32.7 C
Hyderabad
March 29, 2024 12: 17 PM
Slider సంపాదకీయం

40 మంది వరకూ సిట్టింగులకు టిక్కెట్లు గల్లంతు?

#cmjagan

ప్రస్తుతం ఉన్న 150 మంది వైసీపీ ఎమ్మెల్యేల్లో మొత్తం 27 మందికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు గల్లంతు అయ్యే అవకాశం కనిపిస్తున్నది. ఇప్పటికే కొందరు మళ్లీ పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. మరి కొందరిపై తీవ్ర ప్రజాగ్రహం ఉన్నట్లు వైసీపీ అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. గడప గడపకు కార్యక్రమం నిర్వహించే క్రమంలో మొత్తం 57 మందిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది.

వీరందరి నియోజకవర్గాలలో ప్రత్యామ్నాయ వ్యవస్థ ను ఏర్పాటు చేసేందుకు వైసీపీ అధిష్టానం ప్రయత్నించింది. ఒక్క నియోజకవర్గంలో సహ ఇన్ చార్జి పదవిలో నియామకం జరిపే సరికే ఒక్క సారిగా అసంతృప్తి భగ్గుమన్నది. దాంతో ఆ ప్రయత్నాన్ని వైసీపీ విరమించుకుంది. తర్వాత గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహించే క్రమంలో ముఖ్యమంత్రి జగన్ 27 మంది ఎమ్మెల్యేలపై తన అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేశారు.

అయితే మొత్తం 57 మంది ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు అప్పటిలోనే వార్తలు వచ్చాయి. ఇంత జరిగిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ హెచ్చరికలు చేసినా కూడా ఈ 57 మందిలో మెజారిటీ ఎమ్మెల్యేలు తమ ప్రవర్తన మార్చుకోవడానికి సిద్ధపడలేదు. అయినా సరే పెద్ద ఎత్తున సిట్టింగ్ లను మారిస్తే పార్టీ మనుగడకే ప్రమాదం వస్తుందని వైసీపీ అధిష్టానం భావిస్తన్నట్లు తెలిసింది.

దాంతో 27 మందికి జాబితాను కుదించుకున్నారు. ఈ 27 మందికి మాత్రం ఎట్టిపరిస్థితుల్లో టిక్కెట్లు ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. గడపగడపకు సమీక్షలో సీఎం అసంతృప్తి వ్యక్తం చేసిన 27 మందిలో కొందరు పనితీరు మెరుగుపరచుకున్నా కూడా ఆ తర్వాతి పరిస్థితుల్లో ఇంకొందరి పనితీరు కనిష్టానికి పడిపోయింది దాంతో మొత్తం మీద 27 మంది ఎమ్మెల్యేలకు టిక్కెట్లు నిరాకరించాలనే నిర్ణయానికి వచ్చేసినట్లు చెబుతున్నారు.

రాబోయే ఎన్నికలకు ఎమ్మెల్యే అభ్యర్ధుల ఎంపిక పై ముఖ్యమంత్రి జగన్ సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు. దాంతో ఈ 27 మందికే కాకుండా సిట్టింగ్ లో ఎంత మందికి సీట్లు దక్కుతాయో, ఎంత మంది ని పక్కన పెడతారనేది పార్టీలో ఉత్కంఠ పెంచుతోంది. వై నాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి జగన్ ప్రతీ నియోజకవర్గం విషయంలోనూ ఆచి తూచి వ్యవహరిస్తున్నారు.

అభ్యర్ధుల కంటే పార్టీ ముఖ్యమని ఇప్పటికే సీఎం జగన్ స్పష్టం చేసారు. దీంతో, తాజాగా ఎమ్మెల్యేల పని తీరు, ప్రజల్లో ఆదరణ ఆధారంగా లిస్టు సిద్దం చేసారు. ఇందులో కొందరు సీనియర్లు వెనుక వరుసలో ఉన్నారు. దీంతో, ఇప్పుడు వారికి సీఎం ఏం చెప్పబోతున్నారు..ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది కీలకంగా మారుతోంది. వైసీపీ ఎమ్మెల్యేల్లో సిట్టింగ్ లలో తిరిగి సీట్లు దక్కేదెవరికి? సీట్లు కోల్పోయే ఎమ్మెల్యేలు ఎవరు? ఇప్పుడు ఇదే పార్టీలో చర్చకు దారితీస్తున్నది.

