38.2 C
Hyderabad
April 25, 2024 13: 57 PM
Slider మెదక్

బీజేపీది ఉత్తరానికో నీతి… దక్షిణానికో నీతి

#ministerharishrao

కేంద్ర బీజేపీ ప్రభుత్వానిది ఉత్తర భారత దేశానికి ఒకనీతి. దక్షిణ భారత దేశానికి ఒకనీతిగా వ్యవహరిస్తున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు బీజేపీ తీరుపై ధ్వజమెత్తారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కోసం ఉత్తర భారత దేశంలో ధరలు పెంచలేదని, దక్షిణ భారతదేశ ప్రాంతంలో కాంప్లెక్స్ ఎరువులు, యూరియా, డీఏపీ, పొటాషియం ఎక్కువగా వాడతారని ధరలు పెంచి పక్షపాత వైఖరి కనబరుస్తున్నదని బీజేపీ తీరుపై మంత్రి హరీశ్ దుయ్యబట్టారు.

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో రూ.1 కోటి 71 లక్షల తో నిర్మించిన డివిజినల్ ఇంజనీర్ కార్యాలయ భవనం, విద్యుత్ రెవెన్యూ కార్యాలయంను ఎమ్మెల్యే ఒడితెల సతీశ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో రైతులకు ఏమైనా మేలు చేస్తుందోనని ఎదురు చూస్తే.. కేంద్రం వైఖరి రైతుల పై భారం వేయడం తప్ప, రైతులకు మేలు చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు.

విద్యుత్తు చట్టంలో సవరణలు చేయాలని.. సంస్కరణలు బాయిలకాడ విద్యుత్ మీటర్లు పెట్టాలని, విద్యుత్ పంపిణీ వ్యవస్థను ప్రయివేటు పరం చేయాలన్నదే కేంద్ర ప్రభుత్వ విధానమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతీ సంవత్సరం రాష్ట్ర జీఎస్ డీపీలో 4 శాతం అప్పు రూపేణా తీసుకునే అనుమతి, అవకాశం ఉండేదని, కానీ ఈ సారి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 3.5 శాతం రాష్టాలకు నేరుగా ఇస్తామని, మరో ఒక అర శాతానికి విద్యుత్ సంస్కరణలు తేవాలని నిబంధనలు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఎవరికీ ఏమీ ఇచ్చింది లేదని, ఇచ్చే దాంట్లోనే కోతలు పెడుతున్నది. ఎందుకు ఈ నిబంధనలంటూ.. మా రాష్ట్ర ప్రభుత్వ విధానంలో మా రాష్ట్ర ప్రజలకు 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు బాయిలకాడ, బోర్లకాడ ఇస్తున్నట్లు, గత ఏడేండ్లుగా అందిస్తున్నట్లు, ఇందుకోసం యేటా 12 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్నదని., కానీ కేంద్ర బీజేపీ విద్యుత్తు సంస్కరణలు తేవాలని రాష్ట్రాల మెడలపై కత్తి పెడుతున్నదని, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచుతున్నదని మంత్రి అన్నారు.

ఎఫ్ సీఐకి సైతం కోత పెట్టినట్లు, రైతులు పండించిన ధాన్యం సేకరించే FCI సబ్సిడీలో దాదాపు 40 వేల కోట్ల రూపాయలు కోత పెట్టినట్లు FCI నిధుల కోత అంటే రాబోయే రోజుల్లో రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనడంలో కూడా కోతే పెడతారని, కేంద్రం ధాన్యం కొనుగోలు చేయనని చెప్పకనే కేంద్రం చెబుతున్నదని కేంద్ర బీజేపీపై మండిపడ్డారు.  

రైతులకు ఇచ్చే అన్నీ సబ్సిడీలు తగ్గించి రైతులకు భద్రత లేకుండా చేసిందని కేంద్ర బీజేపీ తీరుపై మండిపడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలు పెంచినట్లు వాపోయారు. ఉత్తర భారత దేశంలో యూరియా, డీఏపీ ఎక్కువ వాడకం, దక్షిణ భారతదేశంలో కాంప్లెక్స్ ఎరువుల వాడకం ఎక్కువగా ఉంటుందని.., ఉత్తర దేశంలో యూరియా, డీఏపీ ధరలు పెంపు జోలికి పోకుండా, దక్షిణ భారతదేశంలో కాంప్లెక్స్ ఎరువులకు ధరలు పెంపు చేశారని, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల్లో లబ్ధి పొందేలా.. ఉత్తర దేశానికి ఒకనీతి, దక్షిణ దేశానికి ఒకనీతి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ తీరుపై మంత్రి హరీశ్ విమర్శించారు.

ఉత్తరప్రదేశ్ ఎన్నికలు పూర్తికాగానే డీజీల్, పెట్రోల్ ధరలు పెంపు చేస్తారని.. కేంద్ర బీజేపీ దేశ ప్రజలకు ఏమీ ఇవ్వదు. సబ్సిడీలల్లో కోత, ధరల్లో పెంపు.. ఇలా వివక్ష తప్ప మరేమీ లేదు. తెలంగాణ, దక్షిణ భారతదేశంపై కేంద్ర బీజేపీ వివక్ష చూపుతున్నదని, పక్క కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు జాతీయ ప్రాజెక్టులు ఇచ్చినట్లు.. తెలంగాణకు మొండిచేయి చూపిస్తున్నదని మంత్రి అన్నారు.

Related posts

గుడ్ వర్క్: నేతన్నలకు వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ చేయూత

Satyam NEWS

మనిషికి రెండు వైపులా

Satyam NEWS

కృష్ణ మృతిపట్ల కే‌సి‌ఆర్ సంతాపం

Murali Krishna

Leave a Comment