హైదరాబాద్ లో వెయ్యి కోట్లకు పైగా ఖర్చు చేసి మెగా మార్కెట్ అభివృద్ధికి ప్రభుత్వం ఆలోచిస్తుందని, మార్కెట్లలో అగ్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. గురువారం మంత్రి, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ లతో కలిసి ఖమ్మం పత్తి మార్కెట్ యార్డులో బుధవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాద ఘటన స్థలాన్ని సందర్శించి పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ యార్డులో జరిగిన సంఘటన దురదృష్టకరమని, దీనికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, ప్రస్తుతం పోలీసుల విచారణలో ఉందన్నారు. ప్రమాదంలో పత్తి బేల్లు తగలబడుతున్నాయని తెలిసిన వెంటనే నష్ట నివారణ చర్యలకు ఆదేశించామని, 10 నిమిషాలలో ఫైర్ ఇంజన్ రావడం వల్ల ప్రమాద విస్తృతి తగ్గిందని మంత్రి తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాల నివారణకు, ప్రమాదం ఎందుకు జరిగిందో కారణాలు తెలుసుకోవాల్సి ఉందని, మార్కెట్ లో ఉన్న భద్రత ఏర్పాట్లు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని సరైన నివేదికను ప్రభుత్వానికి అందించాల్సిందిగా అధికారులను ఆదేశించడం జరిగిందని అన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మార్కెట్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు 100 కోట్ల రూపాయలతో ఆధునీకరణ పనులు ప్రారంభిస్తామని, త్వరలోనే ఆ పనులకు శంకుస్థాపన చేయడం జరుగుతుందని అన్నారు. మార్కెట్ కు చుట్టూ ఉండే రోడ్లు విశాలంగా, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉండాలని, మన మార్కెట్ పూర్తి స్థాయిలో పరిశుభ్రంగా ఉండాలని అన్నారు. హైదరాబాద్ లో వెయ్యి కోట్లకు పైగా ఖర్చు చేసి మెగా మార్కెట్ అభివృద్ధికి ప్రభుత్వం ఆలోచిస్తుందని, విమానాశ్రయం దగ్గరలో ఔటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్ మధ్యలో 400 ఎకరాలలో ఈ మార్కెట్ అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు.
వరంగల్, నిజామాబాద్, ఖమ్మం వంటి పెద్ద పెద్ద మార్కెట్ లు అభివృద్ధి చేసేందుకు నివేదికలు సిద్ధం చేస్తున్నామని, రైతులకు వ్యాపారులకు సౌకర్యంగా ఉండే విధంగా, ఎవరు నష్టపోకుండా ఉండే విధంగా కొత్త మార్కెట్ నిర్మాణం ఉంటుందని అన్నారు. నూతన మార్కెట్ అందుబాటులోకి వచ్చేలోగా మిర్చి పంటను పత్తి మార్కెట్లో కూడా అందుబాటులోకి తీసుకొని రావాలని అన్నారు. గతంలో సిద్దారెడ్డి కళాశాల ఉండే ప్రదేశంలో పత్తి మార్కెట్, పక్కన కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయడం జరిగిందని, దీనిని ప్రస్తుతం ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం ఇక్కడ మిర్చి ఘాటు అధికంగా అయినందున మద్ధులపల్లిలో కొత్త మార్కెట్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఖమ్మం ప్రజలకు, రైతులకు, వ్యాపారులకు అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని, అగ్ని ప్రమాదానికి గల కారణాలను కనిపెట్టి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.