40.2 C
Hyderabad
April 19, 2024 17: 04 PM
Slider ప్రత్యేకం

విశ్లేషణ: తెలుగును చంప వద్దు ఆంగ్లాన్ని పెంచ వద్దు

Y S Jagan 181

మనిషి జీవితంలో అతి ముఖ్యమైన భాగం విద్యాభ్యాసం. విద్య వేసే పునాదులపైనే వ్యక్తి, సమాజం,సంస్కృతి,దేశం నిర్మించుకునే వైభవ నిర్మాణాలు ఆధారపడతాయి. అక్షరాస్యత అంటే, కేవలం సర్టిఫికెట్లు కావు. పొందిన జ్ఞానం, ఆచరణలు, అభ్యున్నతులే  ప్రధాన అంశాలు.

విద్యలో నాణ్యత, వసతులు, వనరులు ఉన్నాయా? ఉంటే  ఏ మేరకు ఉపయోగ పడుతున్నాయి? అనేవి ప్రధాన ప్రశ్నలు. ఈ అంశాలు అలా ఉండగా, ఏ భాషలో చదవాలి?  అనేది నేడు  ప్రధానంగా  చర్చనీయాంశమయ్యింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మాధ్యమం అనే అంశం వివాదాస్పదంగా మారడం దురదృష్టకర పరిణామం.

ఇంగ్లిష్ లో చదువుకుంటేనే సమాజంలో గుర్తింపు ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు బాగా వస్తాయి. ప్రపంచస్థాయి  పోటీలో నిలబడతారు. దేశంలోనే కాక, విదేశాల్లోనూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎక్కువగా వస్తాయి. రాణింపు పెరుగుతుంది,  అనే వాదన ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయింది.

ఒకప్పుడు,  ఉన్నత కుటుంబాలకు చెందినవారు, నగరాలు, పెద్ద పట్టణాల్లో ఉన్నవారే ఇంగ్లిష్ మీడియంలో చదువుకునేవారు. మిగిలిన వారి విద్యాభ్యాసం  తెలుగు మీడియంలోనే జరిగేది.  గడచిన రెండు దశాబ్దాలపై నుండి ఈ దృశ్యం మారింది.

పేదవారు, దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి వారు కూడా పిల్లలను ఎక్కువగా ఇంగ్లిష్ మీడియంలోనే చదివిస్తున్నారు. ఈ పరిణామంతో గవర్నమెంట్ విద్యాలయాలు పూర్తిగా వెనక్కు వెళ్ళిపోయాయి. ప్రైవేట్ విద్యాలయాలు తామర తంపరగా పెరిగిపోయాయి.

గవర్నమెంట్ విద్యాలయాల్లో చదువుకోవడం నామోషీగా మారింది. ఆలా చదువుకుంటున్న పిల్లలను, కుటుంబాలను తక్కువచేసి చూసే ఘోరమైన సామజిక మార్పులు కూడా వచ్చేశాయి. విద్య అత్యంత ఖరీదైన రంగంగా మారిపోయింది. కొంతమంది 10 వ తరగతి వరకూ తెలుగు మీడియంలో చదువుకుని,   ఇంటర్మీడియట్ లో ఇంగ్లిష్ మీడియం తీసుకునేవారు.

ముఖ్యంగా వీరంతా ఎం.పి.సి, బై.పి.సి విద్యార్థులే అని చెప్పవచ్చు. మరి కొందరు ఇంటర్మీడియట్ వరకూ కూడా తెలుగు మీడియంలో చదువుకునేవారు. ఇంజనీరింగ్, మెడిసిన్ మొదలైన కోర్సులు   ఇంగ్లీష్ మీడియంలో ఉన్నప్పటికీ, తమ సామర్ధ్యతను పెంచుకుని, విద్యాభ్యాసం కొనసాగించేవారు.

ఇంకొంతమంది  డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు కూడా తెలుగు మీడియంలోనే చదువుకునేవారు. మిగిలినవారు,  వారికి ఉన్న  సామర్ధ్యం, ఇష్టం, వసతులు, వనరులు, వారు ఎంచుకున్న సబ్జెక్ట్స్ బట్టి ఇంటర్మీడియట్ నుండి ఉన్నత విద్యల వరకూ ఇంగ్లిష్ మీడియంలో సాగించేవారు.

దాదాపు 30 ఏళ్ళ క్రితం వరకూ ఇదే విధానం కొనసాగింది. ఇప్పటికీ అక్కడక్కడా ఇలాగే సాగుతోంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగాలతో బాటు, అమెరికా వంటి సంపన్న దేశాలలో విద్య , ఉద్యోగ, ఉపాధులు  పొందాలనే ఆలోచనలు పెరగడం, అవకాశాలు కూడా పెరుగుతున్న నేపథ్యంలో  ఇంగ్లిష్ మీడియం చదువుల పట్ల ఆకర్షణ గణనీయంగా పెరిగింది.

