ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, లూథియానా వెస్ట్ ఎమ్మెల్యే గుర్‌ప్రీత్ బస్సీ గోగీ తుపాకీ కాల్పులతో మరణించాడు. శనివారం ఈ సంఘటన జరిగింది. ఆయన స్వంత లైసెన్స్ పిస్టల్ నుండి ప్రమాదవశాత్తు కాల్పులు జరిగి మరణించినట్లు పోలీసులు తెలిపారు. జాయింట్ పోలీసు కమిషనర్ జస్కరన్ సింగ్ తేజ మాట్లాడుతూ గోగి సొంత తుపాకీ కాల్పుల కారణంగా బుల్లెట్ దూసుకుపోయిందని, ఆయనను స్థానిక దయానంద్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (DMCH)కు తరలించగా, అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు ప్రకటించారని వెల్లడించారు.
గోగి ఇంట్లో శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. గోగి లైసెన్స్ డ్ పిస్టల్ నుంచి బుల్లెట్ పేలిందని తేజ తెలిపారు. గోగి మృతి పట్ల పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సహా పలువురు రాజకీయ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారిలో కొందరు లూథియానాలోని ఆయన నివాసానికి చేరుకుని సంతాపం వ్యక్తం చేస్తున్నారు. “లూథియానా వెస్ట్ నుండి మా పార్టీ గౌరవనీయ ఎమ్మెల్యే గుర్‌ప్రీత్ గోగి జీ మరణించారనే బాధాకరమైన వార్త వచ్చింది. ఇది వినడానికి నేను చాలా బాధపడ్డాను, గోగీ జీ చాలా మంచి వ్యక్తి. ఈ దుఃఖ సమయంలో కుటుంబానికి హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను” అని మాన్ అన్నారు. పంజాబ్ ఆప్ అధ్యక్షుడు అమన్ అరోరా కూడా గోగి మృతికి సంతాపం తెలిపారు.
“ఈ క్లిష్ట సమయంలో దుఃఖంలో ఉన్న కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ బాధాకరమైన నష్టాన్ని తట్టుకునే శక్తిని వారు పొందాలని కోరుకుంటున్నాను. ఆయన ఆత్మకు శాశ్వత శాంతి కలగాలని నేను సర్వశక్తిమంతుడిని ప్రార్థిస్తున్నాను” అని అరోరా ఎక్స్‌లో పోస్ట్‌లో పేర్కొన్నారు. తన మరణానికి కొన్ని గంటల ముందు, గోగి ‘బుద్ధ నుల్లా’ (కలుషిత వ్యర్థాల కాలువ) శుభ్రపరిచే అంశంపై విధానసభ స్పీకర్ కుల్తార్ సింగ్ సంధ్వన్, ఆప్ ఎంపీ బల్బీర్ సింగ్ సీచెవాల్‌తో సమావేశం నిర్వహించారు. గోగి 2022లో కాంగ్రెస్‌ను వీడి ఆప్‌లో చేరారు. దాదాపు 22 ఏళ్లుగా కాంగ్రెస్‌లో ఉన్నారు.
2022 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో లూథియానా వెస్ట్ స్థానం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన భరత్ భూషణ్ అషుపై గోగి విజయం సాధించారు. ఆయన భార్య సుఖ్‌చైన్ కౌర్ గోగి గత నెలలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. గోగి 2022లో శాసనసభ్యుడు కావడానికి ముందు లూథియానాలో మునిసిపల్ కౌన్సిలర్‌గా రెండుసార్లు పనిచేశారు. కాంగ్రెస్ హయాంలో పంజాబ్ చిన్న పరిశ్రమలు, ఎగుమతి కార్పొరేషన్‌కు ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. గోగి 2014 నుండి 2019 వరకు లూథియానా జిల్లా కాంగ్రెస్ (అర్బన్) అధ్యక్షుడిగా ఉన్నారు.