27.7 C
Hyderabad
April 25, 2024 09: 16 AM
Slider

చార్లెస్ వాకర్ పాస్నెట్ త్యాగానికి ప్రతిరూపం

#MedakChurch

అకుంఠిత దీక్ష…ప్రతీ రాతిలో కొట్టొచ్చినట్టు కనపడే జీవకళ…వందేళ్లు పైబడినా చెక్కుచెదరని కళాత్మకత…ఈ మహా దేవాలయాన్ని వర్ణించేందుకు బహుశా అక్షరాలు సరిపోవేమో…ఓ మహానుభావుడి అకుంఠిత దీక్షా పటిమకు, త్యాగనిరతికి సజీవ సాక్ష్యం… ఈసుందర కట్టడం.

దేశం కాని దేశం వచ్చిన వారు స్వచ్ఛమైన ప్రేమకు బీజం పోశారు. ఎక్కడో ఇంగ్లాండ్ నుండి మారుమూల ప్రాంతమైన మెతుకుసీమ వారిని అక్కున చేర్చుకుంది. ప్రపంచమంతా మొదటి ప్రపంచ యుద్ధ భయంతో వణికిపోతోంది, అగ్రరాజ్యాల ఆధిపత్య పోరులో ఎంతోమంది సమిధలు, దీనికి భారతదేశం కూడా మినహాయింపు కాలేదు.

మెదక్ ప్రాంతంలో సేవా కార్యక్రమాలు

పనిలేదు చేతిలో చిల్లిగవ్వ లేదు కళ్ళముందే ఆకలిచావులతో తనువు చాలిస్తున్న ఎందరో అభాగ్యులు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే చార్లెస్ వాకర్ పాస్నెట్ మెదక్ ప్రాంతానికి వచ్చారు. వచ్చిన మొదట్లో మెదక్ పరిధిలోని గ్రామాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్కూళ్లు హాస్పిటల్లు ఓపెన్ చేసి ఉచిత విద్య వైద్యం అందించారు.

అంతకుముందు మిషన్ కాంపౌండ్ లో చిన్నపాటి చర్చిని మొదట నిర్మించారు. అయినా మనసులో ఏదో తెలియని వెలితి. ఓరోజు ఉదయం తను ఉండే బంగ్లా కంటే ఆలయం చిన్నగా అనిపించింది. అంతే ఆలోచన వచ్చిందే తడవుగా మరో ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు. దీనికోసం ఇంగ్లాండ్ తో పాటు ఇతర దేశాలనుండి ఇంజనీర్లను రప్పించి దాదాపు వంద రకాల నమూనాలను సేకరించినట్టు చెబుతారు.

ప్రతీది ప్రత్యేకమే..

చారిత్రక దేవాలయానికి సంబందించి ప్రతీది ఒక అద్భుతమే అని చెప్పాలి. మెదక్ మహాదేవలయం చర్చి గోపురం ఎత్తు 175 అడుగులు, పొడవు 200అడుగులు, వెడల్పు 100అడుగులు, దీనికి మూడు గవాక్షములు ( ద్వారాలు ) మూడు దిక్కుల్లో వివిధ రంగులు కలగల్పిన అద్దాలను ప్రతిష్టింపజేశారు.

తూర్పున యేసుక్రీస్తు జన్మవృత్తాంతంకు సంబంధించి, పడమర క్రీస్తును శిలువ వేసి చంపిన దృశ్యం, ఉత్తరాన క్రీస్తు చనిపోయి ఆరోహనమైపోతున్న అద్భుత దృశ్యాలు కనిపిస్తాయి. ఈ దృశ్యాలకు ప్రాణం పోసింది ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఫ్రాంక్ ఓ సాలిస్ బరి అనే ఆర్కిటెక్చర్, ఈ మూడు దృశ్యాలు కేవలం పగటిపూట వచ్చే సూర్యకాంతితో మాత్రమే కనిపిస్తాయి.

రాత్రిపూట కనిపించవు. చర్చి కప్పు లోపలిభాగం దేవాలయ తొలినాళ్లలో మూడేళ్ళ వరకు ప్రతిధ్వనించేదంటారు. 1927లో గోళాకారంలో ఉన్న లోపలి భాగాన్ని ప్రత్యేకంగా తయారు చేసిన రబ్బర్, కాటన్, మరికొన్ని రసాయనాలను ఉపయోగించి ఇంగ్లాండ్ దేశానికి చెందిన చిత్రకారులు బాడ్ షా గ్యాస్ హోప్ లు ఎంతో శ్రమించి రీసౌండ్ రాకుండా చేశారు.

