24.7 C
Hyderabad
October 26, 2021 05: 02 AM
Slider సంపాదకీయం

పాపం… మెగాస్టార్ చిరంజీవి… ఇప్పుడేం చేస్తారో…..?

#megastar

తెలుగు సినీ పరిశ్రమకు దాసరి నారాయణ రావు తర్వాత పెద్ద దిక్కుగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి వై ఎస్ జగన్ దెబ్బకు హతాశుడయ్యారు. తమ్ముడు పవన్ కల్యాణ్ రాజకీయాలలో జగన్ కు ప్రత్యర్ధిగా ఉన్నా కూడా జగన్ చర్యలన్నింటిని సమర్థించిన చిరంజీవి ఇప్పుడు బేల మొహం వేసి కూర్చున్నారు.

సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు తీర్చేందుకు అవమానాలు కూడా భరించిన చిరంజీవి ఏపి ముఖ్యమంత్రి జగన్ తో సఖ్యతనే కోరుకున్నారు. అమరావతి రాజధాని మార్పు నుంచి అన్ని విషయాలలోనూ జగన్ కు చిరంజీవి ప్రత్యక్షంగానో పరోక్షంగానో మద్దతు తెలిపారు.

తమ్ముడు పవన్ కల్యాణ్ రాజకీయ పార్టీ నిర్వహిస్తున్న ఏపిలో చిరంజీవి జగన్ కు మద్దతు పలకడంపై పలు విధాలుగా విమర్శలు వెలువడ్డాయి. పవన్ కల్యాణ్ అభిమానులైతే చిరంజీవిపై కొన్ని సందర్భాలలో తీవ్రమైన వ్యతిరేక వ్యాఖ్యల్ని చేశారు కూడా.

అయినా సరే సినీ పరిశ్రమ బాగోగులే తనకు ముఖ్యమనే రీతిలో చిరంజీవి వ్యవహరించారు. ఏపి ముఖ్యమంత్రి జగన్ తో సఖ్యత కోసం పలు విధాలుగా ఆయన ప్రయత్నించారు. నేరుగా ఆయన అప్పాయింట్ మెంట్ ఇవ్వకపోతే సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ద్వారా ట్రై చేసి ముఖ్యమంత్రిని వెళ్లి కలుద్దామనుకున్నారు.

సెప్టెంబర్ 4వ తేదీన చిరంజీవికి జగన్ తో అప్పాయింట్ మెంట్ కూడా ఫిక్స్ అయింది. దాంతో ముఖ్యమంత్రితో భేటీకి ఎవరెవరితో కలిసి వెళ్లాలని అనే విషయంపై కూడా చిరంజీవి ఒక నిర్ణయానికి వచ్చారు. అక్కినేని నాగార్జున, నిర్మాత సురేష్ బాబులతో కలిసి వెళ్లేందుకు కూడా దాదాపుగా నిర్ణయించుకున్నారు.

అయితే ఆగస్టు 31న విడుదలైన జీవో సంగతి ఆ తర్వాత వెల్లడి అయింది. ఆగస్టు 31న ఏపి ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం ఏపిలో సినిమా టిక్కెట్లను ప్రభుత్వమే అమ్మేందుకు విధివిధానాలు ఖరారు చేసే కమిటీ నియామకం జరిగింది. ఈ విషయం కొంచెం ఆలశ్యంగా తెలుసుకున్న చిరంజీవి నాలుగో తారీకు అప్పాయింట్ మెంట్ ను రద్దు చేసుకున్నారని సినీ పరిశ్రమ వర్గాల ద్వారా తెలిసింది.

సినిమా టిక్కెట్లను ప్రభుత్వమే అమ్మి, వచ్చిన డబ్బులను ఆ తర్వాతి నెలలో ఎగ్జిబిటర్ కు, డిస్ట్రిబ్యూటర్ కు, మిగిలితే నిర్మాతకు ప్రభుత్వం వద్ద నిధుల లభ్యత బట్టి చెల్లింపులు చేస్తారనే వార్తలు వెలువడటంతో నిర్ఘాంత పోవడం సినీపెద్దల వంతు అయింది. దేశంలో ఎక్కడా లేని ఈ విధానం ఎవరూ ఊహించినది కాదు. తెలుగు సినిమాకు 70 శాతం బిజినెస్ ఆంధ్రా, సీడెడ్ నుంచి రావాల్సి ఉంటుంది. నైజాం నుంచి ఓవర్సీస్ నుంచి మిగిలిన 30 శాతం బిజినెస్ ఉంటుంది.

