ ఉన్న కృష్ణ యాదవ్ ఎందుకో గోకులంలో దాక్కున్న కృష్ణుడులా ఉండిపోయారు. రాజకీయ రంగంలోని ఆయన బాహాటంగా వచ్చేస్తే మళ్లీ మహాభారతమే….

పెన్మత్స శ్రీహరిరాజు,
సీనియర్ జర్నలిస్టు

Related posts

Welcome decision: బీజేపీ విజ్ఞప్తి ని ఒప్పుకున్న టీఆర్ఎస్

Satyam NEWS

ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీకి ఇక కష్టకాలం

Satyam NEWS

టీఆర్ఎస్ అభివృద్ధి శిలాఫలకాలకే పరిమితం బీజేపీ

Sub Editor

Leave a Comment