ఆది నుంచి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించే కాపు కుల నాయకుడు ముద్రగడ పద్మనాభం ఇప్పుడు ముసుగు తీసేసి వైసీపీలో చేరబోతున్నారు. ఈ మేరకు వైసీపీ కీలక నాయకుడు మిధున్ రెడ్డితో కీలక చర్చలు జరిపారు. వైసీపీ లోక్‌సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కాకినాడ జిల్లా కిర్లంపూడిలో గల ముద్రగడ నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు. దీనిపై ముద్రగడ సానుకూలంగా స్పందించారని, త్వరలోనే తన నిర్ణయాన్ని తెలియజేస్తానని హామీ ఇచ్చారనే ప్రచారం జిల్లా రాజకీయాల్లో సాగుతోంది.
కాపులకు రిజర్వేషన్ కల్పించలేమని బహిరంగ సభలోనే జగన్ మోహన్ రెడ్డి చెప్పినా కూడా ముద్రగడ పద్మనాభం నోరు మెదపలేదు. కాపు కులస్తులకు రిజర్వేషన్ల కోసం అలుపెరగని పోరాటం జరుపుతున్నట్లు చెప్పే ముద్రగడ పద్మనాభం, సాటి కాపు కులస్తుడైన పవన్ కల్యాణ్ ను కూడా పరోక్షంగా విమర్శించేవారు. అన్ని ఈక్వేషన్లు కుదరడంతో ఆయన వైసీపీలోకి వచ్చేందుకు సిద్ధపడ్డారని అంటున్నారు.
పవన్ కల్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తే అక్కడ నుంచి ముద్రగడ పద్మనాభాన్ని రంగంలో దించాలని వైసీపీ భావించి పావులు కదిపింది. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ అంటే గిట్టని ముద్రగడ పద్మనాభం జగన్ పార్టీ వైపు మొగ్గు చూపారు. కాపు సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకులను పార్టీలో చేర్చుకుని జనసేనను ఎదుర్కొవాలని వ్యూహం పన్నిన వైసీపీ ముద్రగడను పార్టీలో చేర్చుకోవడానికి ఆసక్తిగా ఉంది. త్వరలోనే ఆయన అధికార పార్టీ కండువాను కప్పుకొనే అవకాశాలు లేకపోలేదంటూ గతంలోనూ వార్తలొచ్చాయి గానీ అవి వాస్తవ రూపాన్ని దాల్చలేదు.
ఇప్పుడున్న పరిస్థితులు వైఎస్ఆర్సీలో చేరడానికి అనుకూలంగా ఉన్నట్లు ముద్రగడ్డ వర్గీయులు భావిస్తోన్నారు. తునిలో రైలు దగ్ధం కేసులన్నింటినీ జగన్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పెట్టిన కేసులన్నింటినీ అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే వెనక్కితీసుకుంది. ఇటీవలే రైలు దగ్ధం కేసును కూడా కోర్టు కొట్టేసింది. దీనితో తనపై ఎలాంటి ఒత్తిళ్లూ లేవని, రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి ఇదే మంచి సమయం అనే అభిప్రాయంలో ముద్రగడ ఉన్నట్లు తెలుస్తోంది.