హరి హర క్షేత్రం శబరిమల స్వామియే శరణం అయ్యప్ప అంటూ అయ్యప్ప నామస్మరణతో మార్మోగోంది. మకర సంక్రాంతి సందర్భంగా జ్యోతి దర్శనం కోసం లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. వారి సుదీర్ఘ నిరీక్షణకు తెరవేస్తూ ఆలయానికి ఈశాన్య దిశలో పర్వతశ్రేణుల నుంచి వెలుగులీనుతున్న జ్యోతి దర్శనమిచ్చింది. జ్యోతి దర్శనంతో వేలాది మంది భక్తులు తరలివచ్చారు. హరిహర సుతుడైన స్వామి అయ్యప్పను స్మరిస్తూ స్వామియే శరణం అయ్యప్ప అన్న శరణుఘోషలతో శబరిగిరులు ప్రతిధ్వనిస్తున్నాయి. కాంతమాల కొండలపై దేవతలు, రుషులు కలిసి భగవంతునికి హారతి ఇస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అంతకుముందు పందాళం నుంచి తీసుకువచ్చిన తిరువాభరణాలను ప్రధాన అర్చకులు స్వామివారికి అలంకరించారు. అనంతరం మూలమూర్తికి హారతి నిచ్చారు. ఆ వెంటనే క్షణాల్లో చీకట్లను తొలగిస్తూ పొన్నాంబలంమేడు పర్వత శిఖరాల్లో జ్యోతి దర్శనమిచ్చింది. మనసునిండుగా భక్తిభావంతో తన్మయం చెందిన భక్తులు స్వామియే శరణం అయ్యప్ప అంటూ శరణమిల్లుతున్నారు. తెలుగు రాష్ట్రాలతో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అయ్యప్ప భక్తులు శబరిమలకు భారీగా వెళ్లారు.