నగరంలోని ఆరోగ్య ప్రాధాన్యాన్ని కలిగించే ఈవెంట్లను ప్రోత్సహిస్తూ, అవంతిక కన్స్ట్రక్షన్స్ మరియు ఇగ్నిటే ఇన్స్టిట్యూషన్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన ఉదయం 6 గంటలకు మియాపూర్ రన్ 2.0’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మియాపూర్ ప్రాంతంలో జరుగనున్న ఈ కార్యక్రమంలో 5 కిలోమీటర్ల ఫన్ రన్, టైమ్డ్ రన్‌తో పాటు 10 కిలోమీటర్ల రన్‌లను నిర్వహించనున్నారు.
దీనిని పురస్కరించుకొని సోమవారం సాయినగర్‌లోని ఇగ్నిటే కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన ప్రత్యేకంగా రూపొందించిన రన్ టీ-షర్ట్లు, విజేతలకు అందించబోయే మెడల్స్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీసీపీ సురేష్ కుమార్ మాట్లాడుతూ.. ఇప్పటి పర్యావరణంలో ప్రజలు ఉద్యోగ, వ్యక్తిగత ఒత్తిడులతో తీవ్రంగా బాధపడుతున్నారన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యంపై దృష్టి సారించటం ఎంతో అవసరం అన్నారు. పరుగు వంటి సాధారణ శారీరక వ్యాయామాల ద్వారా మానసిక ప్రశాంతత కూడా పొందవచ్చన్నారు.
అందుకే ప్రతి ఒక్కరూ ఇటువంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు. ఈ రన్‌కు తొలిసారి ప్రముఖ సంస్థ తెలంగాణ రన్నర్స్ తన సహాయ సహకారాలు అందించనుందని ఈవెంట్‌ను స్థాయి మించిన స్థాయిలో నిర్వహించేందుకు వారి అనుభవాన్ని ఉపయోగించుకుంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వయసు, లింగ భేదమేమీ లేకుండా ఆరోగ్యంతో ముందుకు సాగాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు అన్నారు. ఈ నెల 20వ తేదీన ఆదివారం జరగబోయే ఈ రన్‌లో వేలాది మంది పాల్గొనాలని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆరోగ్యపరంగా అవగాహన పెంచేందుకు, సామాజిక సంబంధాలను బలోపేతం చేసేందుకు ఇది మంచి వేదిక అవుతుందని వారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో కెపిహెచ్బి ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి, ఇగ్నైట్ విద్యాసంస్థల చైర్మన్ రమేష్, అవంతిక కన్స్ట్రక్షన్స్ అధినేత శ్రీనివాస్ రెడ్డి, మరియు తెలంగాణ రన్నర్స్ తరఫున జగన్మోహన్ రెడ్డి, నరేష్ లతోపాటు విద్యాసంస్థలకు చెందిన పలువురు డైరెక్టర్స్, ప్రిన్సిపాల్ లు పాల్గొన్నారు.