ఈ ధోరణి  కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ ఉంది. వై. ఎస్.జగన్ మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సుదీర్ఘంగా ప్రజల మధ్య తిరిగారు. తొలిదశలో,  ఓదార్పు యాత్ర తర్వాత దశలలో,  పాదయాత్రలుగా అనంతమైన ప్రజాప్రస్థానం చేశారు.

అనేక ఆర్ధిక, సామాజిక రంగాలకు చెందిన వారిని   కొన్ని లక్షలమందిని కలిశారు. కలిసినప్పుడు వారు వెలిబుచ్చిన అంశాలలో బోధనా భాష ఒక ప్రధానమైన అంశం. జీవిత ప్రమాణాలు పెంచుకోడానికి ,  దానికి కావాల్సిన ఉన్నత విద్యలు చదివి, ఉత్తమ  ఉద్యోగ, ఉపాధులు పొందడానికి  వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులు జగన్ ముందు ఉంచారు.

ఈ నేపథ్యంలో, కలిసిన వాళ్ళల్లో  ఎక్కువమంది అట్టడుగు వర్గాలు, దిగువ మధ్య తరగతివారే  ఉన్నారు. తను అధికారంలోకి వస్తే, పాఠశాలల స్థాయిలోనే ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడతామని, తద్వారా, ఉన్నత విద్యలు చదువుకుని, పోటీ ప్రపంచంలో నిలబడి, జీవిత ప్రమాణాలు పెంచుకోవడానికి ఆలంబనగా నిలిచే విద్యావిధానం రూపొందిస్తామని  వారికి మాట ఇచ్చారు.

పాఠశాలలో ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన ప్రవేశపెట్టడం  గురించి పార్టీ మ్యానిఫెస్టోలోనూ పెట్టారు. వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నవంబర్ లో జి. ఓ విడుదల చేశారు. 1వ తరగతి నుండి 6 వ తరగతి వరకూ తప్పనిసరిగా ఇంగ్లిష్ మీడియంలో విద్య కొనసాగించాలని, ఇది 2020-21 విద్యాసంవత్సరం నుండి అమలులోకి వస్తుందని దాని సారాంశం.

తర్వాత, ఒక్కొక్క విద్యా సంవత్సరంలో ఒక్కొక్క తరగతి పెంచుకుంటూ వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్తులో నియామకాల్లో ఇంగ్లిష్ లో ప్రావీణ్యం ఉన్నవారికే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. మొదట్లో,  1 వ తరగతి నుండి 8 వ తరగతి వరకూ అమలుచేయాలని ప్రతిపాదనలు చేశారు.

నిపుణులైన ఉపాధ్యాయులు,  టెక్స్ట్ పుస్తకాల కొరత ఉంటుందనే నేపథ్యంలో 1 వ తరగతి నుండి  6 వ తరగతి వరకే అని ఇంగ్లిష్ మాధ్యమ విధానాన్ని కుదించారు. ఉపాధ్యాయులలో నైపుణ్యాలు పెంచడం, టెక్స్ట్ బుక్స్ రూపకల్పన, ఇంగ్లిష్ లాబ్స్ ఏర్పాటు, మౌలికవసతుల రూపకల్పనపై దృష్టి సారిస్తామని ప్రకటించారు.

తదనంతర పరిణామాల్లో మండలానికి ఒక తెలుగు మీడియం పాఠశాల కూడా అందుబాటులో ఉంచుతామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. పాఠశాల బోధనలో మాతృభాషైన తెలుగును తీసివేసి, ఇంగ్లిష్ కు పట్టం కడుతున్నారని కొన్ని రంగాల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చింది.

పాదయాత్రలో మాట ఇచ్చిన ప్రకారమే నడుచుకుంటాం, సమాజంలో ఎక్కువమంది ఇంగ్లిష్ భాషలోనే బోధనలు సాగాలని కోరుకుంటున్నారు,కేవలం  కొంతమంది కోసం ఈ విధానం మార్చే ప్రసక్తి లేదని ముఖ్యమంత్రి తేల్చి చెప్పేశారు. ఈ క్రమంలో జి. ఓ పై కొందరు హై కోర్టుకు వెళ్లారు.

జాతీయ విద్యావిధానాలు, ఆర్టికల్ 19(1), ఆర్టికల్ 21 ప్రకారం భావవ్యక్తీకరణ, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత స్వేచ్ఛ,జీవించే హక్కు,  తద్వారా వచ్చే విద్యా హక్కు, సుప్రీం కోర్టు సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీచేసిన జి ఓ లను ఆంధ్రప్రదేశ్ ఉన్నతన్యాయస్థానం కొట్టివేసింది.

