ఈ ప్రజా ప్రతినిధులు కోవిడ్ 19 కు అతీతులు. వీరికి కరోనా వైరస్ ఎట్టి పరిస్థితుల్లో సోకదని భరోసా. ఎందుకంటే వారు మంత్రులు, ఎమ్మెల్యేలు కదా అందుకు. ఐదుగురి కన్నా ఎక్కువ గుమి కూడవద్దని అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకోవాలని నిన్న రాత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
అయితే ఈ ఆదేశాలు సామన్య ప్రజలకు కదా మనకు కాదు అనుకున్నారు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, కొల్లాపూర్ ఎంఎల్ఏ బీరం హర్షవర్ధన్ రెడ్డి. యథేచ్ఛగా వారు తిరిగేస్తున్నారు. కనీసం వారి మూతులకు కవర్ గానీ, మాస్క్ గానీ లేవు.
తమ చుట్టూ ఉన్న వారి మొహాలకు కూడా ఎలాంటి కవర్ లేదు. పానుగల్ మండలం కిష్టాపూర్ గ్రామ శివారులో రామన్న గట్టు వద్ద రిజర్వాయర్ ఏర్పాటు కోసం భూములను వారు పరిశీలించారు. పది మందికి చెప్పాల్సిన మంత్రి, ఎమ్మెల్యేనే ఇలా చేస్తే ఇక కరోనా వ్యాప్తిని అరికట్టేదెవరు?

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన నిబంధనలను, ప్రధాని నరేంద్ర మోడీ చేసిన సూచనలను, ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన విధానాలను వేటినీ వీరు పాటించడం లేదు. ఎలాంటి జాగ్రత్తలూ పాటించాల్సిన అవసరం మంత్రికి, ఎమ్మెల్యేకి లేదా? పోనీ వారు వారి గన్ మెన్ లతో తిరిగితే ఏదోలే అనుకోవచ్చు. మందిని మొబిలైజ్ చేసుకుని మరీ ఇలాంటి పర్యటనలు చేస్తుంటే కరోనా గురించి ఎవరికి అవగాహన కలుగుతుంది? మాకు రాదులే అని ఎవరికి వారు అనుకోవడం పెద్ద ప్రమాదమని ప్రధాని నరేంద్రమోడీ నిన్న చేసిన ప్రసంగాన్ని ఈ మంత్రి ఎమ్మెల్యే విన్నట్లు లేరు.