గుంటూరు నగరంలోని పట్టాభిపురం సీఐగా ఆదివారం రాత్రి బాధ్యతలు తీసుకున్న మధుసూదన్‌రావును 48 గంటల్లోనే ఉన్నతాధికారులు వీఆర్‌కు పంపించారు. ఇది పోలీసు, రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆయనకు కీలకమైన పట్టాభిపురం పోస్టింగ్ ఇవ్వటంపై ఉన్నతస్థాయిలో దుమారం రేగినట్లు తెలిసింది. వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత రావటంతో ఉన్నతాధికారులు వెంటనే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. స్టేషన్ విధులకు హాజరుకావొద్దని మంగళవారం ఉదయాన్నే ఆయనకు సమాచారమిచ్చారు.
ఆయనకు పట్టాభిపురం సీఐగా పోస్టింగ్ ఇవ్వాలంటూ ఆదివారం ఓ ప్రజాప్రతినిధి సిఫార్సు లేఖ ఇవ్వగానే అదే రోజు రాత్రి డ్యూటీ ఆర్డర్ (డీవో) జారీ చేయటం చర్చనీయాంశమైంది. డీవో అందిన మరుక్షణమే ఆగమేఘాలమీద వెళ్లి ఆ రాత్రికే ఛార్జి తీసుకున్నారు. ఎందుకంత హడావుడిగా విధుల్లో చేరారని పోలీసువర్గాల్లో పెద్ద చర్చ నడిచింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ స్టేషన్ సీఐలుగా ఇప్పటి వరకు ముగ్గురు మారారు. తొలుత కిరణ్ సీఐ బాధ్యతలు స్వీకరించిన నెల రోజులకే వివాదాల్లో చిక్కుకుని పోస్టింగ్ పోగొట్టుకోగా తర్వాత వచ్చిన వీరేంద్ర ఏడు మాసాలకే బదిలీ అయ్యారు. తాజాగా వచ్చిన మధుసూదన్ కేవలం 48 గంటల్లోనే వీఆర్‌కు వెళ్లటం ప్రాధాన్యం సంతరించుకుంది.
నగరంలో ఉన్న స్టేషన్లలో అత్యంత కీలకమైన ఠాణా ఇదే. ఇక్కడ పోస్టింగ్ దక్కించుకోవటానికి పోటీ ఎక్కువ. ఉన్నతస్థాయి నుంచి సిఫార్సులు చేయించుకుంటుంటారు. ఒక్కోసారి ఎవరికి పోస్టింగ్ ఇవ్వాలో తెలియక ఉన్నతాధికారులే తర్జనభర్జన పడేవారు. అలాంటి స్టేషన్లో మధుసూదన్ నియామకం ఎలా జరిగింది? ఆయన వెనక ఎవరున్నారన్నది పోలీసువర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో ఆయన వైకాపా నేతలకు అనుకూలంగా వ్యవహరించారని తెదేపా వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఆయన నియామకంపై ఆయా వర్గాల నుంచి వచ్చిన వ్యతిరేకతను నిఘా వర్గాలు ప్రభుత్వానికి చేరవేసినట్లు తెలిసింది. మధుసూదన్‌ను వీఆర్‌కు పంపినట్టు పోలీసు వర్గాలు మంగళవారం రాత్రి ధ్రువీకరించాయి