30.7 C
Hyderabad
April 23, 2024 23: 11 PM
Slider ప్రత్యేకం

ఒక్క అడుగుతో చైనా గుండెల్లో గునపం

#Narendra Modi

ప్రధాని నరేంద్రమోదీ ఒక్కసారిగా లడాఖ్ లో ప్రత్యక్షమై ప్రపంచాన్ని ఆశ్చర్యపరచారు. చైనాకు ఒక్క సారిగా గుండె ఝల్లుమంది. ఎవ్వరూ ఊహించని ఈ ఎత్తుగడతో చైనాతో పాటు పాకిస్తాన్ కు కూడా షాక్ తగిలింది. నిన్నటి వరకూ పిల్లిలా ఉండి, చైనా అండతో ఇండియాపై ఒంటికాలుతో లేస్తున్న నేపాల్ కు వెన్నులో చలి పుట్టించింది.

మొత్తం మీద, భారత్ ను  శత్రుదేశంగా భావించే దేశాలన్నింటికీ ఇది ఒక హెచ్చరిక. శాంతికాముకమైన భారతదేశం అవసరమైతే  వీరత్వాన్ని చూపిస్తుందనే సందేశం ప్రపంచం మొత్తానికి, ఈ చర్య ద్వారా నరేంద్రమోదీ బలంగా వినిపించారు.

దీనివల్ల,  సరిహద్దులో యుద్ధక్షేత్రంలో ఉన్న మన సైనికులకు ఉత్తేజం, భారతజాతి జనులకు విశ్వాసం  ఏకకాలంలో కలిగాయి. ఈ నేలను వీర భూమిగా గుర్తుచేస్తూ, జల, వాయు, పద, అంతరిక్ష విభాగాల్లో అజేయశక్తి సామర్ధ్యాలు భారత్ కలిగి ఉందని,  ప్రధాని ఉద్ఘాటన చైనాకు దీటైన హెచ్చరికను అందించినట్లయింది.

నెహ్రూ ఇందిరా ఇప్పుడు మోడీ

50ఏళ్ళ తర్వాత, యుద్ధ వాతావరణం కమ్ముకున్న సరిహద్దు ప్రాంతాలకు భారత్ ప్రధాని వెళ్లడం ఇదేనని గమనించాలి. 1971లో బంగ్లాదేశ్ తో యుద్ధసందర్భంలో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వెళ్లారు. ఇండియాకు విజయలక్ష్మిని కూడా అందించారు. ఈ గెలుపు తర్వాత, ఇందిరాగాంధీ అమేయమైన శక్తిగా అవతరించారు.

భారత్ లో దుర్గగా, ప్రపంచంలో శక్తిస్వరూపిణిగా ఆమెను అభివర్ణించారు. తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ ఇందిరాగాంధీ అద్భుతమైన గెలుపు సాధించి, విజయేందిరగా విశేష ఖ్యాతి పొందింది. దీనికి 10ఏళ్ళ ముందు,1962లో, చైనా-భారత్ యుద్ధం నేపథ్యంలో, అప్పటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రు కూడా సరిహద్దు ప్రాంతాన్ని పర్యటించారు.

అప్పుడు జరిగిన యుద్ధంలో భారత్ ఓడిపోయినప్పటికీ, తర్వాత సాగిన చైనా దురాక్రమణ పర్వాలలో ఇండియాదే పైచేయిగా నిలబడింది.1962 మినహా,  దాదాపుగా 60ఏళ్ళ నుండీ, చైనా -భారత్ మధ్య యుద్ధం జరుగలేదు. 1993లో అప్పటి ప్రధానమంత్రి పి.వి నరసింహారావు చైనా -భారత్ శాంతి ఒప్పందం( ట్రాంక్విలిటీ అండ్ పీస్ ) కుదుర్చుకున్నారు. అప్పటి నుండి  మొన్నటి డోక్లామ్ సంఘటన వరకూ సరిహద్దుల్లో  ప్రశాంత వాతావరణమే రాజ్యమేలింది.

తడవ తడవకూ కవ్విస్తున్న దుష్ట చైనా

ఈ మధ్య కొంతకాలం నుండి అలజడులు, ఆందోళనలు, కవ్వింపులు తోపులాటలు చోటుచేసుకుంటున్నాయి. అప్పటి  చైనా దురాక్రమణల పర్వంలో, రెండు వైపులా కొంత ప్రాణ నష్టం జరిగింది. ఎక్కువ నష్టం చైనాకే జరిగింది. ఈ  మధ్య జరిగిన డోక్లామ్ అలజడుల తర్వాత, మళ్ళీ కొన్ని రోజుల నుండి సరిహద్దుల్లో  సాగుతున్న చర్యలు యుద్ధవాతావరణాన్ని తలపింపజేస్తున్నాయి.

