30.7 C
Hyderabad
April 19, 2024 09: 01 AM
Slider జాతీయం

ప్రేమ పెళ్లి ప్రచారంతో నేతాజీ జీవితచరిత్రను మార్చగలరా?

netajee love

రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని భారత దేశం నుంచి పారద్రోలేందుకు అహర్నిశలూ శ్రమించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితంలో ఎన్నో రహస్యాలు ప్రచారంలో ఉన్నాయి. కేవలం ఆయన మరణంపైనే కాదు. ఆయన జీవించి ఉన్నప్పుడు కూడా ఆయన వ్యక్తిగత జీవితంలో జరిగిన విషయాలపై ఎన్నో పుకార్లే షికారు చేశాయి. ఇంకా చేస్తున్నాయి.

ఆయనపై ప్రేమతో చెప్పేవారు కొందరైతే, మరికొందరు ఆయన వ్యక్తిత్వాన్ని కించపరచే వారు. విచిత్రం ఏమిటంటే ఎవరు ఎన్ని కథలు ప్రచారం చేసినా నేతాజీ సుభాష్ చంద్రబోస్ వ్యక్తిత్వంపై ఎలాంటి మచ్చ పడలేదు. సుభాష్ చంద్రబోస్ దేశం గురించి వేరే ఆలోచన లేనివాడని తెలిసినా ఆయన ప్రేమ కథ ను కొందరు కావాలని ప్రచారంలో పెడుతుంటారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు భార్య ఒక కుమార్తె ఉన్నారనేది ఈ ప్రచారం లో భాగం.

ఎవరు ఎన్ని చెప్పినా నేతాజీ ఒక విదేశీ వనితను పెళ్లి చేసుకోవడానికి ప్రేమ కథ నడిపారని చెప్పే కథ మాత్రం కథగానే ప్రచారంలో ఉంది. అది 1934. శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొంటూ జైలు పాలైన సుభాష్ చంద్రబోస్ ఆరోగ్యం క్రమంగా దిగజారడంతో బ్రిటిష్ ప్రభుత్వం చికిత్స నిమిత్తం ఆయనను యూరప్‌లోని ఆస్ట్రియాకు పంపింది. వియన్నాలో ఆయన చికిత్స పొందుతూనే యూరప్‌లో ఉన్న భారతీయ విద్యార్థులను ఏకం చేసి, వారు స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొనేలా చేయాలని బోస్ భావించారు.

ఆ సమయంలో ఒక యూరోపియన్ పబ్లిషర్ ‘ద ఇండియన్ స్ట్రగుల్’ అన్న పుస్తకం రాయాలని ఆయనను కోరారు. దాంతో బోస్‌కు ఇంగ్లీష్ తెలిసిన, టైపింగ్ వచ్చిన ఒక అసిస్టెంట్ అవసరం ఏర్పడింది. సుభాష్ చంద్ర బోస్ స్నేహితుడైన డాక్టర్ మాథూర్ ఆయనకు రెండు పేర్లను సూచించారు. వారిలో ఒకరు 23 ఏళ్ల ఎమిలీ షెంకెల్. ఆస్ట్రియా కు చెందిన ఆ యువతిని తన సహాయకురాలిగా సుభాష్ చంద్రబోస్ నియమించుకున్నారు. ఆ సమయంలో బోస్‌కు 34 ఏళ్లు.

ఆ సమయంలో కలిసిన ఎమిలీ తో ఆయన కలిసి జీవించారని కథలు ప్రచారం చేశారు. కొందరైతే ఆయన ఎమిలీని కలవడంతో బోస్ జీవితమే మారిపోయిందని చెబుతున్నారు. మొదట ప్రేమ విషయాన్ని బోస్ ప్రతిపాదించారట. ఆ తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడం ప్రారంభించిందట. 1934-36 మధ్యకాలంలో ఆస్ట్రియా, చెకొస్లొవేకియాలలో ఉన్న సమయం వారి జీవితంలో అత్యంత మధురమైనదని ఎమిలీ చెప్పిందని కూడా కొందరు రచయితలు రాశారు. ఎమిలీ జనవరి 26, 1910లో ఆస్ట్రియాలోని క్యాథలిక్ కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రికి ఆమె ఓ భారతీయుని వద్ద పని చేయడం ఇష్టం లేదు.

అయితే సుభాష్ చంద్రబోస్‌ను కలిసిన తర్వాత ఆయన వారి ప్రేమను కాదనలేకపోయారు….ఇలా కొందరు రచయితలు రాస్తున్నారు. మరి కొందరైతే నెహ్రూకు ఇతరులతో సంబంధం ఉందని చెబుతూ ఆయనతో పోలుస్తూ సుభాష్ చంద్రబోస్ కు ప్రేమాయణం ఉందని రాశారు. ఇలాంటి ఉదంతాలపై ‘ నెహ్రూ అండ్ బోస్, పేరలల్ లైవ్స్’ అనే పుస్తకం కూడా వచ్చింది. అందులో ఆయన బోస్, నెహ్రూలపై వారి భార్యల ప్రభావం గురించి రాశారు.

పుస్తకంలో సుభాష్, ఎమిలీలు మొదటి నుంచీ తమ బంధం ప్రత్యేకమైనదని, క్లిష్టమైనదని గుర్తించారు. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణలను బట్టి ఈ విషయం మనకు తెలుస్తుంది. ఎమిలీ మిస్టర్ బోస్ అని సంబోధిస్తే, బోస్ ఆమెను మిస్ షెంకెల్ లేదా పెర్ల్ షెంకెల్ అని సంబోధించేవారు అని రాశారు. తన వద్ద ఉద్యోగం కోసం వచ్చిన ఎమిలీ అలా కాక ఎలా పిలుస్తారు? బోస్ అలా కాకుండా ఎలా సంబోధిస్తారు?

