మున్సిపల్ ఎన్నికల్లో టికెట్లను అమ్ముకున్నారంటూ కాంగ్రెస్ నాయకులు స్థానిక తీవ్రంగా ఆరోపణ చేశారు. మున్సిపల్ కార్యాలయం ముందు వారు ఆందోళన చేపట్టారు. మతపరమైన చిచ్చు పెడుతూ షబ్బీర్ అలీ సోదరులు పబ్బం గడుపుకుంటున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. అదే విధంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి, మున్సిపల్ ఇంచార్జ్ కాటిపల్లి వెంకట రమణారెడ్డి టికెట్లు అమ్ముకున్నారంటూ బీజేపీ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. బి ఫారాలు సైతం రెండు సెట్లు ఇచ్చారని ఆరోపించారు. అభ్యర్థుల జాబితా ప్రకారం ఒకే బి ఫారం సెట్ ఇవ్వాల్సింది పోయి రెండు ఎలా వస్తాయని ప్రశ్నించారు.
కాంగ్రెస్, బిజెపి నాయకులు 5 నుంచి ఆరు లక్షల రూపాయలకు టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి మున్సిపల్ కార్యాలయం నుంచి బయటకు రాగానే కార్యకర్తలు, అభ్యర్థులు తమకు బి ఫారాలు ఇచ్చేవరకు వదిలేది లేదని చుట్టుముట్టారు. ఒకానొక సందర్భంలో బూతు పురాణం చదువుతూ.. ఆయనపై దాడికి యత్నించారు. ఈ క్రమంలో వివాదం మొదలైంది. ఇరువర్గాలు ఒకరినొకరు కొట్టుకున్నారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఏకే బాలాజీ కింద పడిపోయాడు. దాంతో పోలీసులు తమ లాఠీలకు పని చెప్పగా కార్యకర్తలు పరుగు లంకించారు.