నోరు అదుపులో ఉంటే ఊరు బాగుంటుందని సామెత. అయితే గోదావరి ఖని ఎమ్మెల్యే కు సరిగ్గా ఈ నోరే తంపులు తెచ్చిపెట్టింది. ప్రతిపక్షాలను తిట్టడం వదిలేసి విలేకరులను నానామాటలు అన్నాడు గోదావరి ఖని ఎమ్మెల్యే కోరుకటి చందర్. పెద్దపల్లిలో నిన్న జరిగిన ఎంఎల్ సి టి. భానుప్రసాదరావు సన్మాన సభకు కోరుకంటి చందర్ ను కూడా పిలిచారు. దాంతో ఆయన ఆ సభకు వెళ్లి తన వంతుగా ప్రసంగించారు. మాటల్లో మాటగా ప్రతిపక్షాలను తీవ్రంగా ఆయన విమర్శించాడు. ప్రతిపక్షాలు ఏదేదో వాగుతుంటాయి, వాటిని విని విలేకరులు రాయడం ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. ఆయన ఈ ప్రశ్న వేసి ఊరుకోలేదు. రిపోర్టర్లు చాయి బిస్కెట్లు తిని ప్రతిపక్షాల వార్తలు రాస్తున్నారని వ్యాఖ్యానించారు. దీంతో ఒక్క సారిగా పెద్దపల్లి రిపోర్టర్లు అదే కార్యక్రమంలో నిరసన తెలిపారు. విలేకరులు నిరసన తెలుపడంతో ఒక్క సారిగా ఖంగు తిన్న కోరుకంటి చందర్ తన వ్యాఖ్యల్ని సవరించుకున్నాడు. ఏమని? ఇదే ఆసక్తికరమైన అంశం. ఆయన చెప్పిందేమంటే పెద్దపల్లి రిపోర్టర్ల గురించి నాకు తెలియదు కానీ మా గోదావరి ఖని ప్రెస్ క్లబ్ లో మాత్రం వెయ్యి రూపాయలు ఇస్తే కానీ వార్తలు రాయడం లేదు రిపోర్టర్లు అని మరో కామెంట్ చేశాడు. అంటే పెద్దపల్లి రిపోర్టర్లను గోదావరి ఖని రిపోర్టర్లను అందరిని తిట్టొదిలిపెట్టాడన్నమాట. అయితే రిపోర్టర్లలో కూడా యూనియన్లు ఉంటాయి కదా వారు ఎమ్మెల్యేతో సారీ చెప్పించుకున్నారు. గోదావరి ఖని రిపోర్టర్లు ఏమనలేదు కానీ పెద్దపల్లి రిపోర్టర్లు మాత్రం ఈ రోజు పెద్ద ఎత్తున రాస్తారాకో చేశారు. ఎమ్మెల్యే వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. ఇదీ రాజకీయం…ఇదీ పాత్రికేయం.
previous post
next post