శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు గురువారం రాత్రి శ్రీమలయప్ప స్వామివారు ఉభయదేవేరులతో కలిసి సర్వభూపాల వాహనంపై కాళీయమర్ధన అలంకారంలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 8 నుండి 10 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, జీయ్యంగార్ల గోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వభూపాల అంటే అందరు రాజులు అని అర్థం. వీరిలో దిక్పాలకులు కూడా చేరతారు. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనసేవ నుంచి గ్రహించవచ్చు. బ్రహ్మోత్సవాలలో ఐదో రోజైన శుక్రవారం ఉదయం 9 నుండి 11 గంటల వరకు మోహినీ అవతారం, రాత్రి 7 నుండి 12 గంటల వరకు గరుడ వాహనంపై శ్రీవారు ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు. ఈ కార్యక్రమంలో టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యుడు మేడా మల్లికార్జునరెడ్డి, సివిఎస్వో గోపినాథ్‌జెట్టి, ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్విరాజ్ తదితరులు పాల్గొన్నారు
previous post
next post