28.2 C
Hyderabad
January 21, 2022 16: 53 PM
Slider సంపాదకీయం

…..ఇంకా రాజకీయం నేర్చుకోని మెగాస్టార్ చిరంజీవి

#megastarchiranjevi
అట్టహాసంగా ఆరంభమై 18 సీట్లతో సరిపెట్టుకుని ఆ పై కాంగ్రెస్ లో విలీనంతో కథ సరిపెట్టుకున్న ప్రజారాజ్యం అధినేత మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికీ రాజకీయాలు నేర్చుకోలేదనిపిస్తున్నది. పార్టీ మునిగిపోయినా కేంద్ర మంత్రి పదవి పొంది సరిపెట్టుకున్న చిరంజీవి రాజకీయ ఎత్తుగడలు వేయడంలో ఓనమాలు కూడా నేర్చుకోలేకపోయారు. 

ఒక వైపు చిరంజీవి తమ్ముడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టి జగన్ తో చావో రేవో తేల్చుకుంటుంటే అనునిత్యం పవన్ కల్యాణ్ రాజకీయ మనుగడను అస్థిర పరచే చర్యలకు పాల్పడుతున్న చిరంజీవిని ఏమనాలో అర్ధం కావడం లేదు. చిరంజీవి వ్యాపార బంధాలను జగన్ చక్కగా వాడుకుంటూ పవన్ కల్యాణ్ భవిష్యత్తును పరోక్షంగా కంట్రోల్ చేస్తున్నారు. 

కాపు కులస్తులు అందరూ ఒక్కటవుతున్న తరుణంలో చిరంజీవి వేస్తున్న రాజకీయ తప్పటడుగులు తమ్ముడి రాజకీయ భవిష్యత్తునే కాకుండా కాపు కులస్తుల ఐక్యతను కూడా ఎప్పటికప్పుడు దెబ్బ తీస్తున్నాయి. సినిమా టిక్కెట్ల వ్యవహారం పేరుతో చిరంజీవిని మచ్చిక చేసుకోవడానికి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా వేసిన ఎత్తుగడ పారినట్లే కనిపిస్తున్నది. 

మెగాస్టార్ చిరంజీవి వ్యాపార భాగస్వామి అయిన అక్కినేని నాగార్జున తెరవెనుక రాయబారం నడిపి చిరంజీవిని ముఖ్యమంత్రి జగన్ పిలిచేలా చేశారనేది సిని పరిశ్రమ వర్గాల సమాచారం. సినీ పరిశ్రమ మొత్తం ఎదురుతిరిగిన సమయంలో జగన్ మోహన్ రెడ్డి చిరంజీవిని పిలిచి ‘‘మంచి భోజనం’’ పెట్టి పంపించడం తో కొత్త కథ మొదలైంది. కొద్ది రోజుల కిందట కాపు కులస్తులు తమ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించుకోవడానికి హైదరాబాద్ లో పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించుకున్నారు. 

రాజకీయంగా బలపడాల్సిన అవసరం ఉందని, రాబోయే ఎన్నికలలో ఛాన్సు మిస్ చేసుకోవద్దని కాపు కుల పెద్దలు తమ అభిప్రాయంగా చెప్పారు. పవన్ కల్యాణ్ తాను కేవలం కాపు కులం కోసం మాత్రమే పని చేయనని చెబుతున్నా కూడా కాపు కులస్తులందరూ ఆయన వెంట ఉంటేనే కాపు కులస్తుడు రాజ్యాధికారం చేజిక్కించుకోగలుగుతాడని అందరూ అభిప్రాయపడ్డారు. 

