39.2 C
Hyderabad
April 23, 2024 15: 07 PM
Slider గుంటూరు

ఉపాధి హామీ పథకంలో మేట్ల వ్యవస్థను కొనసాగించాలి

#METLA system

ఉపాధి హామీ పథకంలో మేట్ల వ్యవస్థ కొనసాగించాలని తదితర డిమాండ్లతో వ్యవసాయ కార్మిక సంఘం పల్నాడు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో, మే 29 కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆ సంఘం పల్నాడు జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు అనుముల లక్ష్మీశ్వర రెడ్డి, కారుచోల రోశయ్య కోరారు.

పల్నాడు విజ్ఞాన కేంద్రంలో వారు విలేఖరులతో మాట్లాడుతూ తమ సంఘం ఆధ్వర్యంలో మే 4వ తేదీ నుంచి 26 వరకు ఉపాధి హామీ పథకం రక్షణకై పని ప్రదేశాల వద్దకు యాత్రలు కార్యక్రమం సాగిందని తెలిపారు. దీని కొనసాగింపుగా తమ సంఘం దృష్టికి వచ్చిన సమస్యలు, మరియు ఉపాధి హామీ పథకం మౌలిక డిమాండ్ల పరిష్కారం కోసం కలెక్టరేట్ వద్ద మే 29వ తేదీన ధర్నా జరుగుతుందని తెలిపారు.

జిల్లాలోని 23 మండలాలలో 68 గ్రామాల్లో ఉపాధి హామీ పని ప్రదేశాలను తమ సంఘ కార్యకర్తలు సందర్శించారని, కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని దెబ్బతీయటానికి ఏ విధంగా కుట్ర చేస్తున్నదో నాలుగు వేల కరపత్రాలు ప్రచురించి పంపిణీ చేశామని, సోషల్ మీడియా ద్వారా అన్ని మండలాలలో ప్రచారం నిర్వహించామని, 12 మండలాలలోని 36 గ్రామాలలో బైక్ యాత్ర ద్వారా మైక్ ప్రచారం నిర్వహించామని తెలిపారు.

గత ఐదారు వారాలుగా ఉపాధి హామీ పనులు జిల్లాలో చురుగ్గా జరుగుతున్నాయని, వేతనాల చెల్లింపు సకాలంలో జరగటం లేదని కూలీలు తెలియజేశారు. నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం యాప్తో ఆధార్ లింకింగ్ జరగకపోవడం తదితర టెక్నికల్ కారణాలతో గతంలో ఉన్న అనేక జాబ్ కార్డులు డిలీట్ అయిపోయాయని చాలా చోట్ల జాబ్ కార్డులు లేవు కనుక పనికి రానివ్వడం లేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారని లక్ష్మీశ్వర రెడ్డి తెలియజేశారు.

కొత్త విధానంలో సైట్ సూపర్వైజర్లుగా చాలా చోట్ల కొంతమందిని ప్రకటించినప్పటికీ వారికి ఎలాంటి వేతనాలు ఇవ్వడం లేదని సైట్ సూపర్వైజర్లు ఆవేదన వ్యక్తం చేశారు.చాలా పని ప్రదేశాలలో ఫస్ట్ ఎయిడ్ బాక్సులు లేవని, మంచినీళ్లకు, నీడకు ఏర్పాట్లు కూడా లేవని, వడదెబ్బ తగిలే ప్రమాదం ఉన్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వడదెబ్బకు జిల్లాలో ఇప్పటికే దాచేపల్లి చిలకలూరిపేట మండలాలలో ఇద్దరు చనిపోయారని ఆయన తెలిపారు.

ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరచడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న బడ్జెట్ కోతలు, ఎన్ ఎం ఎం యస్ యాప్ (నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం) పేరుతో విధిస్తున్న నిబంధనలను కూలీలు బేషరతుగా వ్యతిరేకిస్తున్నారని ఈ పర్యటనలో తమకు అర్థమైందని ఆయన తెలిపారు. మేట్ల వ్యవస్థ కొనసాగించాలని, ఉపాధి కూలీలు ఏరోజు చేసిన పనికి ఆ రోజే కొలతలు తీసి ఎంత వేతనం పడిందో నిర్ధారించి వేతనాలు చెల్లించే విధానం తీసుకురావాలని కూలీలు కోరుతున్నారని తెలిపారు.

ఒకపక్క వ్యవసాయం గిట్టుబాటు కాక, అన్ని వనరులు ఉన్నప్పటికీ మన జిల్లాలో రెండు లక్షల ఎకరాల దాకా ఈ ఖరీఫ్, రబీ సీజన్లో ఏ పైరు వేయకుండా ఉండిపోయాయని, అలాగే పల్నాడు జిల్లా ఏర్పడిన తర్వాత జిల్లా మొత్తాన్ని అర్బన్ ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకున్నదని, అనేక చోట్ల బంగారం లాంటి సారవంతమైన సాగు భూముల్ని అక్రమంగా వ్యవసాయ యేతర భూములుగా మార్చేసి, అవసరం

లేకపోయినా ఇళ్ల ప్లాట్లుగా మారుస్తున్నారని, అనుమతులు లేకుండా రియల్ ఎస్టేట్ వెంచర్స్ వేస్తున్నారని, దీనివల్ల మరో లక్ష ఎకరాల దాకా సాగు భూమి వ్యవసాయం నుంచి దూరం అవుతుందని, జిల్లాలో ఉన్న సాగుభూమి తొమ్మిది లక్షల ఎకరాలు కాగా అందులో మూడు లక్షల ఎకరాలు ఈ విధంగా ఏ పైరు వేయని భూములుగా మారిపోతే మిగిలేది కేవలం ఆరు లక్షల ఎకరాల సాగుభూమి మాత్రమేనని రోశయ్య తెలిపారు. ఇవన్నీ కూడా పరోక్షంగా వ్యవసాయ కూలీలకు ఉపాధిని దెబ్బతీస్తున్నాయని, అంతేకాక వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ పెరుగుతున్న నేపథ్యంలో ఉపాధి హామీ పథకం యొక్క ప్రాధాన్యత పెరిగిందని వారు తెలిపారు.

పల్నాడు జిల్లాలో సుమారు రెండున్నర లక్షల జాబ్ కార్డుల ద్వారా 5 లక్షల మంది వ్యవసాయ కూలీలు ఉపాధి హామీ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని, ఇది వలసలు నివారించడానికి ఎంతో తోడ్పడుతుందని లక్ష్మీశ్వర రెడ్డి తెలిపారు.అయితే గత సంవత్సరం 78 లక్షల పని దినాలు మన జిల్లాలో కల్పించగా, ఈ సంవత్సరం 45 లక్షల పని దినాలకు మాత్రమే నిధులు శాంక్షన్ అయ్యాయని, జిల్లాలోని అర్హులైన రెండున్నర లక్షల కుటుంబాలకు గత

సంవత్సరం సగటున 40 పని దినాలు కల్పించగా, ఈ సంవత్సరం 22 పని దినాలకు మాత్రమే సరిపోయే బడ్జెట్ కేటాయించారని ఆందోళన వ్యక్తం చేశారు. చట్ట ప్రకారం అర్హులందరికీ వందరోజుల పని హక్కు కల్పించాలంటే కనీసం రెండు కోట్ల పని దినాలకు సరిపోయిన వేజెస్ బడ్జెట్(మెటీరియల్ బడ్జెట్ మినహా) కనీసం మన జిల్లాకు 600 కోట్ల రూపాయలు కేటాయించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళితులు గిరిజనులలో 80% వ్యవసాయ