ఆంధ్రా, సీడెడ్ బిజినెస్ లేకుండా ఏ సినిమా కూడా లాభాల్లోకి రాదు. చిరంజీవి ఇంటి నుంచి (మెగా హీరోల చిత్రాలు) ఏడాదికి 600 నుంచి వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడితో సినిమాలు విడుదల అవుతుంటాయి. ఇవి వెయ్యి కోట్ల నుంచి మూడు నాలుగు కోట్ల రూపాయల వరకూ బిజినెస్ చేస్తాయి.

పవన్ కల్యాణ్ సినిమా చేస్తే దీనికి అదనంగా ఉంటుంది. ఇంత బిజినెస్ తో బాటు సొంతంగా చిరంజీవి సినిమాలు కూడా పెద్ద ఎత్తున సిద్ధం అవుతున్నాయి. ఈ కారణంగా చిరంజీవి జగన్ తో సఖ్యత కోసం తహ తహ లాడారు. అయితే ముఖ్యమంత్రి జగన్ వేరేవిధంగా తలపోశారు. పవన్ కల్యాణ్ చేస్తున్న సినిమాలు విడుదల అయితే రాబోయే రెండేళ్లలో ఆయనకు ఏపిలో అభిమానుల సంఖ్య రెట్టింపు కావడమే కాకుండా ఓట్లు వరదై పారేందుకు అవకాశం ఉంది.

సామాజిక చైతన్యం ఉన్న సినిమాలనే పవన్ కల్యాణ్ తెరకెక్కిస్తున్నారు. ఈ విధంగా జరగబోతున్న భీమ్లానాయక్ ల దాడిని తట్టుకోవడానికి సినిమా టిక్కెట్లను ప్రభుత్వమే బుక్ చేసే తంత్రాన్ని జగన్ అమలు చేయబోతున్నారు. ప్రతిపాదన స్థాయిలోనే ఉన్న ఈ నిర్ణయం అమలు జరిగితే పెద్ద పెద్ద హీరోల సినిమాలు ఇక ఏపిలో విడుదల అయినా కూడా ఏ మాత్రం లాభం ఉండదు.

పవన్ కల్యణ్ తో బాటు ఆయనకు రాజకీయంగా బద్ద వ్యతిరేకి కుటుంబానికి చెందిన మహేష్ బాబు సినిమాలు కూడా ఇక ఏపిలో విడుదల అయ్యేందుకు చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఈ నేపథ్యంలో చిరంజీవి అడకత్తెరలో పోక చక్కగా నలిగిపోతున్నారు. జగన్ నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే తెలుగు చలన చిత్ర పరిశ్రమ మనుగడ ఏపిలో ప్రశ్నార్ధకం అవుతుంది. ఇలా చెయ్యద్దు అంటే జగన్ మరింత రెచ్చిపోయి మరింత త్వరగా నిర్ణయం అమలు చేయడానికి అవకాశం ఉంది.

ఒప్పుకుంటే ఇక తన సినిమాలతో బాటు, తన ఇంటి నుంచి వచ్చే సినిమాలే కాకుండా పెద్ద హీరోల సినిమాలు ఏపిలో విడుదల అయినా ప్రయోజనం ఉండదు…. ఏం చేయాలో అర్ధం కాని పరిస్థితుల్లో ‘‘సినీ పెద్ద’’ చిక్కుకుని ఉన్నారు.

Related posts

రివాల్వర్ తో స్వైర విహారం చేసిన మజ్లీస్ నాయకుడు

Satyam NEWS

ఖమ్మం జిల్లా మధిరలో ముగిసిన క్రికెట్ పోటీలు

Satyam NEWS

పారదర్శకంగా కానిస్టేబుల్స్ బదిలీల ప్రక్రియ

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!