ఇవన్నీ గోప్యంగా ఉంచి సుభాష్ చంద్రబోస్ వ్యక్తిగత జీవితాన్ని దేశభక్తి నుంచి మళ్లించేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయి. 1936 మార్చి 5న రాసిన ఒక లేఖలో ”మై డార్లింగ్, సమయం వస్తే మంచు కూడా కరుగుతుంది. ప్రస్తుతం నా హృదయం పరిస్థితి కూడా ఇదే. నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో రాయకుండా, చెప్పకుండా నన్ను నేను నిలువరించుకోలేకపోతున్నాను. మై డార్లింగ్, నువ్వు నా హృదయ సామ్రాజ్ఞివి. కానీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?” అని అంటారు.

”భవిష్యత్తులో ఏం జరుగుతుందో నాకు తెలీదు. బహుశ నేను జీవితాంతం జైలులో గడపాల్సి రావచ్చు. నన్ను కాల్చి చంపొచ్చు, ఉరి తీయొచ్చు. నేను మళ్లీ నిన్ను చూడలేకపోవచ్చు. బహుశా నేను ఉత్తరాలు కూడా రాయలేకపోవచ్చు. కానీ నన్ను నమ్ము, నువ్వెప్పుడూ నా హృదయంలోనే ఉంటావు. మనం ఈ జీవితంలో కలిసి ఉండలేకపోతే, వచ్చే జన్మలోనైనా కలిసి ఉందాం.” అని ఎమిలీకి రాశారు.

ఇలా ఒక ఉత్తరాన్ని కూడా బయటి ప్రపంచానికి వెల్లడించడంలో కొందరు ఉత్సాహం చూపారు. నీతో ఉన్న క్షణాలే నన్ను సంతోషంగా ఉండనిస్తున్నాయి అని దేశం కోసం పరితపించే సుభాష్ చంద్రబోస్ లాంటి వ్యక్తి ఎమిలీతో అనగలరా? ఒక్క సారి ఆలోచించండి. ఎమిలీ, బోస్‌ల వివాహం డిసెంబర్ 27, 1937న ఆస్ట్రియాలోని బాడ్‌గస్టైన్‌లో జరిగిందని కొందరు రచయితలు ప్రతిపాదించారు. అయితే తమ వివాహాన్ని రహస్యంగా ఉంచాలని వారు నిర్ణయించుకున్నారు అని కూడా తమ వ్యాసాలలో పేర్కొన్నారు.

తమ పెళ్లి రోజు గురించి తప్ప ఏ వివరాలూ ఎమిలీ వెల్లడించలేదని బోస్ సన్నిహితులు తెలిపారని కూడా మరి కొన్ని వ్యాసాలు ఉన్నాయి. 1937, ఆగస్టు 12న ఎమిలీకి రాసిన లేఖలో బోస్, ‘నువ్వు భారత్ గురించి ఏవైనా కొన్ని పుస్తకాలు పంపమని రాశావు. కానీ వాటిని నీకు పంపినా లాభం లేదని అనిపిస్తోంది. ఎందుకంటే నీ వద్ద ఉన్న పుస్తకాలనే ఇప్పటి వరకు నువ్వు చదవలేదు’ అని రాశారు.

‘నువ్వు సీరియస్‌గా లేనంత వరకు పుస్తకాలు చదవడంలో నీకు ఆసక్తి పెరగదు. వియన్నాలో నువ్వు చాలా పుస్తకాలే సేకరించావు. కానీ వాటిన్నటినీ చదవలేదని నాకు తెలుసు’ అని బోస్ అనే వారు. ముందు చెప్పిన ప్రేమ కథకు ఈ లేఖల సారాంశానికి ఎంత తేడా ఉందో చూస్తే సుభాష్ చంద్రబోస్  దేశం కన్నా మిన్నగా ఎవరినీ ప్రేమించలేదని అర్ధం అవుతుంది. వాళ్ల ప్రేమకు గుర్తుగా నవంబర్ 29, 1942న బోస్, ఎమిలీలకు కూతురు పుట్టింది.

వారు ఆమెకు ఇటలీ విప్లవ నేత గారిబాల్డీ భార్య, బ్రెజిల్ మూలాలు కలిగిన అనిత గారిబాల్డీ పేరిట అనిత అని పెట్టారు. వివాహాన్ని రహస్యంగా ఉంచడం వెనుక అది తన పొలిటికల్ కెరీర్‌పై ప్రభావం చూపించే అవకాశం ఉందని బోస్ భావించి ఉండవచ్చు. అంతే కాకుండా ఒక విదేశీ వనితను పెళ్లాడారన్న ఇమేజ్ ఆయనపై ప్రభావం చూపే అవకాశం ఉంది అని మరి కొందరు రాశారు. ఇవన్నీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ వ్యక్తిత్వానికి విరుద్ధమైన కథనాలు. అందువల్ల ఎవరు ఎంతగా ప్రచారం చేసినా కథలు గానే మిగిలిపోయాయి. నేతాజీ మనసు నిండా ఉన్నది ఒక్క దేశభక్తి మాత్రమే అనేదే ప్రజల మనసులో నాటుకుపోయింది.

Related posts

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో బోనాల ఉత్సవాలు

Bhavani

టీటీడీ చైర్మన్ గా మళ్లీ వై వి సుబ్బారెడ్డి నియామకం

Satyam NEWS

ఉపాధి కూలీలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి

Satyam NEWS

Leave a Comment