ఏపి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన వియ్యంకుడికి అమరావతిలో చౌకగా భూములు కట్టబెట్టారంటూ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన ఆరోపణల్ని టిడిపి నాయకుడు, బాలకృష్ణ చిన్న అల్లుడు, గీతం విద్యా సంస్థల అధ్యక్షుడు ఎ.భరత్ తీవ్రంగా ఖండించారు. తమ సంస్థకు కిరణ్‌కుమార్ రెడ్డి మంత్రివర్గంలో బొత్స మంత్రిగా ఉండగానే భూములు కేటాయించారని ఆయన స్పష్టంచేశారు. న్యాయపరమైన వివాదం నేపథ్యంలో ఆ భూముల్ని ఇంతవరకు తమకివ్వలేదని ఆయన అన్నారు. అప్పట్లో ప్రభుత్వం తమకు కేటాయించిన భూములు అమరావతి, విజయవాడ నుంచి సుమారు 100కి.మీల దూరంలో ఉన్నాయన్నారు. రాష్ట్ర విభజనకు ముందే ఈ భూముల కేటాయింపు జరిగిందని, అప్పట్లోనే ఎంఓయూపై సంతకాలు చేసినట్టు తెలిపారు. తన పెళ్లికి ఆరేళ్ల ముందే తాము ఆ ప్రాజెక్టు గురించి ఆలోచించామన్నారు. ఈ వ్యవహారంలో టిడిపికి పాత్ర ఉందనేది పూర్తిగా అవాస్తవమని స్పష్టంచేశారు. అమరావతిని తప్పుదారి పట్టించేందుకు, చంద్రబాబుపై బురదజల్లుదామనే ఉద్దేశంతోనే ఇలాంటి ఆరోపణలన్నీ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. క్విడ్ ప్రోకో, ఇన్‌సైడర్ ట్రేడింగ్ వంటి పదాలు వాడినప్పుడు దాని వెనుక ఏదో ఒక ఆధారం ఉండాలని భరత్ అన్నారు.
(భరత్ ప్రకటనపై పూర్తి వివరాలు సత్యం న్యూస్ సేకరించింది. వాటిని రేపు ఉదయం మీ ముందు ఉంచుతాం)