37.2 C
Hyderabad
April 19, 2024 12: 54 PM
Slider సంపాదకీయం

మైండ్ గేమ్ టు ఎండ్ గేమ్ వయా బ్లైండ్ గేమ్

#SomuVerraju

సాధారణంగా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలపై నడిచే పార్టీగా చెబుతుంటారు. వ్యక్తులపైనా, వ్యక్తుల అభీష్టంపైనా ఆధారపడి ఆ పార్టీ నడవదని అంటుంటారు. అయితే అదేమిటో గానీ ఆంధ్రప్రదేశ్ బిజెపి మాత్రం వ్యక్తులపైనే నడుస్తున్నది.

వ్యక్తిగత ఇష్టాలమేరకు పార్టీ నడుస్తుంటే బిజెపి అగ్ర నాయకులు ఏం చేస్తున్నారో అర్ధం కావడం లేదు. ఆంధ్రప్రదేశ్ బిజెపి కి ఇటీవల సారధి మారాడు. కన్నా లక్ష్మీనారాయణను అధ్యక్ష పదవి నుంచి తప్పించి సోము వీర్రాజును ఆ పదవిలో నియమించారు.

కన్నా లక్ష్మీనారాయణ పార్టీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు అమరావతికి పూర్తిగా అనుకూలంగా ఆంధ్రప్రదేశ్ బిజెపి ఉండేది. కన్నా లక్ష్మీనారాయణ పదవి పోగానే కొత్త వచ్చిన సోము వీర్రాజు అమరావతికి పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు.

ఓవర్ నైట్ మారిపోయిన స్టాండ్

సోము వీర్రాజు పదవిలోకి వచ్చీరాగానే మూడు రాజధానుల బిల్లులపై గవర్నర్ సంతాకాలు చేయడం, కోర్టు కేసుల్లో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేస్తూ రాజధాని అంశంతో తమకు సంబంధం లేదని చెప్పడం చకచకా జరిగిపోయాయి. ఈ రెండు పరిణామాలతో సోము వీర్రాజుకు సంబంధం ఉందో లేదో తెలియదు కానీ ఆయన రాగానే ఇలా జరగడంతో బిజెపి తన స్టాండ్ ను ఓవర్ నైట్ మార్చేసుకున్నట్లుగా కనిపించింది.

బిజెపి స్టాండ్ మార్చుకున్న అంశం అమరావతి తో బాటు చంద్రబాబునాయుడి అంశం మరొకటి. కన్నా లక్ష్మీనారాయణ ఏపి బిజెపి అధ్యక్షుడుగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దునుమాడేవారు. కన్నా లక్ష్మీనారాయణ వైసీపీని విమర్శించినప్పుడల్లా ఆయన చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడినట్లు అనిపించేది చాలా మందికి.

చంద్రబాబు ముద్రతో కన్నా

చివరకు వైసీపీ కీలక నేత విజయసాయి రెడ్డి అయితే చంద్రబాబునాయుడి నుంచి కన్నా లక్ష్మీనారాయణ 20 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకుని ఆయనకు అనుకూలంగా మాట్లాడుతున్నారని కూడా ఆరోపించారు. కన్నా లక్ష్మీనారాయణ రాజకీయ జీవితంలో ఏ నాడూ చంద్రబాబునాయుడితో కలిసి పని చేయలేదు.

పైగా చంద్రబాబునాయుడు అంటే కన్నా లక్ష్మీనారాయణకు పూర్తిగా వ్యతిరేక భావనలు ఉండేవి. అయితే కన్నా లక్ష్మీనారాయణను మాత్రం చంద్రబాబు గాటన కట్టేసి వైసీపీ మైండ్ గేమ్ ఆడింది. వైసీపీ ఆడిన మైండ్ గేమ్ లో బిజెపి పావుగా మారింది.

తెలుగుదేశం, బిజెపి కలిసి పోటీ చేసినప్పుడు, అధికారం పంచుకున్నప్పుడు కూడా సోము వీర్రాజు ఎప్పుడూ చంద్రబాబునాయుడిని వ్యతిరేకించే వారు. ఆయన అధ్యక్షుడు కావడంతో ఇక అడ్డు లేకుండా పోయింది. ఆయన వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కన్నా ఎక్కువగా చంద్రబాబునాయుడిని విమర్శించడం మొదలు పెట్టారు.

