39.2 C
Hyderabad
March 28, 2024 15: 00 PM
Slider ప్రత్యేకం

Analysis: ఆషామాషీగా తీసుకుంటే మఠాష్

#Lockdown Violations

భారతదేశంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి మరింతగా పెరుగుతోంది. గడచిన 24 గంటలలో పాజిటివ్ కేసులు 9 లక్షలకు, మరణాలు 23 వేలకు దగ్గరవుతున్న తీరు వైరస్ వ్యాప్తి తీవ్రతను తెలుపుతోంది. సగటున రోజుకు 500 కరోనా మరణాలు సంభవిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.

అయితే కరోనా బారినుంచి కొలుకునేవారి సంఖ్య కొంత ఆశాజనకంగా కనిపిస్తోంది. రికవరీ రేటు 62.93 శాతంగా నమోదైనట్లు కేంద్రప్రభుత్వం చెబుతోంది. సోమవారం నాటికి 5 లక్షల మందికి పైగా వైరస్ నుంచి కోలుకున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఆందోళనకరంగానే ఉన్న పరిస్థితి

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంగా చేపట్టిన కరోనా నియంత్రణ చర్యలతోనే ఇది సాధ్యమైందని ప్రభుత్వం ప్రకటించింది. కానీ…..దేశంలో లక్ష కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడానికి 110 రోజులు పట్టగా, మరో 54 రోజులలో 9 లక్షలకు చేరువకావడం ఆందోళన కలిగిస్తోంది.

కరోనా ఉద్ధృతి విస్తరిస్తున్న నేపథ్యంలో… జులై 31తో ముగియనున్న అన్ లాక్ -2 దశ చర్చకు వస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన కట్టడి చర్యలు కరోనా  వ్యాప్తి నియంత్రణకు ఏ మేరకు తోడ్పడ్డాయనేది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మార్చి23 న ప్రకటించిన లాక్డవున్ 1వ దశనుంచి ప్రస్తుతం అమలులో ఉన్న అన్ లాక్ -2 దశ వరకు చోటుచేసుకున్న పరిణామాలపై దేశీయ, అంతర్జాతీయ మాధ్యమాలలో విశ్లేషణలు ఊపందుకున్నాయి.

అన్ లాక్ 2, మినీ లాక్ మొదలు

అన్ లాక్ 2 వ దశ మార్గదర్శకాలు ఆశించిన స్థాయిలో ఫలితాలు చూపని కారణంగా కొన్ని రాష్ట్రాలు మినీ లాక్డవున్ విధించడం గమనార్హం. కర్ణాటక, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయా, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలలో మినీ లాక్డవున్ అమలులో ఉంది.

తాజాగా బెంగళూర్, పూనే లలో జులై 14 నుంచి 22 వరకు విధించగా, నాగాలాండ్ లోని అత్యంత ప్రభావిత ప్రాంతాలలో జులై 31 వరకు లాక్డవున్ విధించారు. దేశంలోని అత్యధిక స్థాయిలో కరోనా విజృంభణ ఉన్న 8 రాష్టాలలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి, అవసరమైతే లాక్డవున్ కఠినంగా అమలుచేయాలని ప్రతిపక్షాలు, పౌర సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

మార్గదర్శకాలు పాటించని రాష్ట్రాలు

భారీస్థాయిలో వైరస్ కేసుల పరీక్షలు,వైరస్ వ్యాధిగ్రస్తులను గుర్తించడం, క్వారంటైన్ లో ఉంచి తగిన  వైద్య సదుపాయం అందించడం వంటి చర్యలు మహమ్మారి వ్యాప్తి నియంత్రణకు సహకరిస్తాయి. వాస్తవానికి చాలా రాష్ట్రాలలో అన్ లాక్ 2 మార్గదర్శకాలు పాటించడంలేదు.

ఒకవైపు కరోనా వ్యాప్తిలో అత్యంత కీలకమైన సామాజిక వ్యాప్తి లేదని కేంద్రప్రభుత్వం ప్రకటిస్తున్నా వైద్య నిపుణుల వ్యాఖ్యానాలు  సమస్య తీవ్రతను హెచ్చరిస్తున్నాయి. మాస్కులు ధారణ, భౌతిక దూరం పాటించడం, వ్యక్తిగత పరిశుభ్రత, రోగనిరోధక వ్యవస్థ మెరుగు పరిచే ఆహారం తీసుకోవడం వంటి విషయాలలో ప్రజల నిర్లక్ష్యం కనిపిస్తోంది. ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులో లేకున్నా ప్రజలు విచ్చలవిడిగా తిరగడం ఎక్కువైంది.

కరోనా యోధులను పట్టించుకోవాలి

కరోనా యోధులుగా ప్రశంసలు పొందిన వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది,  ఆరోగ్య కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులు, పాత్రికేయులు వైరస్ బారికి గురికావడం ఆందోళన కలిగించే విషయం. ప్రజల అలసత్వం కారణంగా కరోనా విస్తరిస్తోందని స్పష్టమవుతున్నా స్థానిక ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించడం లేదన్న విమర్శలు వచ్చిపడుతున్నాయి.

మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు జులై 31వరకు లాక్డవున్ ప్రకటించాయి. రానున్న 5 నెలల వరకు 80 కోట్ల మందికి 5కిలోల బియ్యం లేదా గోధుమలు, ఒక కిలో పప్పులు రేషన్ పద్ధతిలో ఉచితంగా ఇవ్వనున్నట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించింది.

ప్రజారోగ్యానికి భద్రత కావాలి

దీనికి తోడు రాష్ట్రప్రభుత్వాలు కూడా ఇతోధిక సాయం లక్షిత వర్గాలకు అందించాలని వినతులు వస్తున్నాయి. ఆర్థికవ్యవస్థ మెరుగుపర్చకోవడంతో పాటు  ప్రజారోగ్యానికి భద్రత కల్పించాల్సిన ఆవశ్యకతను ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు గురైరిగి వ్యవహరిస్తే పరిస్థితులు చక్కబడే అవకాశం ఉంటుంది.

వాక్సిన్ అందుబాటులోకి రావడానికి సమయం పట్టే సూచనలు కనిపిస్తున్న తరుణంలో కఠినంగా వ్యవహరించాలని సామాజిక శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పొలమరశెట్టి కృష్ణారావు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మాజీ విశ్రాంత ఉన్నతాధికారి

Related posts

శ్రీ లక్ష్మీనృసింహ వేద స్మార్త పాఠశాలకు విరాళం అందచేత

Satyam NEWS

ప్రాథమిక విద్యావిధానంలో మార్పులు వద్దు: సీపీఎం

Satyam NEWS

పోలీసుల అదుపులో నిమ్మగడ్డ ప్రసాద్

Satyam NEWS

Leave a Comment