మాతృభాషలోనే బోధన సాగాలని తీర్పు ఇచ్చింది. ఐనప్పటికీ,  రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే ప్రసక్తే లేదని, అవసరమైతే, సుప్రీంకోర్టుకైనా వెళ్తామని రాష్ట్ర విద్యాశాఖా మంత్రి ప్రకటించారు. పాఠశాలలో బోధనా మాధ్యమంపై నిపుణులు విభిన్నమైన సూత్రాలు చెబుతున్నారు.

పాఠశాల విద్య మాతృభాషలో బోధిస్తే, మనో వికాసం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని గ్రహించే లక్షణం, గుర్తుపెట్టుకుని తిరిగి రాయగలిగే సామర్ధ్యాలు బాగా ఏర్పడతాయని  కొందరు నిపుణులు అంటున్నారు. ప్రాంతీయ సంస్కృతి, భూమిభక్తి, సొంతదనం పెరుగుతాయని మరికొందరు చెబుతున్నారు.

మాతృభాషలో అధికారం సంపాయిస్తే, అదనంగా,  ఎన్ని ఇతర భాషల లైనా నేర్చుకునే సామర్ధ్యం పెరుగుతుందని భాషాశాస్త్రవేత్తలు ఇంకొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మాతృభాష,జాతీయ భాష, ప్రపంచ భాషలతో కూడిన ” త్రిభాషా సూత్రం” గొప్పదని మరికొందరు సూచిస్తున్నారు.

1 వ తరగతి నుండి 10 వ తరగతి వరకూ లేదా 1 వ  తరగతి నుండి 8 వ తరగతి వరకూ లేదా కనీసం 5 వ తరగతి వరకైనా మాతృభాషలో సాగాలని ఇంకొందరు విద్యావేత్తలు చెబుతున్నారు. అది మాతృభాషా? ఇంగ్లిష్ భాషా?  అన్యభాషా?  అన్నది అసలు అంశమే కాదు, విద్యావిధానమే సంపూర్ణంగా మారాలని మరికొందరు విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు.

ఇలా అనేక విధానాలు సూచిస్తున్నారు. ఇవ్వన్నీ ఆలా ఉండగా, ప్రభుత్వ పెద్దలు కూడా కొంత సమతుల్యత పాటించాల్సిన అవసరం ఉంది. పరిపాలనలో పట్టువిడుపులు , లౌక్యం కూడా చాలా ముఖ్యం అని,  చాణుక్యాదులు రాజనీతిలో  చెప్పిందే.

అన్నివర్గాల వారిని, మాతృభాషా ప్రేమికులను, కొందరి సెంటిమెంట్లను కూడా గుర్తించాల్సిందే. గౌరవించాల్సిందే. ఆంధ్రప్రదేశ్ లో చాలామంది ఇంకా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నారు. నిరక్షరాస్యులైన  తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎక్కువగా కలిగిఉన్నవారే  ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్ లోని సమగ్ర పరిస్థితులను ఇంకా బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మారుతున్న ప్రపంచ, కాల మాన పరిస్థితులకు  అనుగుణంగా, ఎక్కువమంది ప్రజల కోరికలు, అవసరాలను దృష్టిలో పెట్టుకుని,  పాఠశాల విద్యాబోధనలో ఇంగ్లిష్ మీడియం పెట్టడం హర్షణీయమే.

కానీ, తెలుగులో విద్యాబోధన పూర్తిగా ఎత్తివేయడం సమంజసం కాదు. 1 వ తరగతి నుండి 10 వ తరగతి వరకూ లేదా కనీసం 8 వ తరగతి వరకూ ఆప్షనల్ గా కొనసాగించడమే మంచిపని. తల్లి దండ్రులు, విద్యార్థులు వారికి నచ్చిన మాధ్యమం ఎంచుకుంటారు. వాటి పరిణామాలు, ఫలితాలు వారే అనుభవిస్తారు.

ఇంగ్లిష్, తెలుగు రెండు మాధ్యమాలలో పాఠశాల బోధన సాగించడం అన్ని రకాలుగా మంచిది. వీటన్నింటి కంటే ముఖ్యమైనవి,  విద్యా ప్రమాణాలు పెంచడం, తద్వారా ఉత్తమమైన పౌరులను జాతికి అందించడం, సర్వోన్నత ఆంధ్రప్రదేశ్ ను పునర్నిర్మించడం లక్ష్యాలుగా విద్యా పరిపాలన సాగాలి.

ప్రభుత్వం బోధనా మాధ్యమం విషయంలో, త్వరలో వివేకవంతమైన నిర్ణయమే తీసుకుంటుందని అభిలషిద్దాం.

మాశర్మ సీనియర్ జర్నలిస్టు

Related posts

కొత్త ఏడాది ప్రారంభంలో మంత్రి బొత్స కొత్త సందేశం…!

Satyam NEWS

జనవరి 18 నుంచి కంటి వెలుగు

Murali Krishna

బీడి కార్మికులకు ఇండ్ల స్థలాల కేటాయింపు

Satyam NEWS

Leave a Comment