అన్నమయ్య జిల్లా మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో జరిగిన ఘటన యాక్సిడెంట్ కాదని, ఇన్సిడెంట్‌గా అనిపిస్తోందని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఆయన ఆర్డీవో కార్యాలయానికి చేరుకొని, ఘటనపై ఆరా తీశారు. అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘గత రాత్రి సుమారు 11.30 గంటలకు మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. 3 గంటల పాటు పరిశీలించిన తర్వాత అది యాక్సిడెంట్ కాదు.
ఇన్సిడెంట్‌గా భావిస్తున్నాం. 22ఏ భూముల రికార్డులున్న గదిలో ఫైర్ ఇన్సిడెంట్ జరిగింది. కీలక సెక్షన్‌లో ఈ ఘటన చోటుచేసుకోవడం అనుమానాలకు తావిస్తోంది. ఘటన సమాచారం ఆర్డీవోకు తెలిసింది కానీ, కలెక్టర్‌కు సమాచారం ఇవ్వలేదు. ఘటన విషయం తెలుసుకున్న సీఐ కూడా ఎస్పీ, డీఎస్పీలకు సమాచారం ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తోంది. కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్ జరిగేందుకు అవకాశం లేదు. ఇదే విషయాన్ని ఫోరెన్సిక్ వాళ్లు కూడా చెప్పారు. ఆర్డీవో కార్యాలయం కిటికీ బయట అగ్గిపుల్లలు కనిపించాయి.
కార్యాలయం బయట కూడా కొన్ని ఫైళ్లు కాలిపోయాయి. ఇవన్నీ అనుమానాలను మరింత పెంచుతున్నాయి. ఇటీవల సాక్ష్యాలను నాశనం చేసే ఘటనలు కొన్ని జరిగాయి. ఈ నేపథ్యంలో ఆ దిశగానూ దర్యాప్తు ప్రారంభించాం. కేసు దర్యాప్తునకు 10 బృందాలను ఏర్పాటు చేశాం’’ అని తెలిపారు. దీనిపై ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉందన్న ఆయన.. పోలీసు శాఖ కూడా దీనిని తీవ్రంగా పరిగణిస్తోందని చెప్పారు. ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే పోలీసులకు అందించాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు.