రుణమాఫీ విషయంలో ప్రజల ఒత్తిడికి తలొగ్గే ఆరోగ్య శాఖ మంత్రి దామోద రాజనరసింహ వాస్తవాలు అంగీకరించారని మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు. రుణమాఫీ అందరికి జరగలేదని కొన్ని నెలలుగా మా పార్టీ నాయకులు కేటీఆర్, హరీష్ రావు గారు తో పాటు మేమేందరం కూడా చెబుతున్నా వస్తున్నాం. ప్రజలు సైతం గగ్గోలు పెడుతున్నారు. కానీ ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ మాపై ప్రతిదాడికి పూనుకుని అందరిని దబాయిస్తూ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి తో పాటు అందరూ మంత్రులు అబద్దలతో ప్రజలను నమ్మించారని అన్నారు.
అయితే గత సంవత్సర కాలంగా అందరం చెబుతున్నట్టే మంత్రిగారు వాస్తవాన్ని ఇప్పటికైనా అంగీకరించారు కాబట్టి అబద్దాలతో ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్న వారికి బుద్ధి చెప్పాలంటే మంత్రి దామోదర్ రాజనర్సింహ రాజీనామా చేసి ప్రజల్లోకి రావాలని ఆయన డిమాండ్ చేశారు. నియోజకవర్గ సీనియర్ నాయకులతో కలిసి ఆందోల్ లో ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ…. ఆరు గ్యారంటీలు అమలు అవుతాయేమోనని రుణమాఫీ ఎన్నికల అనంతరం అయినా పూర్తి అవుతుందేమో అని నమ్మి మీ పార్లమెంట్ సభ్యుడికి కూడా ప్రజలు ఓటేశారు. అయినా కూడా మీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను వంచించింది.
మీ మాట విని మీ పార్టీ కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ఓటర్ల కాల్లుకడుపులు మొక్కి మీకు ఓట్లెయించారు. వారి మాటలు నమ్మి మీకు ఓట్లు గుద్దిన్రు కానీ ఒక్క స్కీం కూడా ఆచరణలోకి రాకపోవడంతో మీ కార్యకర్తల పరిస్తితి కూడా అడకత్తెరలో పోకచెక్కలా మారింది. అందుకే మీరు వాస్తవాలు మాట్లాడుతున్నారు కనుక ప్రజలకు ఇచ్చిన హామీలు సరిగా అమలుకావాలంటే మీ లాంటి పెద్దలు ప్రజలతరపున మాట్లాడటానికి ఈ అబద్ధాల ప్రభుత్వం లోంచి బయటకు రావాలని ఆయన కోరారు.
గత కొన్ని రోజులుగా ఆందోల్ నియోజకవర్గంలో జరుగుతున్న గ్రామసభలు అన్నీ కూడా ప్రజలతో సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ సభలుగానే జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. లబ్ధిదారుల లిస్టు అంటూ తెల్ల కాగితం తీసుకొచ్చి వినిపించి గ్రామ సభలో ఫైనల్ చేస్తున్నామంటూ చాలా గ్రామాల్లో నిజమైన లబ్ధిదారులకు అన్యాయం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఎవరైతే ఇప్పటివరకు లబ్ధి పొందలేక అర్హులై ఉన్నారో వారికి మాత్రమే పథకాలు అందే విధంగా అధికారులు ప్రయత్నం చేయకపోతే తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుందని ఆయన హెచ్చరించారు.
ప్రజల ఆకాంక్ష లు ఆవేదనను అర్థం చేసుకోకుండా పేద ప్రజలకు ద్రోహం చేయడంలో భాగస్వాములైతే అధికారులను కూడా ఎక్కడికక్కడ నిలదీస్తామని హెచ్చరించారు. అట్లాగే గ్రామసభల్లో ఎక్కడ కూడా ప్రోటోకాల్ పాటించకుండా కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులను గ్రామాల్లో, మండల కేంద్రాల్లో మండల పార్టీ అధ్యక్షులను సభకు అధ్యక్షులుగా కూర్చోబెట్టి ఈ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగానే నడిపిస్తున్నట్టు కనిపిస్తుందని ఆయన విమర్శించారు.
నిజాయితీగా నిష్పక్షపాతంగా పాలన అందిస్తామని రాజ్యాంగాన్ని చేతబట్టి తిరిగిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఎటువంటి హోదా లేకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకే పెద్ద పీట వేసి కూర్చోబెట్టి వారితోనే లబ్ధిదారుల లిస్టు ఎలా తయారు చేస్తారని ఆయన ప్రశ్నించారు. లబ్ధిదారుల లిస్ట్ ప్రతి గ్రామ పంచాయితీ లో అతికించి ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని నిజాయితీగా లబ్ధిదారుల ఎంపిక జరగాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ సమావేశం లో డి సి సి బి మాజీ చైర్మన్ జైపాల్ రెడ్డి, మాజీ ఎం పి పి రామాగౌడ్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నాగభూషణం ఆందోల్, మునిపల్లి మండల పార్టీ అధ్యక్షులు లక్షికాంత్ రెడ్డి, విజయ్ కుమార్, చాపల వెంకన్న, మండల యుత్ అధ్యక్షుడు అనిల్ రెడ్డి, సీనియర్ నాయకులు మాణిక్ రెడ్డి, వీరేశం షెట్, మొగులయ్య, సత్యం, మహేష్, అశోక్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.