37.2 C
Hyderabad
April 19, 2024 13: 31 PM
Slider ఆధ్యాత్మికం

భ‌క్తిభావాన్ని పంచిన శ్రీ విష్ణుసహస్రనామ స్తోత్ర సామూహిక పారాయణం

#Tirumala

భీష్మ ఏకాదశి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని లోక‌క‌ల్యాణం కోసం తిరుమల నాదనీరాజనం వేదికపై బుధవారం ఉద‌యం టిటిడి చేప‌ట్టిన శ్రీ విష్ణుసహస్రనామ స్తోత్ర సామూహిక పారాయణం భ‌క్తిభావాన్ని పంచింది. ప‌లువురు భ‌క్తులు నేరుగా పాల్గొన‌గా, శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ల‌క్ష‌లాది మంది భ‌క్తులు త‌మ ఇళ్లలోనే పారాయ‌ణం చేశారు.

ముందుగా తిరుమల వేద విజ్ఞాన పీఠం ఆచార్యులు శ్రీమాన్ కోగంటి రామానుజాచార్యులు మాట్లాడుతూ, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పట్టించడం వలన విశేష ఫలితాలు సిద్ధిస్తాయని పురాణాలలో ఉన్నట్లు తెలిపారు. మన జీవితంలో ధర్మాన్ని తెలుసుకునే అవకాశం, శక్తి సరిపోదని, దీనిని సులభంగా తెలుసుకునేందుకు శ్రీ విష్ణు సహస్రనామాన్ని శ్రీ భీష్మాచార్యులు, శ్రీ ధర్మరాజుకు వివరించగా శ్రీమహావిష్ణు ఆమోదించారన్నారు. కావున ఎవరైతే విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేస్తారో వాళ్ళు భగవంతుని అనుగ్రహంతో సకల శుభములను సంపదలను పొంది శ్రీవారి సన్నిధికి చేరుతారని వివరించారు.

అనంతరం సంస్కృత విద్యాపీఠం ఉపకులపతి ఆచార్య కృష్ణమూర్తి గారు, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఆచార్యులు శ్రీనాధాచార్యులు శ్రీ విష్ణుసహస్రనామ స్తోత్ర వైశిష్ట్యాన్ని తెలియ‌జేసారు. మొదట శ్రీ గురు ప్రార్ధనతో సంకల్పం చెప్పారు. ఆ త‌రువాత శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రమ్ 30 శ్లోకాలు, పూర్వపీఠిక 29 శ్లోకాలు పారాయ‌ణం చేశారు. అనంత‌రం విష్ణు సహస్రనామ స్తోత్రం 108 శ్లోకాలను మూడు సార్లు, ఉత్తరపీఠికలోని 34 శ్లోకాలను పారాయణం చేశారు.

ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు నారాయణతే నమో నమో….. అనే సంకీర్తన కార్యక్రమం ప్రారంభంలో, చివరిలో శ్రీ వెంకటేశం మనసా స్మరామి …., శ్రీ వెంకటేశ్వర నామ సంకీర్తన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

క‌రోనా మ‌హ‌మ్మారిని అంత‌మొందించాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ, లోక‌క‌ల్యాణం కోసం 2020 ఏప్రిల్ నుండి టిటిడి ప‌లు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తోంది. ఇందులో యోగవాసిష్ఠం, ధన్వంతరి మహామంత్ర పారాయణం, సుందరకాండ పఠనం, వేదపారాయణం, విరాటపర్వం, శ్రీమద్భగవద్గీత, షోడశదిన సుందరకాండ పారాయణ దీక్ష, కార్తీక మాసోత్సవం, ధనుర్మాసోత్సవం, మాఘ మాసోత్సవం త‌దిత‌ర విశేష కార్యక్రమాలను రూపొందించి శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసింది.

త‌ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులకు స్వామివారి ఆశీస్సులు అందించింది.
తిరుమల ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠం, తిరుప‌తిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయం, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ, వేదపండితులు, విశేష సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related posts

సత్యం న్యూస్ చెప్పిందే జరిగింది: మూడు రాజధానుల్లో న్యాయ రాజధాని దిశగా అడుగులు

Satyam NEWS

బీసీ కుల గణన కు రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాలి

Satyam NEWS

దేశ రాజధానిలో కొనసాగుతున్న గ్రీన్ ఛాలెంజ్

Satyam NEWS

Leave a Comment