నిర్మల్ జిల్లా పరిధిలో పోగొట్టుకున్న, చోరికి గురైన 57 మొబైల్ ఫోన్లను ఎస్పీ డా.జి.జానకి బాధితులకు అందచేశారు. సెల్ ఫోన్ పోయిన, చోరీకి గురైన ఆందోళన చెందవద్దని CEIR ద్వారా తిరిగి పొందవచ్చని జిల్లా ఎస్పీ అన్నారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో పోగొట్టుకున్న, చోరి గురైన 57 సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకొని బాధితులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోయిన లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్లను త్వరితగతిన పట్టుకోవడానికి CEIR వెబ్సైట్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
CEIR వెబ్సైట్లో వినియోగదారులు వివరాలను నమోదు చేసుకుంటే మొబైల్స్ ని ఈ పోర్టల్ ద్వారా సులభంగా స్వాధీనం చేసుకునే ఆస్కారం ఉంటుందని తెలిపారు. 2024 సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా 878 ఫోన్ లను రికవరీ చేసి బాధితులకు అందించడం జరిగిందని అన్నారు. సెల్ ఫోన్ల రికవరీ కోసం ప్రత్యేక టీం ఏర్పాటు చేయడం జరగిందని అన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్లో నోడల్ అధికారులను ఏర్పాటుచేసి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. CEIR ఆవశ్యకతను తెలుపుతూ ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. పోయిన సెల్ ఫోన్ పట్ల అశ్రద్ధ చేస్తే ఫోన్లలో ఉన్న వ్యక్తిగత సమాచారం ఆధారంగా తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని, ఇది వ్యక్తిగత సామాజిక భద్రతకు భంగం కలుగుతుందన్నారు.
దొంగిలించిన ఫోన్లను నేరాలకు పాల్పడే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ CEIR వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. అదే విధంగా ఎవరైనా సెకండ్ హాండ్ ఫోన్ లు కొనే ముందు అప్లికేషన్లో అట్టి ఫోన్ యొక్క వివరాలను అనగా IMEI నంబర్లు నమోదు చేసి చెక్ చేసుకోవాలని తద్వారా అట్టి ఫోన్ యొక్క స్టేటస్ తెలుస్తుంది అన్నారు. అదేవిధంగా ఎవరికైనా సెల్ఫోన్లు దొరికితే సంబంధిత పోలీస్ స్టేషన్లో గాని లేదా ఆ నెంబర్ వారికి ఫోన్ చేసి వారికి అప్పగించాల్సిందిగా సూచించారు.
ఈ సందర్భంగా సాంకేతిక ఉపయోగించి మొబైల్ ఫోన్లో రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన ఐటి కోర్ సిబ్బంది, CEIR టీం లను జిల్లా ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎ.ఓ యోనస్ అలి, ఐటీ సెల్ ఇన్చార్జి పెర్సీస్ ఎస్ఐ మరియు ఐటీ సెల్ సిబ్బంది శ్రీనివాస్, రామ కృష్ణ, నరేందర్, శ్రీనివాస్ , రాజేశ్వర్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.