“భారతదేశాన్ని గుంటూరు వైపు తలతిప్పి చూసేలా చేస్తా.. దేశంలో నా గుంటూరు పార్లమెంటును నెంబర్ వన్ గా మారుస్తా.” అని చెప్పిన పెమ్మసాని మాట అక్షర సత్యంగా నిలుస్తోంది. ఒక్కోనెల ఒక్కో నూతన ఆర్ఓబి తో, రహదారులతో పెమ్మసాని గుంటూరు పార్లమెంటులో నిధుల వర్షం కురిపిస్తున్నారు. 9 నెలల కాలంలో వరుసగా ఐదో ఆర్వోబీని మంజూరు చేయించిన పెమ్మసాని గుంటూరు పాలిట అపర భగీరథునిగా కీర్తి గడిస్తున్నారు.
విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రతిపాదనలను కేంద్ర స్థాయిలో పెమ్మసాని పరుగులు పెట్టిస్తున్నారు. ఫలితంగా రైల్వే లెవెల్ క్రాసింగ్ నెంబర్ – 14 ను రూ.129.18 కోట్ల నిధులతో నాలుగు వరుసల ఆర్ఓబి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం మంగళవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రపంచ స్థాయి రాజధాని రూపుదిద్దుకోనున్న క్రమంలో ఈ ఆర్ఓబి ప్రాధాన్యత సంతరించుకోనుంది. 2024 జూన్ లో అధికారంలోకి వచ్చింది మొదలు పార్లమెంట్, రాష్ట్ర అభివృద్ధిపై అటు మంత్రి నారా లోకేష్, ఇటు పెమ్మసాని పట్టువదలని విక్రమార్కుల్లా పనిచేస్తున్నారు.
కేంద్రం నుంచి సాధ్యమైనంత స్థాయిలో నిధుల సమీకరణ ను చేపడుతూ, అభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు ప్రణాళికలు రచిస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే నంబూరు మంగళగిరి ఎల్. సి (రైల్వే లెవెల్ క్రాసింగ్) నెంబర్ – 14 వద్ద ఆర్ఓబి మంజూరుకు ఇరువురు నాయకులు సంయుక్తంగా కలిసి కేంద్ర, రాష్ట్ర స్థాయిలో అధికారులను పరుగులు పెట్టించారు. అలాగే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులు కూడా తమ సమస్యలను వివరిస్తూ ఆ ఆర్ఓబి కోసం అనేక సార్లు పెమ్మసానికి వివరించారు. దీంతో పెమ్మసాని గారు చేసిన ప్రయత్నానికి గాను స్పందించిన కేంద్ర రైల్వే శాఖ మంగళగిరి – నిడమర్రు గ్రామాల మధ్య సుమారు ఒక కిలోమీటర్ పొడవు నిర్మాణ అంచనాతో, రూ 129.18 కోట్ల అంచనా వ్యయంతో నాలుగు వరుసల ఆర్ఓబిని మంజూరు చేస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిన ఆదేశాల మేర గత ఏడాది ఆగస్టులో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవి కి పెమ్మసాని లేఖ రాశారు. అనంతరం అశ్విని వైష్ణవ్ తో పాటు సహాయ మంత్రి సోమన్నతో పలుమార్లు చర్చలు, సంప్రదింపులు జరిపిన పెమ్మసాని ఎట్టకేలకు ఆ ఆర్ఓబిని మంజూరు చేయించుకోవడంలో సఫలీకృతులయ్యారు. అడ్డంకులను అధిగమిస్తూ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎల్సి నెంబర్ 14 వద్ద ఆర్ఓబిని మంజూరు నేడు చేయించగలిగారు.
ఉపయోగాలు
గుంటూరు – విజయవాడ జాతీయ రహదారి నుంచి అమరావతి సచివాలయానికి చేరుకునేందుకు ప్రస్తుతం తుళ్లూరు – మంగళగిరి రహదారి, కృష్ణానది కరకట్ట రోడ్డు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
తాజాగా మంజూరైన ఈఆర్ఓబి ఆయా ప్రాంతాలకు ప్రధాన రహదారి, రవాణా మార్గంగా అందుబాటులోకి రానుంది.
గుంటూరు – విజయవాడ సెక్షన్ ఎల్ .సి నెంబర్ – 14 వద్ద రైల్వే గేటు వల్ల ఏర్పడే ట్రాఫిక్ ఇబ్బందులకు ఈ ఆర్ఓబి రాబోయే రోజులో స్వస్తి పలకనుంది.
రాజధాని నిర్మాణానికి కేంద్రం రూ. 15 వేల కోట్లు మంజూరు చేసిన విషయం విధితమే.
ఈ నిర్మాణాల నేపథ్యంలో రూపుదిద్దుకోనున్న నిర్మాణాల రీత్యా రవాణా మార్గాలకు ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జి కీలకం కానుంది.
ఈ మార్గం గుండా పెదపరిమి, నీరుకొండ, నిడమర్రు, తాడికొండ గ్రామాలతో పాటు ఎస్.ఆర్.ఎం, విట్ యూనివర్సిటీలకు ప్రయాణించే వేలాదిమంది ప్రజలు, విద్యార్థుల రాకపోకలకు కూడా సులభతరం కానుంది.