20మంది సైనికులను మనం కోల్పోయాం. చైనా అనైతికంగా ప్రవర్తిస్తున్నా, భారత్ హుందాగా, వీరోచితంగా పోరాడుతోంది. శాంతి చర్చలు సాగుతూ ఉన్నప్పటికీ, చైనా కయ్యానికే కాలు దువ్వుతోంది. మనం కూడా యుద్ధానికి సంపూర్ణంగా  సిద్ధమవుతూ ఉన్నాం.

ఒక్క సారిగా మారిపోయిన వాతావరణం

ప్రస్తుతం సరిహద్దుల్లో ఉన్న పరిస్థితుల్లో, రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ అక్కడికి వెళ్లాలని అనుకున్నారు. ఎందుకో, ఒక్కసారిగా వ్యూహం మారింది. సాక్షాత్తు ప్రధానమంత్రి సరిహద్దుల్లో ప్రత్యక్షమై, అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఇరుగుపొరుగు దేశాలని తొక్కేయ్యాలి, సరిహద్దులను ఆక్రమించాలి,అమెరికాను కూడా అధిగమించి,  ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఆధిపత్యం వహించాలి, అనే ఏకైక లక్ష్యంతో చైనా ముందుకు వెళ్తోంది.

తాజాగా, రష్యాలోని ఒక భూభాగం నాదే అంటోంది. అటు అమెరికా -ఇంకోవైపు రష్యా –  ఇటు ఇండియాపై తన ప్రతాపం చూపించాలని చైనా ఉరకలు వేస్తోంది. ఈ పరిణామాల్లో,  ఈ మూడు దేశాలు ఏకమవుతాయి. చైనాకు గట్టిదెబ్బకొడతాయి.  కోరి చైనా  ఈ పరిస్థితులనే తెచ్చుకునేలా కనిపిస్తోంది.

నిషేధాలతో వణుకుతున్న చైనా

చైనాతో పోల్చుకుంటే, భారత్ బలం తక్కువ కావచ్చు. అమెరికా, రష్యా, జర్మనీ, జపాన్ మొదలైన దేశాలన్నీ, ఈ పోరులో భారత్ వైపు నిల్చోడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇన్ని దేశాలను తట్టుకునేంత శక్తి చైనాకు లేనేలేదు. భారతదేశం  చైనాకు వరుసగా షాక్ లు ఇస్తోంది.

మొన్న డిజిటల్ నిషేధాలు, నిన్న రహదారులు, టెలీకాం, రైల్వే సంబంధమైన భాగస్వామ్యాలతో కూడిన ఆర్ధిక, వాణిజ్యాలపై నిషేధాలు, బహిష్కరణల పర్వానికి శ్రీకారం చుట్టడంతోనే చైనాలో ఒణుకు ప్రారంభమైంది. ఇప్పుడు భారత్ ప్రధాని యుద్ధ క్షేత్రంకు వెళ్లి, హెచ్చరికలు ఇవ్వడంతో, ఊహించని ఈ పరిణామాలు చైనాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

 భారత్ ఇంతదూరం వస్తుందని, బహుశా చైనా ఊహించి ఉండదు. వేణువు ఊదే కృష్ణుడిని పూజిస్తాం…. సుదర్శన చక్రంతో పోరాడే కృష్ణుడిని ఆరాధిస్తాం… అని, ప్రధాని చేసిన వ్యాఖ్యల్లో శాంతి -వీరత్వం రెండూ ప్రకటితమయ్యాయి. భారత రాయబార ఘట్టంలో,  దుర్యోధనాదులకు శ్రీకృష్ణ పరమాత్మ చేసిన హితవాక్యాల్లా, సందేశంలా నరేంద్రమోదీ మాటలు ధ్వనిస్తున్నాయి.

విస్తరణ కాంక్షతో సాగే సామ్రాజ్యవాదానికి భరతవాక్యం పలికే దిశగా భారత్ ముందుకెళ్తోంది. చైనాపై భారత్ దే తుది గెలుపు అవుతుంది. మన ప్రధాని నరేంద్రమోదీ శక్తివంతమైన నాయకుడిగా ప్రపంచంలో సుకీర్తి పొందుగాక. జయహో భారత్.

-మాశర్మ, సీనియర్ జర్నలిస్టు

Related posts

జగన్ పాలన: అవినీతి సంత..అడుగుకొక గుంత…

Satyam NEWS

జగన్ పని అయిపోయింది: చంద్రబాబు

Bhavani

ఎలారమింగ్: కట్టు దాటి పోతున్న కరోనా వైరస్

Satyam NEWS

Leave a Comment