30.7 C
Hyderabad
April 19, 2024 09: 08 AM
Slider సంపాదకీయం

రాధాకృష్ణ ఇంట విషాదాన్నీ రాజకీయం చేస్తున్న దౌర్భాగ్యులు

#ABNAndhrajyothy

ఎవరైనా తెలియని వారు మరణించినా కూడా సాటి మనిషి ‘అయ్యో పాపం’ అంటాడు. తెలిసిన వారు మరణిస్తే సానుభూతి వ్యక్తం చేస్తారు. ఆప్తులు మరణిస్తే దగ్గరుండి సాగనంపుతారు.

ఇది సాధారణంగా జరిగే విషయం. ఈ కరోనా సమయంలో క్షణానికో మరణం సంభవిస్తూ మానవాళి మొత్తాన్ని విషాదంలో నింపుతున్నా ఈ విధానం మారలేదు.

అయితే మనిషి మరణాన్ని కూడా రాజకీయ కోణంలో, కులం యాంగిల్ లో చూసే దౌర్భాగ్యులు దాపురించారు.

సంతాపం సంగతి పక్కన పెట్టినా, మరణాన్ని కూడా అవహేళన చేస్తున్నారు. రాజకీయ కామెంట్లు పెడుతున్నారు… అమానవీయ వ్యాఖ్యలు చేస్తున్నారు….

ఆంధ్రజ్యోతి ఎండి, సీనియర్ జర్నలిస్టు వేమూరి రాధాకృష్ణ సతీమణి కనకదుర్గ అనారోగ్యంతో మరణించారు.

ఈ దురదృష్టకరమైన సంఘటన మంగళవారం నాడు జరిగింది.

రాధాకృష్ణ జర్నలిజంలో తనదైన ముద్ర వేసుకున్న వ్యక్తి. అతి తక్కువ స్థాయి నుంచి పెరిగి పెద్దవాడై తాను పని చేసిన పత్రికనే కొనుగోలు చేసిన అసాధారణ వ్యక్తి.

ఆయన చాలా సందర్భాలలో జర్నలిస్టుగా తెలుగుదేశం పార్టీని, చంద్రబాబునాయుడిని సపోర్టు చేసి ఉండవచ్చు.

ఆనాడు కాంగ్రెస్ ను, ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ను సిద్ధాంతపరంగా వ్యతిరేకిస్తుండవచ్చు.

అయితే ఈ విషయాలకు ఆయన ఇంట జరిగిన విషాదానికి ముడిపెడితే ఎలా? కానీ దౌర్భాగ్యులు కొందరు అదే పని చేస్తున్నారు.

సతీవియోగంలో ఉన్న రాధాకృష్ణకు సానుభూతి తెలపడం అటుంచి దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్న కుసంస్కారులు కుప్పలుతెప్పలుగా పుట్టుకొచ్చారు.

ట్విట్టర్ వేదికగా అత్యంత హేయమైన వ్యాఖ్యలు పెడుతున్నారు. ఆ వ్యాఖ్యలను ప్రస్తావించడం అంటే మనల్ని మనం న్యూనత పరచుకోవడమే అందుకని ఆ పని చేయడం లేదు.

కానీ ఏమిటీవైపరిత్యం?

ప్రతిదీ రాజకీయమేనా? ప్రతి విషయం…. మంచి చెడు… సంతోషం… విషాదం… అంతా కులం కోణంలోనే చూడాలా?

ఈ దరిద్రలు చేస్తున్న పనులతో మనుషులంటేనే అసహ్యం పుడుతున్నది. ఈ దగుల్బాజీలు పెట్టే ట్విట్లు రాధాకృష్ణ వరకూ చేరే అవకాశం లేదు. ఆయనకు తెలిసే అవకాశం కూడా లేదు.

కానీ ఈ సమాజానికి మనం ఏం సందేశం ఇస్తున్నాం? ఈ దరిద్రపు రాజకీయాలు, కంపు కొట్టే కుల వ్యవస్థ కు తప్ప మనిషి చనిపోతే కూడా సానుభూతి చూపని కుసంస్కారులను ఎలా భరించడం?

గతంలో చంద్రబాబునాయుడిపై క్లామొర్ మైన్ దాడి జరిగినప్పుడు వై ఎస్ రాజశేఖరరెడ్డి తన సంపూర్ణ సానుభూతి వ్యక్తం చేశారు తప్ప చంద్రబాబునాయుడిపై దాడి జరిగినందుకు సంతోషం వ్యక్తం చేయలేదు.

రాజశేఖరరెడ్డి అకస్మాత్తుగా మరణిస్తే చంద్రబాబునాయుడు అక్కడకు వెళ్లడం వల్ల శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని పోలీసులు వారించినా చంద్రబాబు ఆగలేదు.

వెళ్లి తన మిత్రుడిని కడసారిగా చూసి వచ్చారు. వై ఎస్ వారసులుగా చెప్పుకునే వారికి ఈ సంస్కారం గుర్తుకు రాదా? వుండదా?

తన కుటుంబంలో విభేదాలు ఉన్నాయని రాసిన పత్రిక ఎండి అయిన రాధాకృష్ణ ఇంటిలో విషాద ఘటన చోటు చేసుకోగానే వై ఎస్ షర్మిల తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

ఈ మాత్రం మానవత్వం కూడా ప్రదర్శించలేరా?

అయినా రాజకీయాలకూ రాధాకృష్ణకు, ఆయన ఇంట్లో జరిగిన విషాదానికి సంబంధం ఏమిటి?

ఆ మాత్రం వివేచన కూడా లేకుండా చావును రాజకీయం చేస్తున్న ఈ దరిద్రులను ఏం చేయాలి?

అన్నీ కులం యాంగిల్ లోనే చూస్తూ సమాజంలో విషం నూరిపోస్తున్న ఈ దౌర్భాగ్యులకు మంచి ఆలోచనలు ప్రసాదించు దేవుడా…..

Related posts

రేవంత్ రెడ్డీ ఈ శకునులు… శల్యులను వదిలించుకో

Satyam NEWS

థాంక్స్ టు మినిష్టర్ కేసీఆర్

Satyam NEWS

వైద్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు మార్పు దుర్మార్గమైన చర్య

Satyam NEWS

Leave a Comment