ప్రభుత్వంలో, పార్టీలో కీలక మార్పులు పూర్తి చేసిన ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు ఎమ్మెల్యేల పని తీరు ఆధారంగా నిర్ణయాలకు సిద్దం అవుతున్నారు. ఇప్పటికే సీఎం జగన్ సిట్టింగ్ ల విషయంలో ఒక అంచనాకు వచ్చినట్లు స్పష్టం అవుతోంది. రెండు నెలల క్రితం జరిగిన పార్టీ వర్క్ షాపులో సీఎం జగన్ ప్రత్యేకంగా ఎమ్మెల్యేల పని తీరు గురించి ప్రస్తావించారు.

57 మందిపై నివేదికలు వ్యతిరేకంగా ఉన్నా కూడా  27 మంది ఎమ్మెల్యేల పేర్లు మాత్రమే అక్కడ ప్రస్తావించారు. వారికి ప్రజలతో సత్సంబంధాల విషయంలో వెనకబడి ఉన్నారని హెచ్చరించారు. గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని నిర్దేశించారు. ఆ 27 మంది విషయంలో మాత్రమే టిక్కెట్లు ఇస్తారా లేదా అనే చర్చ పార్టీలో అప్పటిలో ఉండేది.

ఇప్పుడు మారిన పరిస్థితుల దృష్ట్యా 27 మందికి టిక్కెట్లు నిరాకరించాలనే కచ్చితమైన నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ పలు మార్గాల్లో విభిన్న కోణాల్లో ప్రతీ నియోజకవర్గంలో క్షేత్ర స్థాయి సమాచారం సేకరిస్తున్నారు. ఎమ్మెల్యేల పని తీరు, సామాజిక సమీకరణాలు, ప్రజా మద్దతు, ప్రత్యర్ధి పార్టీల అభ్యర్ధులు, ప్రభుత్వం – సిట్టింగ్ ఎమ్మెల్యేపై సానుకూలత అంశాల ఆధారంగా ఈ సమాచారం సేకరిస్తున్నారు.

ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు రేటింగ్స్ లో 11 మంది నిర్దేశిత అంచనాల కంటే వెనుకబడి ఉన్నారని విశ్వసనీయ సమాచారం. ఆశించిన స్థాయిలో పని చేయని వారి జాబితాలో పశ్చిమ గోదావరి, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లా నేతల సంఖ్య ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ఇద్దరు ప్రస్తుత మంత్రులతో పాటుగా నలుగురు మాజీ మంత్రులు ఉన్నట్లు సమాచారం. నిత్యం వార్తల్లో నిలిచే మంత్రి కూడా ఆ జాబితాలో ఉన్నారు.

అయితే, పార్టీ ఫస్ట్.. లీడర్ నెక్స్ట్ అనే విధంగా ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకుంటున్న వేళ వీరికి టికెట్లు వచ్చే అవకాశం లేదని తెలిసింది. ఈ 27 మందితో ఆగుతారా? మరికొందరు సిట్టింగులకు సీట్లు ఎగ్గొడతారా అనే చర్చ కూడా జరుగుతున్నది. పని తీరు మెరుగుగా ఉన్నా కూడా మంత్రి వర్గం విస్తరణ సమయంలో అసంతృప్తి వ్యక్తం చేసిన వారు, పార్టీ ఆదేశాలను పరోక్షంగా విమర్శించేవారు ఇలాంటి క్యాటగిరీలలోని వారికి కూడా టిక్కెట్లు దక్కే అవకాశం కనిపించడం లేదు.

విధేయత కారణంగా ఇంకో 12 నుంచి 15 మంది వరకూ టిక్కెట్లు నిరాకరించే అవకాశం కనిపిస్తున్నది. అంటే మొత్తానికి 40 మంది వరకూ టిక్కెట్లు నిరాకరించే అవకాశం కనిపిస్తున్నదని అంటున్నారు. ఈ సంఖ్య రాబోయే రోజుల్లో మరింత పెరిగినా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదని అంటున్నారు.

Related posts

తిరుమలేశుడి సన్నిధిలో సూపర్ స్టార్  

Murali Krishna

పుష్కరాల్లో సంగీత విభావరి

Sub Editor

ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం

Satyam NEWS

Leave a Comment