39.2 C
Hyderabad
March 29, 2024 17: 13 PM
Slider ముఖ్యంశాలు

నటుడు శివాజీపై లుకౌట్ నోటీసులు తొలగింపు

shivajee

సినీనటుడు శివాజీకి హైకోర్టులో ఊరట లభించింది. అతనిపై జారీ అయిన లుకౌట్ నోటీసులు తొలగించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శివాజీ మూడు వారాల పాటు అమెరికా వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టివి9 వాటాల వ్యవహారానికి సంబంధించి అలంద మీడియా పెట్టిన కేసుల్లో ఇది పెద్ద మలుపుగా చెప్పవచ్చు. వాటాల బదలీకి సంబంధించి సినీనటుడు శివాజీపై తెలంగాణ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో జూలై 25న ఆయన అమెరికా వెళ్తుండగా దుబాయ్ ఇమ్మిగ్రేషన్ సిబ్బంది అడ్డుకున్నారు. దాంతో శివాజీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తాను అమెరికా వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడంపై ఆయన పిటీషన్ దాఖలు చేశారు. శివాజీ పిటిషన్‌పై బుధవారం ఉన్నత న్యాయస్థానం విచారించింది. అలంద మీడియా కేసులో జారీ అయిన లుకౌట్‌ నోటీసులు తొలగించాలని హైకోర్టు ఆదేశించినా పోలీసులు తొలగించలేదని శివాజీ తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. లుకౌట్ నోటీసులు తొలగించకపోవడంతో అమెరికా వెళ్తుండగా పోలీసులు ఆపారని స్పష్టం చేశారు. దుబాయి ఇమ్మిగ్రేషన్‌ అధికారులు కూడా ఆపి వెనక్కి పంపారని వివరించారు. ఇమ్మిగ్రేషన్‌ వెబ్‌సైట్‌లో లుకౌట్‌ నోటీసులు తొలగించలేదన్నారు. దీన్ని కోర్టు ధిక్కరణగా పరిగణించాలని న్యాయవాది కోరారు. ఇకపోతే జూలై 24న శివాజీ అమెరికా వెళ్లేందుకు మూడు వారాలపాటు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో మరుసటి రోజు అంటే జూలై 25న శివాజీ అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే ఇమ్మిగ్రేషన్ వెబ్ సైట్ లో లుకౌట్ నోటీసులు తొలగించకపోవడంతో ఆయన్ను అడ్డుకున్నారు.  హైకోర్టు లుకౌట్ నోటీసులు తొలగించాలని ఆదేశించిన విషయం వాస్తవమే అయినప్పటికీ లుకౌట్‌ నోటీసులు తొలగించడానికి మూడు రోజులు పడుతుందని పోలీసులు తెలిపారు. హైకోర్టు ఆదేశాలు సీఐడీకి వెళ్లి అక్కడినుంచి ఇమిగ్రేషన్‌కు వెళ్లాలని పోలీసులు తెలిపారు. భారత్‌లో ఎవరూ కూడా శివాజీని ఆపలేదని పోలీసులు స్పష్టం చేశారు. దుబాయ్‌ ఇమ్మిగ్రేషన్‌ సిబ్బంది ఆపారని కోర్టుకు తెలిపారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు సమాచార లోపం వల్లే  తప్పిదం జరిగిందని కోర్టు అభిప్రాయపడింది. గురువారం నుంచి మూడు వారాలపాటు అమెరికా వెళ్లేందుకు హైకోర్టు మరోసారి శివాజీకి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

Related posts

సిరిమానోత్సవం:  కంట్రోల్ రూమ్ నుండి ఎస్పీతో పర్యవేక్షించిన కలెక్టర్

Satyam NEWS

హరీష్ ఓపికకు కేసీఆర్ ఇచ్చిన బహుమతి

Satyam NEWS

చీరాలలో వివాహితను నరికి చంపిన కిరాతకులు

Satyam NEWS

Leave a Comment