ఆసియా ఖండంలోనే విస్తీర్ణంలో పెద్ద చర్చి

ఈ చారిత్రక కట్టడం ఆసియా ఖండంలోనే విస్తీర్ణంలో పెద్దది. ఇక్కడ ఒకేసారి లక్షమంది భక్తులు ప్రార్థనలు చేసుకునే వెసులుబాటు ఉంది. చర్చి నిర్మాణమంతా గోతిక్ శైలిలో నిర్మించబడింది. దేవాలయంలో వేసిన రంగురంగుల టైల్స్ ను వివిధ దేశాల నుండి తెప్పించారు పాస్నెట్.

వీటిని ఎంతో అందంగా అమరుస్తూ తీర్చిదిద్దారు. ఇన్నేల్లైనా చెక్కు చెదరకుండా ఉండడంతో పాటు ఏకాలంలో అయినా సౌకర్యవంతంగా ఉండడం వీటి ప్రత్యేకత. ఈ చర్చి అనేక ఆసక్తికర సంఘటనలను తనలో దాచుకుంది. దీంట్లో మొదటగా ప్రస్తావించేది చర్చి ప్రాంగణంలో ఉన్న మిషన్ కాంపౌండ్ భౌగోళిక స్వరూపం. దీని గురించి చాలా ఒక్కోరు ఒక్కోలా చెబుతారు స్థానికులు.

దేవాలయ నిర్మాణ సమయంలోనే మిషన్ కాంపౌండ్ భౌగోళికంగా ఏ విధంగా ఉందో ఆ శైలిలోనే చర్చిని నిర్మించేందుకు చార్లెస్ వాకర్ పాస్నెట్ చర్యలు తీసుకొన్నట్టు చెబుతారు. సీఎస్ఐ వెయ్యి ఎకరాల స్థలాన్ని ఏరియల్ వ్యూలో చూస్తే అచ్చం చర్చి నిర్మాణానాన్ని పోలి ఉండడం మరో ప్రత్యేకత. దీనికనుగుణంగానే ఆలయ నిర్మాణం జరిగినట్టు చరిత్ర చెపుతోంది.

క్రిస్మస్ వేడుకలకు అంతా సిద్ధం

ప్రత్యేకించి క్రిస్మస్ పండగ పర్వదినాల్లో ఈ చర్చి రంగుల కాంతులీనుతూ ధగధగ మెరిసిపోతోంది ఇతర రాష్ట్రాల నుండే కాకుండా దేశ విదేశాల నుండి కూడా భారీ ఎత్తున భక్తులు ఈ మహా దేవాలయాన్ని దర్శించుకొని తన్మయత్వంలో మునిగి తేలుతారు.

ప్రత్యేకించి ఏటా క్రిస్మస్ పండగ సమయంలో వేడుకలను అంగరంగ వైభవంగా జరిపేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఈ ఏడాది కూడా క్రిస్ వేడుకలకు సిద్ధమైంది మెదక్ చర్చి. బిషప్ సాల్మన్ రాజ్ ఆధ్వర్యంలో పండగ ఏర్పాట్లు ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు సిద్దం చేశారు.

చర్చిని విద్యుత్ దీపాల వెలుగులో అందంగా అలంకరించారు. ఈ ఏడాది అదనంగా ఏర్పాటు చేసిన స్ట్రీట్ లైట్లను స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఇటీవలే ప్రారంభించారు. దీంతో చర్చి ప్రాంగణమంతా క్రిస్మస్ వాతావరణం నెలకొంది. మంగళవారం స్థానిక సండే స్కూల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో బిషప్ సాల్మన్ రాజ్ పాల్గొన్నారు. ప్రతీ ఏటా దేశ విదేశాల నుండి భక్తులు అధిక సఖ్యలో పాల్గొని ఈ చర్చిని సందర్శిస్తారు. దీనికనుగుణంగానే నిర్వాహకులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. కరోనా సందర్భంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

సిద్దు మదుల్ వాయి

Related posts

అభాగ్యులకు అండగా దేవాడ గ్రామస్తులు

Satyam NEWS

వైశ్య ప్రముఖుడు కొత్తా వెంకటేశ్వర్లు ఇక లేరు

Satyam NEWS

ఆదినారాయణ రెడ్డి పై కేశవరెడ్డి విద్యాసంస్థల చైర్మన్ ఫైర్

Satyam NEWS

Leave a Comment