మహారాష్ట్రలో ముఖ్యమంత్రి శివసేన నుంచి ఉన్నా హోం, ఆర్ధికం, రెవెన్యూ, అర్బన్ డెవలప్ మెంట్, సహకారం లాంటి పెద్ద శాఖలు ఎన్ సి పి, కాంగ్రెస్ చెరి సగం పంచుకుంటాయి. శివసేన, ఎన్ సి పి, కాంగ్రెస్ పార్టీలు సమానంగా మంత్రి పదవులు పంచుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించగా రెండు మంత్రి పదవులు శివసేనకు వచ్చే విధంగా తుది ఒప్పందం కుదిరింది. గత మూడువారాలుగా నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభనకు తెరదించుతూ శివసేన, కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహా రాజకీయాల్లో వివాదానికి కారణమైన సీఎం పదవిని శివసేనకు అప్పగించేందుకు మిగిలిన రెండు పార్టీలు సుముఖత వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో కాంగ్రెస్‌కు స్పీకర్ పదవి, ఎన్సీపీకి మండలి చైర్మన్ పదవి దక్కేలా ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో శివసేన ముఖ్యనేత, ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ‘రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం. కరువు నివారణకై చర్యలు తీసుకోవడం, మౌలిక సదుపాయాల కల్పన, వరదల కారణంగా ఏర్పడ్డ ఇబ్బందులను తొలగించేందుకు రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు అత్యవసరం. మాతో కలిసి పనిచేసేందుకు ముందుకు వచ్చిన వారు పాలనలో ఎంతో అనుభవం కలిగినవారు. వారి సహకారంతో మేం ముందుకు సాగుతాం’ అని స్పష్టం చేశారు. ఈ ఐదేళ్లే కాదు ఏకంగా 25 ఏళ్లు మహారాష్ట్ర సీఎం పీఠంపై శివసేన నాయకులే కూర్చుంటారని వ్యాఖ్యానించారు. తమ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రేకు సొంతంగా నిర్ణయాలు తీసుకోగల సత్తా ఉందని… తమను ఆపే శక్తి ఎవరికీ లేదని పేర్కొన్నారు.
previous post