తన తండ్రి మోహన్ బాబును తన అన్న విష్ణు, విద్యాసంస్థలు పర్యవేక్షించే వినయ్ ట్రాప్ చేశారని మంచు మనోజ్ ఆరోపించారు. ‘మా నాన్న అంటే నాకు ప్రాణం.. మా నాన్న దేవుడు. మా నాన్నను మా అన్న విష్ణు, వినయ్ ట్రాప్ చేశారు. మా నాన్న దృష్టిలో నన్ను శత్రువుగా చిత్రీకరించారు.’ అంటూ కన్నీరు పెట్టుకున్నారు మనోజ్. తాను ఏ తప్పు చేయకపోయినా.. తన వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని.. అందులో తప్పేంటని మనోజ్ ప్రశ్నించారు.
పదిమంది కోసం నిలబడ్డానని.. అందుకే తాను చెడ్డగా మారానని మనోజ్ ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబం కోసం గోడ్డులా కష్టపడ్డానన్నారు. పని చేసినందుకు ప్రతిఫలం కూడా అడగలేదన్నారు. ఈరోజు తాను ధైర్యంగా పోరాడకపోతే పెద్ద అయ్యాక నా పిల్లల ముందు తల ఎత్తుకోలేనని అన్నారు. అమ్మ హాస్పిటల్‌లో అడ్మిట్ అయిందని అబద్ధాలు ఆడారన్నారు. గుండెలో దడ ఉంది అంటే హాస్పిటల్‌కి వెళ్ళిందని.. అనంతరం ఆన్న ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకున్నారని మనోజ్ వివరించారు. తన భార్య భూమా మౌనికను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మనోజ్ అన్నారు. తాను, తన భార్య కలిసి ఒక టాయ్స్ కంపెనీ పెట్టామన్నారు.
వాటికి కూడా అడ్డంకులు సృష్టించారని, తనపై దాడులు చేశారని మనోజ్ తీవ్ర ఆరోపణలు చేశారు. తన తండ్రి ముందే తనను కొట్టారని.. తనకు సపోర్ట్ చేస్తున్న తన అమ్మను కూడా డైవర్ట్ చేశారని మనోజ్ ఆరోపించారు. 3 రోజులు బయటకు వెళ్ళు.. మనోజ్‌కి సర్దిచెప్తామని తన అమ్మను నమ్మించారన్నారు. అటు నుంచి ఆస్పత్రిలో చేర్పించారన్నారు. ఆ తరువాత నుంచి తనపై దాడులు మొదలుపెట్టారని మనోజ్ పేర్కొన్నారు. తన భార్య గర్భవతిగా ఉన్నప్పుడు అనేక బాధలు అనుభవించానని మనోజ్ చెప్పారు.