ఆ దిశగా పావులు కదులుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కూడా రెండడుగులు కిందికి దిగి పవన్ కల్యాణ్ తో ‘‘లవ్’’ ప్రస్తావన చేసింది. అదే సమయంలో సినిమా టిక్కెట్ల వ్యవహారం ముదురు పాకాన పడటంతో జగన్ చకచకా పావులు కదిపి చిరంజీవిని లంచ్ కి పిలిచారు. చిరంజీవి తన రాబోయే సినిమా విడుదలపై ఎంతో ఆందోళనతో ఉన్నందున జగన్ పిలవగానే వాలిపోయారు.

 ‘‘నేను సినిమా పరిశ్రమకు పెద్దరికం వహించను’’ అని చెప్పిన కొద్ది రోజులకే ఆయనకు జగన్ నుంచి ఆహ్వానం అందడం గమనార్హం. సినిమా టిక్కెట్ ధరల ప్రస్తావన చూపించి చిరంజీవిని కలిసిన జగన్ ఒక కొత్త ప్రస్తావన ఆయనతో తెచ్చిన్నట్లు వైసీపీ అనుకూల మీడియా పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించింది. 

చిరంజీవి కి రాజ్యసభ స్థానాన్ని జగన్ ఆఫర్ చేసినట్లు వైసీపీ అనుకూల మీడియా పెద్ద ఎత్తున కథనాలు వెలువరించింది. దీంతో ఒక్క సారిగా ఆశ్చర్య పోవడం సినీ పరిశ్రమ వంతయింది. సినీ పరిశ్రమతో బాటు కాపు కులస్తులు కూడా ఒక్క సారిగా తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. 

రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేద్దామనుకుంటున్న తరుణంలో చిరంజీవి వెళ్లి జగన్ రెడ్డి దగ్గర రాజ్యసభ టిక్కెట్ తీసుకోవడం వారికి నచ్చడం లేదు. అయితే వెలువడ్డ ఈ వార్తల్లో నిజమెంతో తెలియనందున అందరూ గుంభనంగా ఉంటున్నారు. జగన్ రెడ్డి వేసిన ఎత్తుగడకు చిరంజీవి లొంగిపోతే (రాజ్యసభ సీటు ఆఫర్ చేయడం నిజమైతే) ఇక పవన్ కల్యాణ్ రాజకీయ జీవితం భూ స్థాపితం అయినట్లే అవుతుంది. 

పవన్ కల్యాణ్ ను కాపులతో సహా ఎవరూ నమ్మే పరిస్థితి ఉండదు. సినీ పరిశ్రమకు చెందిన తన రాజకీయ భాగస్వాముల వత్తిడికి తలొగ్గి చిరంజీవి రాజ్యసభ సభ్యత్వానికి మొగ్గు చూపితే తన తమ్ముడికే కాకుండా తాను పుట్టిన కులం మొత్తానికి చెరుపు చేసిన వారవుతారు. 

చిరంజీవితో ఆచార్య చిత్రం తీసిన నిర్మాత జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అనే వార్తలు కూడా భారీ ఎత్తున ప్రచారంలో ఉన్నాయి. ఆచార్య సినిమా తీయించడం నుంచే జగన్ ఎత్తుగడలు వేసి చిరంజీవిని చక్రబంధంలో ఇరికించుకున్నట్లు కాపు కులస్తులు అనుమానిస్తున్నారు.

ఏ మాత్రం రాజకీయ పరిణితి లేకుండా వ్యవహరించి ప్రజారాజ్యం పార్టీని మూతేసిన చిరంజీవి ఇప్పటికీ రాజకీయం నేర్చుకోకపోవడంతో వరుసగా తప్పులపై తప్పులు చేసుకుంటూపోతూనే ఉన్నారు. 

Related posts

సైకాలజిస్ట్ ఎడ్వయిజ్: కొడాలి నానికి ఎర్రగడ్డలో చికిత్స చేయించాలి

Satyam NEWS

పేద విద్యార్థికి చేయూతనిచ్చిన ఉప్పల ఛారిటబుల్ ట్రస్టు

Satyam NEWS

కార్మిక వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోకపోతే ప్రజాగ్రహం తప్పదు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!