31.2 C
Hyderabad
June 20, 2024 21: 40 PM
Slider ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకం ముఖ్యంశాలు

రైతు సాధికారిత పేరుతో అడ్డగోలు దోపిడి

pjimage (12)

నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ ఐ సి) ఇది ఒక నాలెడ్జి బ్యాంక్. ఈ బ్యాంక్ లో ఉండే డేటా ఆధారంగా ప్రభుత్వ పథకాలు అమలు చేస్తే పొరబాట్లు జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ప్రభుత్వ పథకాలను ఆధార్ నెంబర్ తో అనుసంధానం చేసుకుని అమలు చేసుకునే వెసులుబాటు ఎన్ఐసి లో ఉంటుంది. అంతే కాదు. ఏదైనా పథకం అమలు చేయాలంటే ఈ కేంద్రానికి సమాచారం ఇస్తే అందుకు తగిన సాఫ్ట్ వేర్ ను రూపొందించి ఇస్తారు. ఈ సౌకర్యాన్ని రుణ మాఫీ విషయంలో చంద్రబాబునాయుడి ఆధ్వర్యంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది.

ఏ పంటకు ఎంత రుణం ఇవ్వాలనే అంశం నుంచి లబ్దిదారుడిని ఆధార్ నెంబర్ తో సరిపోల్చుకునే అన్ని అవకాశాలను రుణమాఫీ స్కీం అమలులో పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఎందుకంటే రుణమాఫీ లాంటి పాడి ఆవును పిండుకోవడానికి, డబ్బులు దండుకోవడానికి. ఒకటి కాదు రెండు కాదు. లక్షలాది బ్యాంకుల ఖాతాలను తారుమారు చేశారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కు కొత్త అర్ధం చెప్పారు. రుణ మాఫీ ని ఒక అవినీతి ఖజానాగా మార్చుకున్నారు. రుణ మాఫీ అమలు చేసిన రైతు సాధికార సంస్థలో బాధ్యులంతా ప్రయివేటు వ్యక్తులే.

దోచుకు తినడం తప్ప ఎవరికి బాధ్యత లేదు. రిటైర్ అయిన వారు ఇద్దరు, అసలు ప్రభుత్వ ఉద్యోగే కాని వారు మరొకరు అందరూ కలిసి రుణ మాఫీని పలహారం చేసేశారు. అయినా చర్యలు లేవు. ప్రభుత్వ ఉద్యోగి పది వేలు లంచం తీసుకుంటే లక్ష రూపాయలు ఖర్చు చేసి అవినీతి నిరోధక శాఖ వారు వలపన్ని పట్టుకుంటారు. ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సదస్సులో కోట్లాది రూపాయలు రాజకీయ నాయకులకు పలహారం అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు.

కొత్త ప్రభుత్వానికి ఈ విషయాలు తెలియవో తెలిసి కూడా ఊరుకుందో అర్ధం కావడం లేదు. ఆంధ్రప్రదేశ్ లో రుణ మాఫీ కి సంబంధించి సుమారుగా 82 లక్షల బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. వాటిలో దాదాపుగా 25 లక్షల ఖాతాలు సెల్ఫ్ డిక్లరేషన్ ఖాతాలు. సెల్ఫ్ డిక్లరేషన్ ఖాతాలు అంటే బ్యాంకు నుంచి రుణం తీసుకున్నప్పుడు వారు తాము రైతులమేనని చెప్పి బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలు. ఇలా సెల్ఫ్ డిక్లరేషన్ రుణాలు లక్ష రూపాయలు దాటకపోతే వడ్డీ ఉండదు. లక్ష రూపాయలు దాటితే పావలా వడ్డీ రుణం వసూలు చేస్తారు. ఇలా సెల్ఫ్ డిక్లరేషన్ రుణాలను వ్యవసాయ రుణాలుగా పరిగణించే అవకాశం ఉండదు.

కేవలం క్రాప్ లోన్ అంటే పంట రుణం పేరుతో తీసుకుంటే వరికి ఎకరానికి 20 వేలకు మించి ఇవ్వరు. అదే విధంగా పత్తి ఇతర వాణిజ్య పంటలకు వివిధ రకాల స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఉంటుంది. ఈ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ను రిజర్వు బ్యాంకు నిర్ధారిస్తుంది. ఈ క్రాప్ లోన్ కు తోడు మరింత రుణం కావాలంటే బంగారం తాకట్టు పెట్టాల్సి ఉంటుంది. రైతు పాస్ బుక్ జిరాక్సు కాపీ జత చేస్తే దాన్ని కూడా క్రాప్ లోన్ కిందే పరిగణిస్తారు. ఎటొచ్చీ సెల్ఫ్ డిక్లరేషన్ రుణాలను వ్యవసాయ రుణాలుగా పరిగణించే అవకాశం లేదు. అయినా సరే ఇద్దరు ముగ్గురు ప్రజాప్రతినిధులు వత్తడి తీసుకురావడంతో చంద్రబాబు ప్రభుత్వం వారు చెప్పిన పేర్లకు రుణ మాఫీ చేసేసింది. ఇది కోట్ల రూపాయల గోల్ మాల్. రుణ మాఫీ కి సంబంధించి దాదాపు 18 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. ఈ స్థాయిలో ఫిర్యాదులు, అభ్యంతరాలు వచ్చాయంటే ఏ మేరకు పథకం దుర్వినియోగం జరిగిందో అర్ధం చేసుకోవచ్చు. ఈ ఫిర్యాదులను అడ్డంపెట్టుకుని వీటిని సాకుగా చూపించి కోట్ల కొట్టేశారు. (ఇంకా ఉంది)

Related posts

రియాక్షన్: సత్యం న్యూస్ వెలికితెచ్చిన సమస్య పరిష్కారం

Satyam NEWS

రెవెన్యూ అధికారులు నిద్రలో.. అక్రమార్కుల సంపాదన కోట్లల్లో

Bhavani

కరోనా రోగి కొన ఊపిరిని తీసేసిన ఆసుపత్రులు

Satyam NEWS

Leave a Comment