40.2 C
Hyderabad
April 19, 2024 16: 54 PM
Slider తెలంగాణ

యాసంగి ధాన్యం కొనుగోళ్లకు విస్తృత స్థాయి ఏర్పాట్లు

paddy procruerment

వచ్చే నెల 1వ తేదీ నుండి ప్రారంభమయ్యే యాసంగి (రబీ) సీజన్ కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా పకడ్బందీగా ఏర్పట్లు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం అధికారులను ఆదేశించింది. 2019-20 యాసంగి కార్యాచరణపై సోమవారం నాడు హాకా భవన్‌లో మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల్ రాజేందర్, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి సమీక్షించారు.

ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ కార్యదర్శి మరియు కమిషనర్ పి. సత్యనారాయణ రెడ్డి, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామరెడ్డి, విత్తనాభివృద్ధి సంస్థ డైరెక్టర్ కేశవులు, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయ్, మార్క్ ఫెడ్ ఎండి భాస్కరాచారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోళ్ల కేంద్రాల ఏర్పాటు, గన్నీ సంచులు, స్టోరేజ్ స్పేస్, రవాణా తదితర అంశాలపై ప్రధానంగా దృష్టి సారించాలని సూచించారు. సిఎం కేసీఆర్ చేపట్టిన రైతు సంక్షేమ చర్యలు, ముఖ్యంగా కాళేశ్వరం నీటి రాకతో ప్రతి ఎకరా సాగులోకి వస్తుండడంతో సాగు విస్తీర్ణం పెరుగుతోందని ఈ సందర్భంగా మంత్రులు పేర్కొన్నారు.

వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం ఈ రబీలో 77.73 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేశారు. పెరిగిన అంచనాలకు అనుగుణంగా కొనుగోళ్లకు పకడ్బందీగా ఏర్పట్లు చేయాలని ఆయా విభాగాల అధికారులను ఆదేశించారు. గత ఏడాది రబీలో పౌరసరఫరాల శాఖ 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, ఈ ఏడాది రబీలో దాదాపు రెండింతల కంటే అదనంగా కొనుగోలు ఉంటాయని అంచనా వేశారు.

ధాన్యం నాణ్యతపై గత ఖరీఫ్ లో చాలా ఫిర్యాదులు వచ్చాయని, రైతులు యంత్రాల కటింగ్ తో నేరుగా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావడంతో నాణ్యత సమస్యలు ఎదురవుతున్నాయని అధికారులు మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు.

ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రతి కొనుగోలు కేంద్రంలో తప్పనిసరిగా తేమ కొలిచే యంత్రాలు, ప్యాడీ క్లీనర్స్, విన్నోవింగ్ మెషీన్లు, టార్పాలిన్లు ఏర్పాట్లు చేయాలని మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి పౌరసరఫరాల సంస్థ చెల్లిస్తున్న మార్కెట్ ఫీజు నుండి ఇందుకు అవసరమైన నిధులు సమకూర్చుకోవాలని సూచించారు.

ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు ముఖ్యంగా పౌరసరఫరాలు, వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఇతర రాష్ట్రాల నుండి రాష్ట్రంలోకి దళారులు ధాన్యం తీసుకువచ్చి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించకుండా పకడ్బంది చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా రాష్ట్ర సరిహద్దుల్లో ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

Related posts

When you might be writing your paper, it will be for most instances an honest technique to invest in some outdoor perspective

Bhavani

ఫైర్ ఎగెన్: మళ్లీ కదిలిన కాపు రిజర్వేషన్ అంశం

Satyam NEWS

బీఆర్ఎస్ అంటే భ్రష్టాచార్ రాక్షస సమితి…!

Satyam NEWS

Leave a Comment