హరిహర పుత్రుడు అయ్యప్ప క్షేత్రం లో ఈరోజు సాయంత్రం శబరిమల గిరులకు సమీపంలోని పొన్నాంబళ మేడుపై మకర జ్యోతి దర్శనం ఇస్తుందని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు ప్రకటించింది. స్వామి కోసం పందళ రాజ వంశీకులు తీసుకుని వచ్చే ప్రత్యేక ఆభరణాలను సాయంత్రం 5 గంటల తరువాత స్వామికి అలంకరిస్తామని, ఆపై స్వామికి తొలి హారతిని ఇచ్చే సమయంలో మకర జ్యోతి, మకర విళక్కు భక్తులకు దర్శనమిస్తాయని వెల్లడించారు.
కాగా, మకర జ్యోతిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో ఇప్పటికే శబరిగిరులు భక్తులతో నిండిపోయాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన దాదాపు 5 లక్షల మందికి పైగా భక్తులు ప్రస్తుతం పంబ నుంచి సన్నిధానం వరకూ క్యూ లైన్లలో, జ్యోతి దర్శనం నిమిత్తం టీబీడీ బోర్డు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో వేచి చూస్తున్నారు. ఇంకా వేల సంఖ్యలో భక్తులు సన్నిధానానికి వస్తుండగా, ప్రధాన పార్కింగ్ ప్రాంతమైన నీలక్కర్ వాహనాలతో కిక్కిరిసిపోయింది.