30.2 C
Hyderabad
September 14, 2024 16: 34 PM
Slider సంపాదకీయం

పివోకే పై చర్యలకు పావులు కదుపుతున్నారా?

Rajnath singh

జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేయడం ద్వారా ప్రపంచ దేశాలకు మరీ ముఖ్యంగా చైనా, పాకిస్తాన్ లకు స్పష్టమైన సందేశం పంపిన నరేంద్రమోడీ ప్రభుత్వం అంతటితో ఆగేలా కనిపించడం లేదు. ఆర్టికల్ 370ని రద్దు చేయడం అత్యంత క్లిష్టమైన చర్యగా ఇంతకాలం అనుకున్నవారికి ఎంతో తేలికగా చేసి చూపించిన మోడీ ప్రభుత్వం ఇప్పుడు తదుపరి అడుగులు వేస్తున్నది. పాకిస్తాన్ కోరిక మేరకు కాశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్య సమితిలో ప్రస్తావించిన చైనా ఏ మాత్రం ప్రభావం చూపించలేక వెనుదిరగాల్సి వచ్చింది. జమ్మూ కాశ్మీర్ విషయంలో తాము జోక్యం చేసుకునే విషయంగానీ, అసలు ఆ అంశాన్ని ప్రస్తావించడం గానీ తాము అధికారికంగా చేయలేమని ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు స్పష్టం చేయడం కీలక అంశం. ఇది అంతర్జాతీయంగా భారత్ కు ఉన్న శక్తిని తెలియచేస్తున్నది. ఇప్పుడు తదుపరి చర్యగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అంశాన్ని మోడీ ప్రభుత్వం చేపట్టి నట్లుగా అనిపిస్తున్నది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు భారత్ లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని ఇప్పటికే చాలా సందర్భాలలో వెల్లడి అయింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో భారత్ అనుకూల, పాకిస్తాన్ వ్యతిరేక ప్రదర్శనలు ఈ మధ్య కాలంలో తరచూ జరుగుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ లో అమలు జరిగే సంక్షేమ కార్యక్రమాల లాంటివి తమకూ కావాలని అక్కడి ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అంతే కాకుండా కాశ్మీర్ ప్రజలకు స్వతంత్ర నిర్ణయాధికారం ఉండాలని అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ చెబుతున్నట్లుగానే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో కూడా తాము ఎక్కడ ఉండాలో నిర్ణయించుకునే అధికారం తమకు కావాలని కోరుతున్నారు. జమ్మూ కాశ్మీర్ లో 370 అధికరణాన్ని రద్దు చేసిన వెంటనే పాకిస్తాన్ లోని బెలూచిస్తాన్ ప్రావిన్స్ లో కొత్త ఆశలు మొదలయ్యాయి. పాకిస్తాన్ పాలకుల కింద తమకు న్యాయం జరగదని తాము వేరుపడిపోతామని బెలూచిస్తాన్ ప్రజలు ఆందోళన చేస్తున్నారు. భారత్ ఆర్టికల్ 370 రద్దుపై తీసుకున్న నిర్ణయంతో బెలూచిస్తాన్ ప్రజలు సంతోషంగా ఉన్నారు. అదే విధంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో కూడా పరిస్థితి మారిపోయింది. బెలూచిస్తాన్ వ్యవహారంలో భారత్ జోక్యం చేసుకోవడం ప్రత్యక్షంగా కుదిరేపని కాదు కానీ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో భారత్ నేరుగా జోక్యం చేసుకోవడానికి చాలా వరకు వీలు వుంది. గత రెండు రోజులుగా రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పై మన దేశం వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లు అర్ధం అవుతున్నది. చైనా ఆధీనంలో ఉన్న సియాచిన్ ప్రాంతం, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాలు కూడా 370 అధికరణ రద్దు చట్టం, జమ్మూ కాశ్మీర్, లద్దాక్ విభజన చట్టం పరిధిలోనే ఉంటాయని పార్లమెంటులో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. అంటే ఆ భూభాగాలు కూడా జమ్మూకాశ్మీర్ లోనివే అన్నట్లుగా ఆయన చేసిన ప్రకటనపై పాకిస్తాన్ తోబాటు చైనా కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. గత రెండు రోజులుగా రక్షణ శాఖమంత్రి మరో అడుగు ముందుకు వేసి తదుపరి చర్చలు అంటూ పాకిస్తాన్ తో జరిగితే అది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పైనే అని స్పష్టం చేశారు. ఇది హర్యానా ఎన్నికల కోసం చెప్పారా లేక నిజంగానే మోడీ ప్రభుత్వం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పై కఠినచర్యలు తీసుకోవడానికి పావులు కదుపుతున్నదా అనేది త్వరలోనే తేలుతుంది. పాక్ ఆధీనంలో ఉన్న కాశ్మీర్ ప్రాంతాన్ని కూడా విడిపిస్తే మోడీ హవా మన దేశంలో మరో 20 ఏళ్లు ఉంటుంది. ఆధునిక భారత నిర్మాత అనే పేరును జవహర్ లాల్ నెహ్రూ నుంచి తీసేసుకుని తన ఖాతాలో వేసుకుంటారు.

Related posts

ఆరుగురు ఐటి/ కమ్యూనికేషన్ కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతులు

Satyam NEWS

చైనాలో ప్రమాదకర 71 రకాల వైరస్ ల కలకలం

Sub Editor

ఎన్నికల ప్రవర్తనా నియమావళి పై పోలీసుల ప్రత్యేక నజర్

Satyam NEWS

Leave a Comment