ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ (అలహాబాద్ )లో జరుగనున్న మహాకుంభ మేళలో సెక్టార్ 6 లో వాసుకి ఆలయం ప్రక్కన శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాట్లు చేస్తున్నట్లు టిటిడి ఛైర్మెన్ బీ.ఆర్.నాయుడు వెల్లడించారు. జనవరి 13, 2025 నుంచి ఫిబ్రవరి 26, 2025 వరకు మహాకుంభ మేళ జరుగనున్న నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు చక్కటి ఏర్పాట్లు చేసేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు. రామచంద్ర పుష్కరిణి వద్ద మీడియాతో శనివారం ఛైర్మెన్ మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రయాగ్ రాజ్ లో ఉత్తరాధి భక్తులు శ్రీవారిని దర్శించుకునేలా శ్రీవారి నమూనా ఆలయాన్ని నిర్మిస్తున్నామన్నారు.
తిరుమల తరహాలో శ్రీవారి కల్యాణోత్సవాలు, చక్రస్నానం తదితర కైంకర్యాలు చేపడుతారని చైర్మన్ తెలిపారు. భక్తులను ఆకట్టుకునేలా విద్యుత్, పుష్ప అలంకరణలు చేపట్టాలని సూచించామన్నారు. మహాకుంభ మేళకు సంబంధించి ప్రధాన రోజులలో భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉండడంతో ముందస్తుగా కార్యాచరణ సిద్దం చేశారన్నారు. మహాకుంభ మేళకు టిటిడి అధికారులు సమష్టిగా ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. ఎస్వీబీసీ ద్వారా ఎప్పటికప్పుడు ప్రత్యక్ష ప్రసారాలు అందించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జేఈవో ఎం.గౌతమి, సివిఎస్వో శ్రీధర్, మునిసిపల్ కమిషనర్ ఎన్. మౌర్య, టిటిడి సీఈ సత్యనారాయణ తదితర అధికారులు పాల్గొన్నారు.