పెద్దపల్లి జిల్లాలో పాఠశాల విద్యార్థుల భవిష్యత్ లో వెలుగులు నింపేలా కేసీఆర్ విజ్ఞాన కేంద్రం పేరుతో ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్ నేతృత్వంలో దీనికి సంబంధించిన లోగోను హైదరాబాద్ లో రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించి, ఇలాంటి ఒక మంచి కార్యక్రమానికి రఘువీర్ సింగ్ తీసుకున్న చొరవని అభినందించారు. పాఠశాల పిల్లల్లో జ్ఞానం పెంపొందించే దిశగా కేసీఆర్ విజ్ఞాన కేంద్రం పేరుతో పెద్దపల్లి జిల్లాలోని అన్ని గురుకులాల్లో, ప్రభుత్వ స్కూళ్లలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లాలోని గురుకులాలల్లో మినీ గ్రంథాలయాలను ఏర్పాటు చేయనున్నారు. దీంతో పాఠశాలలకే గ్రంథాలయాలను తీసుకురావటం వల్ల ఎంతో మంది చిన్నారులకు ఇది వరంగా మారనుంది. పాఠశాల పిల్లల్లో జ్ఞానం పెంపొందించే దిశగా ఈ గ్రంథాలయాలు ఏర్పాటు కానున్నాయి. ఇలాంటి మినీ గ్రంథాలయాలు విడతల వారీగా జిల్లాలోని మిగతా అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు, కస్తూర్బా గాంధీ విద్యాలయాలకు, మోడల్ స్కూళ్లకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి దయాకర్ రావు, చీఫ్ విప్ వినయ్ భాస్కర్, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు పాల్గొన్నారు.