జీవీఎల్ మాటే సోము వీర్రాజు బాట

దాంతో బిజెపి వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా కనిపిస్తున్నది. అనతి కాలంలో ఈ విధంగా బిజెపి ఆలోచన వ్యక్తులతో పాటు దిశను మార్చుకోవడం స్పష్టంగా కనిపిస్తున్నది. కన్నా లక్ష్మీనారాయణ సమయంలో ఆ పార్టీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మాటకు, కన్నా మాటకు తేడా ఉండేది.

ప్రస్తుతం జీవీఎల్ మాట్లాడిందే సోము వీర్రాజు మాట్లాడుతున్నారు. సాధారణంగా అధికారంలో ఉన్న వారిపై పోరాడితే నిరాశలో ఉన్న ప్రజలకు చేరువ కావచ్చు.

ఇది దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలూ అనుసరించిన వ్యూహం. అయితే ఆంధ్రప్రదేశ్ లో బిజెపి మాత్రం ప్రతిపక్షంతో పోరాడుతూ బలపడాలని ప్రయత్నిస్తున్నది. చాలా కాలంగా రాజకీయాలలో ఉన్నవారికి, రాజకీయ పరిశీలకులకు ఇది ఆశ్చర్యం కలిగించే విషయం.

అధికారం దిశగా కదులుతున్న బిజెపి

బిజెపి ప్రస్తుతం అనుసరిస్తున్న ఈ కొత్త వ్యూహం ఫలించేసి 2024 కల్లా అధికారంలోకి వచ్చేస్తుందేమో తెలియదు. అయితే అధికార పార్టీకి అనుకూలంగా ఉంటూ ప్రతిపక్షంతో పోరాటం చేసే వ్యూహం ఫలిస్తే దీన్ని కొత్త రాజకీయ సిద్ధాంతంగా పుస్తకాలలో రాసుకోవాల్సి ఉంటుంది.

వైసీపీని విమర్శిస్తే చంద్రబాబు బలపడతాడు అనే ఒక సూత్రాన్ని తెరపైకి తీసుకువచ్చి బిజెపి నాయకులు ఈ కొత్త సిద్ధాంతాన్ని బలంగా ప్రచారం చేస్తున్నారు. అధికారంలో ఉన్న వైసీపీకి అనుకూలంగా మాట్లాడితే బిజెపి బలపడుతుందో లేదో తెలియదు కానీ బిజెపి నాయకులకు మాత్రం విశేషంగా ప్రయోజనాలు చేకూరతాయి.

సోషల్ మీడియా తదితర కేసులు కూడా నమోదు అయ్యే అవకాశం ఉండదు. తెలుగుదేశం పార్టీ నాయకులు రకరకాల కేసులలో ఇరుక్కుని, బయటకు రాలేక ఇబ్బంది పడుతుంటే ఆ రాజకీయ శూన్యత నుంచి కమలం బలమైన శక్తిగా ఉద్భవించవచ్చు కూడా ( ఆ పార్టీ నాయకులు అనుకుంటున్నట్లు).

శత్రువుకు శత్రువు మిత్రుడు అనే సిద్ధాంతాన్ని మార్చి శత్రువుకు శత్రువు శత్రువే అనే కొత్త సిద్ధాంతాన్ని ఆంధ్రప్రదేశ్ బిజెపి ట్రై చేస్తున్నది. 2024 లో బిజెపి అధికారంలోకి వచ్చి సోము వీర్రాజు ముఖ్యమంత్రి అయితే బిజెపి కొత్త సిద్ధాంతాన్ని ముందే చెప్పినట్లు పుస్తకాలలో పాఠ్యాంశంగా పెట్టవచ్చు. రాజనీతి శాస్త్రాన్ని మార్చి రాయవచ్చు.

సత్యమూర్తి పులిపాక, చీఫ్ ఎడిటర్, సత్యంన్యూస్.నెట్   

Related posts

బెంగాల్ మంత్రి సుబ్రతా ముఖర్జీ అనారోగ్యంతో కన్నుమూత

Sub Editor

కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇవ్వాలి

Satyam NEWS

నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు తప్పవు

Satyam NEWS

Leave a Comment