కార్మికులు ఉన్నారని, కానీ జనాభా నిష్పత్తి ప్రకారమే వారికి ఉపాధి కల్పిస్తున్నారని, వారికి రెట్టింపు పని దినాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వేతనాల పెండింగ్ లేదని అధికారులు చెబుతున్నారని, కానీ గ్రామాలలో గత ఐదారు వారాలుగా వేతనాలు పడలేదని అనేకమంది కూలీలు చెప్పారని, చాలాచోట్ల టెక్నికల్ కారణాలతో గత సంవత్సరం చేసిన పనికి కూడా డబ్బులు రాలేదని కూలీలు ఆరోపించారని వారు తెలిపారు. పే స్లిప్పులు ఇవ్వనందువల్ల రోజువారి వేతనం ఎంత పడుతున్నది కూడా కూలీలకు తెలియడం లేదని వారు విమర్శించారు. వందరోజుల పని హక్కు పూర్తి చేసుకున్న కుటుంబాలు కేవలం 3370 మాత్రమే గత సంవత్సరం ఉన్నాయని, ఈ సంవత్సరం ఆ సంఖ్య 26

కుటుంబాలకు మాత్రమే ఇప్పటి వరకు పూర్తయిందని వారు తెలిపారు. పేద రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉండే హార్టికల్చర్ శాఖ ద్వారా పండ్ల తోటలు పెంచుకోవడానికి తగినంత ప్రోత్సాహం ఇవ్వడం లేదని, బిల్లులు సకాలంలో చెల్లించడం లేదని, అలాగే రహదారుల వెంట మొక్కలు పెంపుదలకు మంచి పథకాలు ఉన్నప్పటికీ అమలు చేయడంలో అధికారులు విఫలం అవుతున్నారని వారు తెలిపారు.

గతంలో రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో టిసిఎస్ విధానంలో జాబ్ కార్డుల నమోదు సక్రమంగా జరిగిందని, కానీ ఇప్పుడు నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (NIC)కి అనుసంధానం చేయడం వల్ల అనేకమంది జాబ్ కార్డులు తొలగించబడ్డాయని, సుమారు జిల్లాలో 50వేల మంది ఆధార్ అదెంటిఫికేషన్ కాలేదని తదితర సాంకేతిక కారణాలతో 50వేల మంది జాబ్ కార్డులు కోల్పోయిన వారిని పనులకు రానివ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం పేరుతో పథకాన్ని నీరు కార్చాలనే కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ పథకాన్ని రక్షించుకోవడం కోసం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కూలీలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆయన తెలిపారు. ఈ పథకంలో పని దినాలు 200 కి, రోజువారి వేతనం 600 రూపాయలకు పెంచాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమ్మర్ అలవెన్సులు ఇవ్వాలని, మేట్ల వ్యవస్థ కొనసాగించాలని,

మేట్లు లేదా సైట్ సూపర్వైజర్లకు ఒక మనిషి చేత పని చేయించినందుకు రోజుకు పది రూపాయలు అలవెన్స్ ఇవ్వాలని, ఫస్ట్ ఎయిడ్ బాక్సులు, టెంట్లు ప్రతి ఒక్క చోట ఏర్పాటు చేయాలని, ఉపాధి కూలీలందరికీ ప్రమాద బీమా, జీవిత బీమా కల్పించాలని, తదితర డిమాండ్లపై మే 29వ తేదీ జరిగే కలెక్టరేట్ ధర్నా కార్యక్రమానికి ఉపాధి హామీ మేట్లు, కూలీలు సంతకాలతో కూడిన మహాజర్లు తీసుకొని పెద్ద సంఖ్యలో తరాలి రావాలని వారు విజ్ఞప్తి చేశారు.

Related posts

ట్రంప్ చెత్త పాలనను ఎండగట్టిన పెంటగాన్ మాజీ అధికారి

Satyam NEWS

ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో ర‌హ‌దారుల నిర్మాణంపై సమీక్ష‌

Satyam NEWS

సిఎం జగన్ వద్దకు చేరిన పిల్లి పంచాయితీ

Satyam NEWS

Leave a Comment