36.2 C
Hyderabad
April 25, 2024 22: 39 PM
Slider సంపాదకీయం

మెర్సీకిల్లింగ్: రైతులు – రాజధాని – రాజకీయ పార్టీలు

amaravathi 02

ఆంధ్రప్రదేశ్ రాజధాని రైతులు చేస్తున్న ఆందోళనను వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తేలికగా తీసుకుంటున్నట్లే కనిపిస్తున్నది. ఆందోళన కేవలం అక్కడి ఐదారు గ్రామాలకే పరిమితం అయి ఉందని అందువల్ల పెద్ద గా పట్టించుకోవాల్సిన అవసరం లేదనేది వారి ఆలోచనగా అనిపిస్తున్నది.

ఐదు లేదా ఆరు గ్రామాలలో మాత్రమే ఆందోళన జరుగుతుండటం వాస్తవమే అయినా జగన్ ప్రభుత్వం జాతీయ స్థాయిలో అప్రతిష్ట మూటకట్టుకునే అంశంగా ఇది మారుతున్నదనేది ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు లేదు. మరీ ముఖ్యంగా అమరావతి రైతులు మెర్సికిల్లింగ్ (కారుణ్య మరణానికి అనుమతి) కావాలంటూ భారత రాష్ట్రపతికి లేఖలు రాస్తున్న అంశం జాతీయ స్థాయిలో ప్రచారం పొందితే రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సినంత అపఖ్యాతి వచ్చేస్తుంది.

రాష్ట్రపతి ఆ లేఖను  కేంద్ర హోం శాఖకు పంపితే కేంద్ర హోం శాఖ తక్షణమే రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎవరూ ఏమీ చేయలేరనే ధీమా ఎల్లప్పుడూ మంచిది కాదు. ఇప్పటికే రాజధాని అంశంపై తెలుగుదేశం, బిజెపి, జనసేన పార్టీలు పలు రకాలుగా ఆందోళన చేస్తున్నాయి. అంతకు ముందు ఎన్నికలలో కలిసి పోటీ చేసిన పార్టీలు ఇవి. మళ్లీ వచ్చే ఎన్నికల నాటికి కలిసే అవకాశం ఉన్న పార్టీలు కూడా.

అందువల్ల ఈ అంశం రాజకీయంగా చూసుకున్నా కూడా కీలకమైనది. అయితే ముఖ్యమంత్రి గానీ ఆయన మంత్రి వర్గ సహచరులు కానీ పట్టించుకోవడం లేదు. కమిటీలు, నివేదికలతో విశాఖపట్నం వైపు సాగిపోతున్న ప్రభుత్వం అన్నీ అనుకూలంగానే ఉంటాయి అనుకోవడం అత్యాశే అవుతుంది. అమరావతి ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు భూములు కొనుగోలు చేశాయి.

ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ రీజినల్ కార్యాలయాలు ప్రారంభించేందుకు స్థలాలు కొనుగోలు చేశాయి. ఇప్పుడు రాజధాని అమరావతి కాదు విశాఖ పట్నం అంటే అవన్నీ తల ఊపే పరిస్థితి ఉండదు. ఇలా దాదాపు 500 కోట్ల రూపాయల మేరకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అక్కడ పెట్టుబడులు పెట్టాయి. అంతర్జాతీయ యూనివర్సిటీలు కూడా అక్కడ స్థలాలు కొనుగోలు చేశాయి. అమాంతం వాటిని కదిలించే పరిస్థితి ఉండదు.

మేం రాజధాని మార్చుకుంటున్నాం అని అంటే కుదిరేపని కాదు. విశాఖపట్నంలో ఇప్పుడు భూసేకరణ కార్యక్రమాన్ని జగన్ ప్రభుత్వం మొదలు పెట్టింది. ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయా అని ఆరా తీస్తున్నది. ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి విశాఖపట్నంలో పర్యటించి ఈ వివరాలు సేకరించారు. విశాఖపట్నంలో పెద్ద పెద్ద ప్రయివేటు కంపెనీలకు ప్రభుత్వం కేటాయించిన భూములు ఎంత? వాటిలో ప్రభుత్వం కేటాయించిన విధంగా పరిశ్రమలు పెట్టారా లేదా అని ప్రభుత్వం విచారణ కూడా మొదలు పెట్టింది.

అలా కేటాయించిన భూములలో నిర్ణిత కాలపరిమితిలో సంబంధిత కార్యకలాపాలు ప్రారంభించకపోతే సదరు భూమిని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవచ్చు. ఈ క్లాజును ఉపయోగించుకుని పెద్ద కంపెనీల తుట్టెను జగన్ ప్రభుత్వం కదిలించే సాహసం చేయబోతున్నది. మా చేతులో ఫుల్ పవర్ ఉంది మేం ఏం చేసినా చెల్లుతుందని అనుకునేంత చిన్న సమస్యలు కాదు ఇవి.

ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సంఘాలలో ఇప్పటికే చంద్రబాబునాయుడికి అనుకూలంగా ఉండే మనుషులు పోయి జగన్ కు అనుకూలంగా ఉండే వారు వచ్చేశారు. అందువల్ల ఉద్యోగ సంఘాలు ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయానికి అడ్డు చెప్పవు. అయితే ఉద్యోగులు మాత్రం ఇప్పటికే భయం భయంగా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులను విశాఖకు తరలించడం అంత సులభమైన విషయమేమీ కాదు.

సమాజం లోని చాలా మందికి రకరకాల సాయం చేస్తున్నాం కదా వారంతా తమకే ఓటు వేస్తారు అనుకోవడానికి వీల్లేదని చంద్రబాబు స్కీం పసుపు కుంకుమ ను చూసి ముఖ్యమంత్రి జగన్ తెలుసుకోవాలి. సమాజంలో అశాంతి పెరిగిపోతే సమస్యలు కొత్తవి పుట్టుకువస్తాయి. ఇవన్నీ మేం అణచివేస్తాం అనే తెగింపు ఉన్నవారికి చేతులు పూర్తిగా కాలిన తర్వాత గానీ తెలియదు.

Related posts

ఫర్ ట్రీట్మెంట్:పుట్టపర్తిలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని

Satyam NEWS

భార్యను కొట్టి చంపిన భర్త

Bhavani

వేసిన రోడ్లకే దిక్కులేదు… ఒక కొత్త రోడ్లా..?

Satyam NEWS

Leave a Comment