39.2 C
Hyderabad
April 25, 2024 16: 50 PM
Slider సంపాదకీయం

మధ్యతరగతిని నాశనం చేసేస్తున్న కరోనా లాక్ డౌన్

#MiddleClassFamily

ప్రధాని నరేంద్ర మోడీని ఇరకాటంలో పెట్టేందుకు ప్రతిపక్షాలు ఇప్పుడు తాజాగా వలస కార్మికుల సమస్యను పైకి తెస్తున్నాయి. లాక్ డౌన్ సమయంలో ఎంతో ఇబ్బంది పడుతున్న వర్గాలు వలస కార్మికులు. ఎక్కడో దూరాన రోజువారీ కూలిపనులు చేసుకుంటూ కుటుంబాలకు డబ్బులు పంపించే అలవాటు వలస కార్మికులకు ఉంటుంది.

మరి కొందరు కుటుంబాలతో సహా వలస వచ్చేసి ఉంటారు. తమది కాని భాషతో పరాయి చోట బతికే వారి గురించి చట్టాలు ఉన్నా కరోనా లాక్ డౌన్ కారణంగా ఈ సమస్య తీవ్రత తెలిసింది. అప్పటి వరకూ చాలా రాష్ట్రాలలో వలస కార్మికులు ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు.

వలస కూలీల పైనే అందరి ఫోకస్   

చౌకగా కూలీలు లభ్యం అవుతున్నారనే ఉద్దేశ్యంతో రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి కార్మికులను ఉపయోగించే కర్మాగారాల యజమానుల వరకూ వలస కూలీలనే ఎంచుకున్నారు. లాక్ డౌన్ కారణంగా వలస కూలీల సమస్య ప్రధానంగా ఫోకస్ లోకి వచ్చింది.

అంతే కాకుండా వలస కూలీల అంశం రాజకీయ అంశంగా కూడా మార్చుకున్నారు. వలస కూలీలను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలు రాజకీయాలకు దిగుతున్నాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించేందుకు వలస కూలీల అంశం ప్రతిపక్షాలకు బాగా పనికి వచ్చింది.

ప్రభుత్వం పట్టించుకోని మధ్యతరగతి

దేశంలో వలస కూలీల సమస్యతో బాటు మధ్య తరగతి, పరిమిత ఆదాయం ఉన్న వారి సమస్య మరింత తీవ్రంగా ఉంది. ఎలాంటి ప్రభుత్వ సహాయాలు అందని మధ్య తరగతి ప్రజలకు కనీసం రేషన్ కార్డు కూడా లేకపోవడంతో చాలా మంది ఈ లాక్ డౌన్ సమయంలో రేషన్ బియ్యానికి గానీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న సాయానికి కానీ నోచుకోలేకపోతున్నాయి.

ప్రయివేటు ఉద్యోగాలపైనా, చిరు ఆదాయంతో బతికే మధ్య తరగతి, అల్పాదాయ వర్గాలు లాక్ డౌన్ కారణంగా దారుణమైన ఆకలి చావులు చచ్చే పరిస్థితులలో ఉన్నాయి. ఈ దేశంలో మధ్య తరగతి వాడిని ఆదుకోవడానికి ఏ పథకం ఉండదు. మధ్య తరగతి ప్రజలు ఏ రాజకీయ పార్టీకి ఓటు బ్యాంకులు కాదు.

ఈ నెల జీతం కూడా అందని బతుకులు

వివిధ కులాలు, మతాల వారు మధ్య తరగతిలో ఉంటారు. అందువల్ల వీరి ఓట్లు మూకుమ్మడిగా పడే అవకాశం లేదు. అందుకే లాక్ డౌన్ సమయంలో కూడా ఏ రాజకీయ పార్టీ మధ్య తరగతి వారి గురించి మాట్లాడదు. లాక్ డౌన్ సమయంలో మధ్య తరగతి వారికి గత నెల వరకూ జీతం వచ్చింది.

ఈ నెల జీతం వచ్చే అవకాశం లేదు. జీతం సంగతి పక్కన పెడితే అసలు ఉద్యోగం కొనసాగుతుందో లేదో తెలియదు. జీవించేందుకు  వీలు కాని పరిస్థితి ఉంది. ఏ ప్రభుత్వం మధ్య తరగతి వారిని ఆదుకోవడం లేదు. మధ్య తరగతి ప్రజల గురించి ఆలోచించడం లేదు.

మధ్యతరగతికి ఆకలి చావులే శరణ్యమా?

లాక్ డౌన్ మరింత పొడిగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇదే జరిగితే మధ్య తరగతి ప్రజలు ఆకలి చావులకు గురవుతారు. సంపాదన లేక, దాచుకున్నది అయిపోయిన  ఈ పరిస్థితుల్లో లాక్ డౌన్ రిలాక్సేషన్ ల గురించి అనునిత్యం అందరూ మాట్లాడుతుంటారు.

కానీ సంపాదన లేని ఈ పరిస్థితుల్లో దుకాణాలు తెరిచినా మధ్యతరగతి ప్రజలకు ఉపయోగం లేదు. కొనుక్కోవడానికి డబ్బులు ఉంటే కదా దుకాణాలు తెరిస్తే ఉపయోగం? లాక్ డౌన్ కాలంలో పేదలు ఏదోక విధంగా బతుకుతున్నారు. ప్రభుత్వం, సామాజిక సేవా సంఘాలు ఏదో కొంత అయినా సాయం చేస్తున్నాయి.

కరోనా వెళ్లే సరికి మధ్యతరగతి మఠాష్

మధ్య తరగతి వారు మాత్రం ప్రభుత్వం నుంచి సాయం అందక, సామాజిక సేవా సంఘాల నుంచి తీసుకోలేక, సంపాదన మార్గం లేక సతమతం అవుతున్నాయి. కరోనా లాక్ డౌన్ పోయే నాటికి దేశంలో పేదలు ధనికులు తప్ప మధ్య తరగతి అనేది తుడిచిపెట్టుకుని పోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు మధ్య తరగతిలో ఉన్నవారంతా…. అప్పటికి జీవించి ఉంటే….. పేదలుగా మారిపోతారు.

Related posts

యువకుడి దారుణ హత్య

Bhavani

వనపర్తిలో వైన్ షాపు తరలింపునకు అధికారుల హామీ

Satyam NEWS

ఈనెల 20న నాగర్ కర్నూల్ కు ప్రియాంక రాక

Bhavani

Leave a Comment