మాఘ పౌర్ణమి సందర్భంగా సంత్ శిరోమణి రవిదాసు జయంతి ఉత్సవాలను చిల్కూర్ బాలాజీ ఆలయంలో నేడు నిర్వహించారు. ఉత్తర ప్రదేశ్ లోని వారణాసిలో ఒక హరిజన కుటుంబంలో చెప్పులుకుట్టే వృత్తి చేసే దంపతులకు రవిదాసు మాఘ పౌర్ణమి నాడు జన్మించారు. ఆయన ఉత్తర ప్రదేశ్ లో భక్తి ఉద్యమానికి ఆజ్యం పోశారు. భగవంతుని పట్ల సంపూర్ణ భక్తిని కలిగి ఉండి ఆరాధించాలని రవిదాసు బోధనలు చేశాడు.
సమాజంలో సమానత్వ సందేశంతో, నిమ్న కులాల ప్రజలు ఒక దైవ వ్యక్తిగా రవిదాస్ ను భావించేవారు. శ్రీకృష్ణుడి భక్తురాలైన మీరాబాయి కూడా సంత్ రవిదాస్ ను గురువుగా భావించింది. రవిదాసు సృష్టిలో కొన్ని పద్యాలను సిక్కు గురు అర్జున్ దేవ్ సంకలనం చేసి, సిక్కు పవిత్ర గ్రంధమైన గురు గ్రంథ్ సాహిబ్ లో చేర్చారు. చిలుకూరు బాలాజీ టెంపుల్ సీనియర్ అర్చకుడు సిఎస్ రంగరాజన్ మాట్లాడుతూ, సంత్ రవిదాసు బోధనలు, కవితలు, పాటలు మొత్తం సమాజానికి చెందినవని అన్నారు.