రాజ్యసభ ఉప ఎన్నికలలో అభ్యర్ధుల ఎంపిక తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి సవాల్ గా మారింది. రేసులో లెక్కకు మించిన వారు ఉండటంతో ఎవరికి ఎంపిక చేయాలనేది పెద్ద సమస్యగా తయారైంది. వైకాపా నుంచి గెలిచిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేయడంతో..ఇప్పుడు ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. వైకాపాకు చెందిన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు, ఆర్.కృష్ణయ్యలు తమ రాజ్యసభ్యత్వాలకు రాజీనామా చేశారు.
వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి విధానాలు నచ్చక తాము రాజీనామా చేస్తున్నామని వారు ప్రకటించారు. వైకాపాకు రాజీనామా చేసిన వీరిలో బీద మస్తాన్‌రావు, మోపిదేవి వెంకటరమణ టిడిపిలో చేరారు. తనకు ఢిల్లీ రాజకీయాలపై ఆసక్తి లేదని, రాష్ట్ర రాజకీయాల్లోనే కొనసాగుతానని మోపిదేవి ఇప్పటికే ప్రకటించారు. నెల్లూరుకు చెందిన బీద మస్తాన్‌రావు మాత్రంమళ్లీ తనను రాజ్యసభకు నామినేటెడ్ చేయాలని కోరుతున్నారు. వాస్తవానికి బీద మస్తాన్‌రావు మొదట నుంచి టిడిపికి చెందిన వారే. అయితే..జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన వైకాపాలో చేరి రాజ్యసభకు ఎంపికయ్యారు.
ఈ రాజ్యసభ ఎంపిక సందర్భంగా భారీగా సొమ్ములు చేతులు మారాయనే ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో విజయసాయిరెడ్డి ఈయనను వైకాపాలో చేర్పించడానికి తన వంతు ప్రయత్నాలు చేశారు. బీద వైకాపాలో చేరిన తరువాత జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరపరాభవం చెందడంతో ఆయనమళ్లీ తన పాత పార్టీ వద్దకే వచ్చారు. అయితే..ఆయన రాజీనామా చేసే సమయంలో ఆయనకు మళ్లీ రాజ్యసభ సభ్యత్వాన్ని ఇస్తామని హామీ ఇచ్చారని, దాని ప్రకారం మళ్లీ ఆయన సీటు ఆయనకే కేటాయిస్తారంటున్నారు.
ఇక ఆర్.కృష్ణయ్య బిజెపిలో చేరతారంటున్నారు. ఆయన ముందుగానే బిజెపిపెద్దలతోమాట్లాడుకుని రాజీనామా చేశారని, ఇప్పుడు ఆయన స్థానంలో వచ్చే సీటును జనసేనకు కేటాయిస్తారని చెబుతున్నారు. జనసేన నుంచి ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు పోటీ చేస్తారంటున్నారు. ఇది ఖచ్చితంగా జనసేనకు ఇస్తారని చెబుతున్నారు. ఇక మోపిదేవి స్థానంలో టిడిపి అధిష్టానం ఎవరిని నియమిస్తుందన్న దానిపై ఆపార్టీలో ఉత్కంఠత నెలకొంది. ఈ సీటు కోసం పదుల సంఖ్యలో నాయకులు పోటీ పడుతున్నారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో సీటు లభించిన వారు, పార్టీ కోసం త్యాగం చేసిన వారికే సీటు ఇవ్వాలని చెబుతున్నా…అది జరిగే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. మాజీ కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, మరో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, మాజీ ఎంపి గల్లా జయదేవ్, భాష్యం రామకృష్ణ, కనకమేడల రవీంద్రకుమార్, చింతకాయల విజయ్ తదితరులు పోటీ పడుతున్నారు.
రాయలసీమకు చెందిన రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేత ఒకరు కూడా పోటీ పడుతున్నారు. అదే విధంగా బీసీ సమాజికవర్గానికి చెందిన మరో నేత కూడా రంగంలో ఉన్నారు. అయితే..వీరిలో అశోక్‌గజపతిరాజు, యనమల రామకృష్ణుడు కుమార్తెలకు, వర్ల రామయ్య కుమారుడికి ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చారు. వీరు ముగ్గురు సంతానం ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. కనుక వీరికి అవకాశం దాదాపు లేనట్లే. ఇక మాజీ ఎంపి గల్లా జయదేవ్ గత ఎన్నికలకు ముందు రాజకీయాల నుంచి వైదొలిగారు. దీని ప్రకారం ఆయనకు అవకాశం ఉండదు. ఇక పార్టీ కోసం తన టిక్కెట్ త్యాగం చేసిన దేవినేని ఉమామహేశ్వరరావుకు అయితే ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలి.
కానీ..పార్టీ పెద్దల ఆలోచన ఏమిటో తెలియదు. భాష్యం రామకృష్ణ రేసులో ముందంజలో ఉన్నారు. మాజీ ఎంపి కనకమేడలకూ అవకాశం లేనట్లే..కాగా..వీరు కాకుండా ఓ మహిళకు అవకాశం ఇస్తారనే ప్రచారం సాగుతోంది. అయితే..ఆ మహిళ ఎవరు..? ఏమిటనేది..ఇప్పట్లో తెలిసే అవకాశం లేదు. నామినేషన్ల ముందు ఆమె పేరు బయటకు వస్తుందంటున్నారు. మొత్తం మీద ఒక సీటు కోసం దాదాపు పదిమందికి పైగా పోటీపడుతున్నారు. మరి వీరిలో ఎవరికి దక్కుతుందో చూడాలి.