గత కొంతకాలంగా జిల్లాలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ఈ రోజు నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ డాక్టర్ వై. సాయి శేఖర్ ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఆర్టీసీ సమ్మెలో పాల్గొనే కార్మికులు గాని మరే ఇతర సంఘాల నాయకులు ఆర్టీసీ బస్సులను అడ్డుకోవడం గానీ, బస్సులపై దాడి చేయడం గానీ, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, ప్రజాసౌకర్యాలకు భంగం కలిగించడం వంటి వ్యతిరేక చర్యలకు పాల్పడితే వారిపై ఇండియన్ పీనల్ కోడ్ లో స్పష్టంగా నిర్వచించబడిన సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేసి వారికి శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. జిల్లాలోని నాగర్ కర్నూల్ ,అచ్చంపేట్, కొల్లాపూర్ , కల్వకుర్తి ఏ ప్రాంతాల్లో అయిన కూడా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినా, బస్సులపై, తాత్కాలిక డ్రైవర్లు మరియు కండక్టర్ల పై దాడి చేసినా, వారిని బెదిరించడం, వారి విధులకు ఆటంకం కలిగించడం, బస్సుల రవాణాను అడ్డుకోవడం వంటి చర్యలకు పాల్పడితే క్రిమినల్ చర్యలు చేపట్టబడును అని,అటువంటి వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు.జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకై పోలీసు శాఖ అన్ని చర్యలు చేపట్టిందని, ప్రజలకు అసౌకర్యం కల్గించే చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని జిల్లా ఎస్.పి. డాక్టర్ వై. సాయి శేఖర్ అన్నారు. ప్రకటన వివరాలు: జిల్లాలోని బస్సు డిపోల వద్ద 144 సెక్షన్ అమలులో ఉన్నది. సమ్మె చేస్తున్న RTC కార్మికులు చట్టానికి లోబడి నడుచుకోవలసి ఉంటుంది. సమ్మె చేసే RTC కార్మికులను ఇకముందు డిపో వద్దకు గానీ, బస్ స్టాండ్ గేట్ల వద్దకు గానీ ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబడదు. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను బెదిరించడం, వారి విధులకు ఆటంకం కలిగించడం, బస్సుల రవాణాను అడ్డుకోవడం వంటి చర్యలకు పాల్పడితే క్రిమినల్ చర్యలు చేపట్టబడును. సమ్మె సందర్భంగా చట్టవిరుద్దంగా ప్రవర్తించిన వారిపై కేసు నమోదు చేస్తూ, ఇట్టి కేసు వివరాలను సంబంధిత అధికారులకు పంపడం జరుగుతుంది. ఈ కేసుల వలన ఉద్యోగులు తమ ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. బస్ స్టాండ్ లో ఇప్పటికే సి.సి. కెమెరాలు ఉన్నాయి. ఈరోజు మరో ఇరవై సి.సి. కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాము. గొడవలు సృష్టించి ప్రయాణీకులకు ఆటంకం కల్గించేవారి వివరాలు నిఘా కెమెరాల ద్వారా ప్రత్యక్ష సాక్ష్యాలుగా స్వీకరించబడును. సమ్మె చేస్తున్న RTC కార్మికులను బస్ స్టాండ్, బస్ డిపో పరిసరాలకు అనుమతించబడదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు శాంతిభద్రతల పరిరక్షణకు గట్టి చర్యలు చేపడతామని, పోలీసు బందోబస్తుకు అందరూ సహకరించాలని జిల్లా ఎస్.పి డాక్టర్ వై. సాయి శేఖర్ విజ్ఞప్తి చేశారు.
previous post
next post