34.2 C
Hyderabad
April 19, 2024 22: 38 PM
Slider సంపాదకీయం

ప్రారంభం కాక ముందే సక్సెస్ అయిన లోకేష్ పాదయాత్ర

#Lokesh

పాదయాత్రకు బయలుదేరుతున్న లోకేష్ కు అధికార వైసీపీ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి విశేష లాభం చేకూరుతున్నది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన లోకేష్ పాదయాత్రను అధికార వైసీపీ పట్టించుకోకుండా ఉంటే ఎలా జరిగేదో కానీ ఇప్పుడు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ లోకేష్ పాదయాత్రపై ఆసక్తి చూపుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఈ అవకాశం బాగా కలిసి వచ్చింది.

అధికార పార్టీ వత్తిడి కారణంగా లోకేష్ పాదయాత్రను తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ విధంగా అన్ని కారణాలతో బాటు అధికార పార్టీ వారు పోలీసు యంత్రాంగం ద్వారా తెస్తున్న వత్తిడి, జీవో నెంబర్ వన్ ద్వారా పెడుతున్న ఆంక్షలు లోకేష్ ను హీరోగా నిలబెడుతున్నాయి. గతంలో పాదయాత్ర చేసిన ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ అప్పటి తెలుగుదేశం పార్టీ నుంచి ఎలాంటి ప్రతిఘటన కూడా ఎదుర్కొనలేదు. అందుకోసమే జగన్ పాదయాత్రకు ఊపు రావడానికి కొద్ది సమయం పట్టింది. జగన్ పాదయాత్ర ప్రారంభించిన తర్వాత 30 రోజుల తర్వాత గానీ ప్రజలు ఆయనతో కలిసి నడవ లేదు. అయితే జగన్ ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షల కారణంగా లోకేష్ పాదయాత్ర ప్రారంభం కాకముందు నుంచే ప్రజల్లో ఆసక్తి రేపింది. జగన్ ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షల కారణంగా లోకేష్ పై పూర్తి స్థాయిలో సానుభూతి పెల్లుబుకుతున్నది.

ఇప్పటికే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత రావడంతో బాటు తెలుగుదేశం పార్టీకి వీస్తున్న సానుకూల పవనాలతో బాటు లోకేష్ పాదయాత్ర జరగకుండా చూసేందుకు చేస్తున్న ప్రయత్నాలు అందరిలో ఆసక్తి రేపుతున్నాయి. గతంలో జగన్ కన్నా ముందు వై ఎస్ రాజశేఖరరెడ్డి, తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడు కూడా పాదయాత్ర చేశారు.

వీరందరి పాదయాత్రల కన్నా లోకేష్ పాదయాత్ర భిన్నంగా కనిపిస్తున్నది. అందుకు ప్రధాన కారణం వైసీపీ ప్రభుత్వం పెడుతున్న ఆంక్షలేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. లోకేష్ పాదయాత్రపై వైసీపీ ప్రభుత్వమే కాకుండా వైసీపీ సోషల్ మీడియా కూడా విపరీతమైన ప్రచారం చేసింది. లోకేష్ పాదయాత్రపై విమర్శనాత్మక వ్యాఖ్యలతో వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో లోకేష్ పై పూర్తి స్థాయిలో సానుభూతి పెల్లుబుకింది. లోకేష్ పాదయాత్ర 400 రోజుల పాటు సాగనున్నది. రాష్ట్రంలోని దాదాపు అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి ఆయన పాదయాత్ర సాగనున్నది.

ఇది ఎంతో సవాల్ తో కూడుకున్నది. అమరావతి రైతుల పాదయాత్రపై అధికార వైసీపీ కి చెందిన కొందరు కార్యకర్తలు చేసిన దాడి అందరికి గుర్తుండే ఉంటుంది. పెట్రోలు నింపిన సీసాలు కూడా రైతులపై విసిరేసి గందరగోళం సృష్టించారు. ఆ కారణంగా అమరావతి రైతుల పాదయాత్రపై పోలీసులు మరిన్ని ఆంక్షలు పెట్టి రైతులు విసిగిపోయేలా చేసి చివరకు పాదయాత్ర ముంగించేలా పధకం రూపొందించారు. లోకేష్ పాదయాత్రకు కూడా అలాంటి ప్రమాదం లేకపోలేదు.

లోకేష్ పాదయాత్రకు వచ్చే వారిని ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటే పాదయాత్రకు స్పందన తగ్గిపోయినట్లుగా ప్రచారం చేసుకోవడానికి వీలుంటుంది. లోకేష్ పాదయాత్రకే స్పందన లేదంటే తెలుగుదేశం పార్టీ పని అయిపోయినట్లేనని ప్రచారం చేసుకోవచ్చు. చంద్రబాబునాయుడి సభలకు తండోపతండాలుగా జనం వస్తుంటే ‘‘ఇరుకు రోడ్లపై’’ సభలు పెట్టుకుంటే నిండినట్లే కనిపిస్తుందని ఒక సారి, ‘‘జనం ఉన్న చోటికి వెళ్లి మీటింగ్ పెడితే’’ జనం కనపడతారని మరొక సారి వ్యాఖ్యలు చేసి చంద్రబాబుకు జనం రావడం లేదని వైసీపీ నేతలు ప్రచారం చేసుకున్నారు.

అదే టెక్నిక్ ను లోకేష్ పాదయాత్ర పై కూడా ప్రయోగించే అవకాశం ఉంది. గ్రామాల నుంచి జనం రాకుండా అడ్డుకుని పాదయాత్ర పై దుష్ప్రచారం చేయడానికి అవకాశం ఉందని తెలుగుదేశం పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఈ వ్యూహాన్ని ఛేదించేందుకు పార్టీ వర్గాలు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాయి. పాదయాత్రలో లోకేష్ భద్రత పై కూడా ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ఒక వలయంలా ఉండాలని భావిస్తున్నారు.

ఇందుకోసం ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే రక్షణ వలయంగా ఉండి లోకేష్ ను ముందుకు నడిపించాలని కూడా వ్యూహాత్మక ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం అంకిత భావం ఉన్న కార్యకర్తల్ని ఎంపిక చేయడమే కాకుండా వారికి శిక్షణ కూడా ఇచ్చారు. మొత్తం మీద ప్రభుత్వం పెడుతున్న ఆంక్షలతో లోకేష్ పాదయాత్ర ఆరంభం కాకముందే సక్సెస్ అయింది.

Related posts

రోడ్లు ఊడ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Satyam NEWS

కులాలను రెచ్చగొట్టింది తెలుగుదేశం వారే

Sub Editor

జీడిమెట్ల పరిశ్రమలో రియాక్టర్ పేలి ఇద్దరి మృతి

Satyam NEWS

Leave a Comment