చిరంజీవి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి టీజర్ రిలీజైంది.. ‘చరిత్ర స్మరించుకుంటుంది.. ఝాన్సీ లక్ష్మీబాయ్, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ లాంటి ఎందరో మహనీయుల ప్రాణత్యాగాల్ని.. కానీ ఆచరిత్ర పుటల్లో కనుమరుగయ్యాడు ఒక వీరుడు. ఆంగ్లేయులపై యుద్ధ భేరి మోగించిన రేనాటి సూర్యుడు’ అంటూ పవన్ కల్యాణ్ వాయిస్ తో ప్రారంభమయే టీజర్ యుద్ద సన్నివేశాలతో ఆద్యంతం ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఇందులో సన్నివేశాలు చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకునేలా ఉన్నాయి. చారిత్రక వీరుడి ఘనతను పరిచయం చేసే వ్యాఖ్యలు పవన్ వాయిస్‌తో రావడం మెగా అభిమానుల ఆనందానికి అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. తమిళంలో రజినీ కాంత్, మలయాళంలో మోహన్ లాల్, కన్నడలో యష్, హిందీలో అమితాబ్ ల వాయిస్ లతో ఈ సినిమా టీజర్లు విడుదలయ్యాయి. టీజర్ లో సైరా నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి ఒదిగిపోయారు. చిరంజీవి కత్తి పట్టిశత్రువులపై దండయాత్ర చేస్తున్న సన్నివేశాలు అదిరిపోయాయి. అమిత్ త్రివేది అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బావుంది. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార, తమన్నా, విజయ్ సేతుపతి, అమితాబ్ బచ్చన్, జగపతిబాబు తదితరులు ప్రధానపాత్రలు పోషించారు. భారతమాతకు బిగుసుకున్న సంకెళ్ళని తెంచడానికి రేయింబవళ్లు శ్రమించిన వ్యక్తి ఉయ్యాల వాడ నరసింహరెడ్డి ఆ రోజులలో బ్రిటీష్ సైనికులతో యుద్ధం చేసిన ఘటనలు కళ్లముందు కదలాడుతున్నాయి. రత్నవేలు చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయడం మరింత ప్లస్.. మొత్తంగా టీజర్ తో అంచనాలు పెరిగిపోయాయి. సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.
previous post