33.2 C
Hyderabad
April 26, 2024 01: 02 AM
Slider ప్రపంచం

ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో ఆసక్తి రేకెత్తిస్తున్న మోడీ యూరప్ టూర్

#modi

ప్రధానమంత్రి నరేంద్రమోదీ మూడురోజుల యూరప్ పర్యటనపై అంతటా ఆసక్తి నెలకొని ఉంది. ఉక్రెయిన్- రష్యా మధ్య భీకరంగా పోరు జరుగుతున్న వేళ,తటస్థ వైఖరితో సాగుతున్న భారత్ వైపు అమెరికాతో పాటు యూరప్ దేశాలు కూడా భిన్నంగా చూస్తున్నాయి. రష్యాపై యూరప్ దేశాలన్నీ గుర్రుగానే ఉన్నాయి.

అదే సమయంలో,యూరప్ దేశాలన్నీ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. మిగిలిన దేశాలతో సంబంధాలు ఎలా ఉన్నా, భారత్ పట్ల ఆ దేశాలకు ప్రత్యేక గౌరవం ఉన్నదనే చెప్పాలి.ప్రపంచంలో చైనా తర్వాత అతి పెద్ద దేశమైన భారత్ తో వాణిజ్యపరమైన అవసరాలు కూడా ఉన్నాయి. నరేంద్రమోదీ పర్యటనలో ప్రధానంగా ఇంధన భద్రతపై ప్రధాన చర్చ జరిగే అవకాశం ఉందని మొదటి నుంచీ వినపడుతోంది. పర్యటన తీరులో కూడా అదే ప్రతిబింబిస్తోంది. భారతదేశం సహజంగానే శాంతికాముక దేశమని,

తోటి దేశాలకు సాయం అందించడంలో, ఉభయ తారకంగా వ్యవహరించడంలోనూ ముందుంటుందనే అభిప్రాయం యూరప్ దేశాలన్నింటికీ బలంగా ఉంది. సహకారస్ఫూర్తిని బలోపేతం చేసుకోవడంలోనూ,  ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకోవడంలోనూ ఈ పర్యటన మంచి ఫలితాలను ఇస్తుందనే ఆశాభావాన్ని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.

భౌగోళిక రాజకీయ పరిణామాల నేపథ్యంలో,ఇంధన భద్రతా అంశానికి ప్రాధాన్యం పెరిగింది. జర్మనీ,డెన్మార్క్,ఫ్రాన్స్ దేశాలలో సాగుతున్న ఈ పర్యటనలో ఎనిమిదిమంది ప్రపంచనేతలతో భారత ప్రధాని  చర్చలు జరుతున్నారు. ఈ సమావేశాలన్నీ భారత విదేశీ వ్యవహారాల పరిణతికి, ప్రగతికి దోహదపడితేనే అనుకున్న ప్రయోజనాలు నెరవేరుతాయి.

వివిధ దేశాధినేతలతో పాటు 50మంది అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలతోనూ జరిగే సమావేశాలు భారత ఆర్ధిక ప్రగతికి  ఆసరా ఇవ్వడానికి తోడ్పడాలి. మాతృభూమి ప్రాభావాన్ని పెంచడంలో ప్రవాస భారతీయుల సహకారాన్ని తీసుకోవడం కూడా చారిత్రక బాధ్యత. డెన్మార్క్ నిర్వహిస్తున్న ‘హరిత వ్యూహాత్మక భాగస్వామ్యం’ సదస్సు ఎటువంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి.

మొదటి రోజు పర్యటనలో మన ప్రధానికి అక్కడ సాదర స్వాగతం లభించింది. డెన్మార్క్ ప్రధాని ఫ్రెడెరిక్సన్ అద్భుతమైన స్వాగతం పలికారు.పారిశ్రామిక వేత్తల సదస్సు మొదటి రోజు విజయవంతంగా ప్రారంభమైంది. ఉక్రెయిన్ – రష్యా యుద్ధంతో పాటు,ఇంధన వనరుల ప్రాధాన్యంతో పాటు,కరోనా అనంతర ఆర్ధిక పరిస్థితులు, వాతావరణ మార్పులు, ప్రపంచ భద్రత మొదలైనవన్నీ కీలకమైన చర్చనీయాంశాలు. ఉక్రెయిన్ -రష్యా యుద్ధంపై నరేంద్రమోదీ చేసిన   వ్యాఖ్యలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.

ఈ యుద్ధంలో చివరకు మిగిలేది పెనువిషాదం, విధ్వంసం మాత్రమేనని భారత ప్రధాని యూరప్ దేశాలకు బలంగా తెలిపారు. ఈ కష్టనష్టాలను మాత్రం అందరూ అనుభవించాల్సి వస్తోందనే ఆవేదనను కూడా ఆయన వ్యక్తపరచారు. ఆ రెండు దేశాలు యుద్ధానికి ముగింపు పలికి తీరాల్సిందేనని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేయడం మంచి విషయం.

నరేంద్రమోదీ – జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ తో జరిగిన ముఖాముఖిలో, వారిద్దరి మధ్య ప్రపంచ పరిణామాలపై ఆసక్తికరమైన చర్చ జరిగినట్లు సమాచారం. పర్యావరణ పరిరక్షణ,జీవవైవిధ్యాన్ని కాపాడుకొనే అంశాల్లో జర్మనీ – భారత్ మధ్య ఏకాభిప్రాయం కుదరడం,ఆ దిశగా అడుగులు పడడం మంచి పరిణామం. పర్యావరణ లక్ష్యాలను సాధించడానికి భారత్ కు సహాయం అందించడానికి జర్మనీ ముందుకు రావడం కీలకమైన మలుపు.

వ్యవసాయం,పర్యావరణం, ప్రకృతి వనరుల సుస్థిర నిర్వహణకు సంబంధించి రాయితీతో భారతదేశానికి రుణాలను అందించడానికి జర్మనీ సిద్ధం కావడం,ఆ దిశగా ఒప్పందం కుదరడం మరో మంచి మలుపు. ప్రధాని నరేంద్రమోదీ మూడు రోజుల పర్యటన ముగిసేనాటికి మరిన్ని కీలకమైన ఒప్పందాలు, అంగీకారాలు కుదురుతాయని విశ్వసించవచ్చు.

చమురు ధరలు ఆకాశాన్ని తాకడం, ఆహారం, ఎరువుల కొరత పెరగడం మొదలైనవి ప్రపంచ ప్రజలకు పెనుభారంగా మారాయి. దీనికి ప్రధాన కారణం ఉక్రెయిన్ -రష్యా మధ్య జరుగుతున్న భీకర యుద్ధమే. యుద్ధం ముగింపు దిశగా యూరప్ దేశాలు కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ప్రపంచ మానవాళి శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని తమ విధానాలను కూడా మార్చుకోవాల్సిన తరుణం అందరికీ వచ్చింది. అందులో అమెరికాతో పాటు యూరప్ దేశాలు కూడా ఉన్నాయి.

మాశర్మ, సీనియర్ జర్నలిస్టు

Related posts

ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ సభ్యుడు గా యరగాని నాగన్న గౌడ్

Satyam NEWS

క్రేన్, ద్విచక్ర వాహనం ఢీకొని ఒకరి మృతి

Satyam NEWS

ముత్యపుపందిరివాహనంపై ఆదిలక్ష్మి దేవి అలంకారంలోఅలమేలుమంగ

Satyam NEWS

Leave a Comment