39.2 C
Hyderabad
April 25, 2024 15: 42 PM
Slider జాతీయం

బస్తర్ మూలవాసీ ప్రజలపై వైమానిక ఉగ్రవాదం: మావోల ఆగ్రహం

#maoist

భారత సైన్యం, వైమానిక బలగం అధికారులు, టెక్నీషియన్ల మద్దతుతో ఛత్తీస్ గఢ్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ (కోబ్రా), ఎ టీఎఫ్, డీఆర్జ్, గ్రేహౌండ్స్ బలగాలు కలిసి దక్షిణ బస్తర్ ప్రాంతం పామేడ్ గెరిల్లా బేస్ ఏరియాలో, పీఎల్ జీఏ, స్థానిక ఆదివాసీ ప్రజలు లక్ష్యంగా ఏప్రిల్ 15వ తేదీ అర్థరాత్రి దాటిన తరువాత చేసిన తీవ్ర డ్రోన్ దాడిని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ తీవ్రంగా ఖండించింది.

ఈ వైమానిక బాంబింగులో యాభైకి పైగా డ్రోన్లను ఉపయోగించారని, యాభైకి పైగా అత్యంత విస్ఫోటక బాంబులను విడిచి పెట్టారని వారు తెలిపారు. ఈ బాంబుల వల్ల ప్రజలు తమ అటవీ సంపదను దాచుకునేందుకు నిర్మించుకున్న గుడిసెలు దెబ్బ తిన్నాయని, అప్రమత్తంగా ఉన్న పీఎల్ జీఏ, ప్రజలూ బాంబింగు నుంచి నష్టపోకుండా తప్పించుకోగలిగారని మావోయిస్టుల ప్రకటించారు.

మావోయిస్టుల ప్రకటన పూర్తి పాఠం:

కేంద్ర గృహ మంత్రి అమిత్ షా, అజిత్ దోవల్, విజయ్ కుమార్, ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఫేల్ల్ మార్గదర్శకత్వంలో పోలీసులు, సైనిక సిబ్బంది నిర్వహించిన మోడీ తరహా సర్జికల్ స్ట్రైక్ దాడి ఇది. ఇది వైమానిక ఉగ్రవాదం తప్ప మరొకటి కాదు. 2021 ఏప్రిల్ 19వ తేదీ తరువాత ఇది రెండవ వైమానిక దాడి.

ఆదివాసులు నివసించే ఐదో షెడ్యూల్డ్ ప్రాంతాలలో సైన్యం మొహరింపు రాజ్యాంగ విరుద్ధమే కాకుండా ఐక్యరాజ్యసమితి మూలవాసీ ప్రజలకు సంబంధించి చేసిన నియమాలకు కూడా విరుద్ధం. వైమానిక బాంబింగు అమానవీయమే కాకుండా అంతర్జాతీయ చట్టాల తీవ్ర ఉల్లంఘన. పెసా ద్వారా గ్రామసభలకు ఉన్న అధికారాల మేరకు వాటి అనుమతి తీసుకోకుండానే ఆదివాసీ ప్రాంతాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసు, అర్థ సైనిక బలగాల క్యాంపులను నెలకొల్పుతున్నారు. ఇది కూడా రాజ్యాంగ విరుద్ధమే. 2019 నవంబర్ నాటి నుంచి ఆదివాసీ ప్రజలు ఈ క్యాంపులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తుంటే ఈ పోరాటాలపై భారీ నిర్బంధం అమలు చేస్తున్నారు.

నిజానికి, మోదీ ప్రజల సంపదను, వనరులను భారత, విదేశీ కార్పొరేట్ సంస్థలకు అందిస్తున్నాడు. ఇందుకోసం రైతులు, కార్మికులు, చిన్నపాటి వ్యాపారులు, ఆదివాసులు, ముస్లింలు, ఇతర పీడిత ప్రజల పై దాడిని అమలు చేస్తున్నాడు. బస్తర్ లో ప్రజల రాజకీయాధికార అంగాలను తుడిచిపెట్టివేయడం కూడా ఈ దాడుల లక్ష్యం.

ఈ దాడిని బలంగా ప్రతిఘటించవలసిందిగా పార్టీ కేంద్ర కమిటీ యావత్తు పార్టీ కేడర్లకు, నాయకులకు, కమాండర్లకు, పీఎల్ జీఏకు, విప్లవ ప్రజా కమిటీలకు, విప్లవ ప్రజలకు పిలుపునిస్తున్నది. బస్తర్ ప్రజలపై డ్రోన్ దాడులను వ్యతిరేకించవలసిందిగా ప్రజాస్వామికవాదులు, ప్రగతిశీల శక్తులు, మానవహక్కుల సంస్థలు, కార్మికులు, రైతులు, విద్యార్ధులు, యువత, విలేకరులు, వామపక్ష పార్టీలు, శక్తులు, హిందుత్వ వ్యతిరేక శక్తులను కోరుతున్నది.

మధ్య, తూర్పు భారత దేశంలో ఆదివాసులపై యుద్ధం అయిన అభివృద్ధి నిరోధక, విప్లవ ప్రతీఘాతుక ‘సమాధాన్-ప్రహార్’ దాడిలో భాగం అయిన ఈ డ్రోన్ దాడులకు వ్యతిరేకంగా తీవ్ర నిరసన తెలియజేయవలసిందిగా కేంద్ర కమిటీ ఐసీఎస్ పీడబ్ల్యుని, ప్రపంచవ్యాప్త యావత్తు మార్క్సిస్టు-లెనినిస్టు-మావోయిస్టు పార్టీలు, శక్తులను కోరుతున్నది.

అదే విధంగా భారత విప్లవోద్యమానికి బలమైన సంఘీభావం నిర్మించవలసిందిగా కోరుతున్నది. భారత ప్రభుత్వానికి సంబంధించిన యావత్తు కార్యక్రమాలు, విధానాలను వ్యతిరేకించవలసిందిగా సంబంధిత దేశాల కార్మికవర్గాలను కోరుతున్నది. ఈ విషయాన్ని అంతర్జాతీయ వేదికలలో చర్చించవలసిందిగా యావత్తు అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలను కోరుతున్నది.

అభయ్ అధికార ప్రతినిధి కేంద్ర కమిటీ, భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)

Related posts

గ్యాస్ పేలుడులో ఒక‌రికి తీవ్ర గాయాలు

Sub Editor

కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో వైసీపీ కార్యకర్తల విధ్వంసం

Satyam NEWS

6నెలల్లో సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రంగా తెలంగాణ

Satyam NEWS

Leave a Comment